భైంసారూరల్, న్యూస్‌లైన్ : నైజాం కాలంలో నిర్మించిన సిరాల ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదు. 1902లో నైజాం హాయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో సిరాల, ఇలేగాం, దేగాం, వాలేగాం, ముద్గల్, మచ్కల్, రాంటేక్ ఏడు గ్రామాలకు సాగునీరందేది. ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందేందుకు నైజాం హాయాంలోనే కాలువలు నిర్మించారు. రాను రాను అధికారుల నిర్లక్ష్యంతో కాలువలు పూడుకుపోయాయి. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయింది. ఫలితంగా ఇప్పుడు ఏడు గ్రామాలకు బదులు మూడు గ్రామాల రైతులకు కూడా నీరందడంలేదు.
వైఎస్ చొరవతో...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆయాకట్టు రైతులతో నివేదికలు తెప్పించుకుని అవసరం ఉన్న మేరకు నిధులు మంజూరి చేశారు. రూ. 1.80 కోట్లు మంజూరి చేసి సీసీ కాలువలు నిర్మించారు. సీసీ కెనాల్ నిర్మాణ సమయంలోని ప్రధాన ప్రాజెక్టు మరమ్మత్తులకై అధికారులు దృష్టిసారించలేదు. దీంతో సీసీ కెనాల్ నిర్మించినా రైతులకు ఏ మాత్రం లాభం చేకూరలేదు. ప్రాజెక్టు ప్రధాన తూములు లీకేజీలు వదిలేసి మరో రూ. 2 కోట్లతో ఇంకా సీసీ పనులు చేపడుతున్నారు. సీసీ పనుల కంటే ముందు ప్రాజెక్టుపై దృష్టి సారించాలని ఆయాకట్టు రైతులు కోరుతున్నారు.
నిర్మించిన ఏడాదికే...
సిరాల ప్రాజెక్టు నుంచి ఇలేగాం గ్రామం వరకు మూడు కిలో మీటర్ల మేర నిర్మించిన సీసీ కెనాల్ పనులు అధ్వాన్నంగా ఉన్నాయి. సీసీ కెనాల్‌లో ఇరువైపుల ఉన్న మట్టి జారుకుపోయి పిచ్చిమొక్కలు మొలకెత్తాయి. పిచ్చి మొక్కలతో నీటి ప్రవాహాం ముందుకు వెళ్లడం లేదు. సీసీ కెనాల్‌లో మొలిచిన పిచ్చి మొక్కలు, కాలువల నిర్మాణాలను పగుల గొడుతున్నాయి. మూడు కిలో మీటర్ల మేర ఉన్న సీసీ కెనాల్‌కు ఉన్న తూములకు ఎక్కడ షెట్టర్లు లేవు. దీంతో నీరంతా వృథాగా బయటకుపోతుంది.
తక్షణం చేయాల్సింది...
సిరాల ప్రాజెక్టుపైన ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి. తక్షణమే ప్రధాన తూము మరమ్మత్తులు చేపట్టాలి. మూడు కిలో మీటర్ల మేర ఉన్న సీసీ కెనాల్‌లో పేరుకుపోయిన పూడిక తొలగించాలి. పిచ్చిమొక్కలు తొలగించేసి నీటి ప్రవాహానికి అడ్డంకులులేకుండా చేయాలి. కెనాల్‌కు ఉన్న తూములకు షెట్లర్లు బిగించాలి. లేని పక్షంలో రైతులకు సాగునీరందడం కష్టతరమవుతుంది.
ప్రాజెక్టుపై పట్టింపేది
Published Sun, Jan 12 2014 3:52 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement