sirala project
-
పల్లె కన్నీరు పెడుతోంది!
భైంసా : అప్పుడు సమయం ఉదయం 7.30 గంటలు అప్పటికే ‘సాక్షి’ బృందం భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చేరుకుంది. పనుల్లేక రైతులు ఇళ్ల ముందు కనిపించారు. గతేడాది ఈ సమయానికి సిరాల ప్రాజెక్టు సీసీ కెనాల్ ద్వారా వచ్చే నీటితో పంటలను సాగు చేసే బిజీలో ఉండిపోయారు. కానీ.. ఈ ఏడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. పొలాల్లో పనుల్లేక.. ప్రాజెక్టు నిండక కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నారు రైతులు. ఉదయం 8 గంటలకు ఇలేగాం గ్రామంలోని రైతు కొట్టుర్వా ర్ కేసరి వద్దకు వెళ్లి పొలంలోకి పోలేదా అంటూ అడుగగా.. ‘ఏం జేద్దాం ఆనలు లేవు. చెరు రిండలే. ఆడ వోయి ఏం జేయాల’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. 9.15 నిమిషాలకు రైతు కేసరి వద్దకు గట్టు హన్మంతు, జార్దన్ నర్సింలు, గుద్దేటి సాయన్న, బాబుమియా, అల్లకొండ మాదవ్‌రావు, గోవర్ధన్, ఉప్పు దత్తు వచ్చారు. పొలాలకు వెళ్లాల్సిన రైతులంతా ఆవేదనతో మాట్లాడుకోవడం కనిపించింది. ‘కేసరన్న ఆనలు అస్తయ లేవే పొలాలల్ల ఏమన్న అలుకుదమా తుకం పోశటట్లు కనిపిస్తలేదు’ అంటూ ఉప్పు దత్తు మొదలు పెట్టాడు. ‘తుకం పోశి ఏం జేద్దం. ఇప్పుడే ఇంత లాస్ అయినం. తుకం పోశిన పైసలు మనకోలిస్తలు’ అంటూ రైతు కేసరి సమాధానం ఇచ్చాడు. ‘ఆన దేవుడు సూడకచ్చిండు. ఒక్క ఆన ముంతపోతలు పోస్తే చెరు రిండుతది. దుప్పటి తడుపు ఆనలు వడితే పొలాలకు ఫయిదలేదు’ అంటూ మరో రైతు నర్సింలు మాటకలిపాడు. రైతులంతా ఇలా కష్టాలతో మాట్లాడుతుండగానే తన ఇంటికి వచ్చిన వారితో కలిసి పక్కనే ఉన్న ఖలీల్ హోటల్‌కి వెళ్లిపోయారు. అక్కడే అందరూ కలిసి టీ తాగుతూ కష్టసుఖాలను చెప్పుకున్నారు. రైతులంతా వర్షాలు కురియాలంటూ కోరుకోవడమే వారి మాటల్లో కనిపించింది. 10.40 గంటలకు హోట ల్లో టీ తాగిన రైతులు ‘కేసరి అన్న బాల్బక్రీ ఆడుదామంటూ’ మరో రైతు షాదుల్లా వారి వద్దకు వచ్చాడు. ‘ఏం జేద్దాం అట్లన్న టైంపాసవుతది’ అంటూ రైతు కేసరి షాదుల్లాతో మాట కలిపాడు. మాట్లాడుతుండగానే టీ కొట్టు ప క్కనే రోడ్డుపై నిర్మించిన కల్వర్టుపైకి రైతులంతా వెళ్లారు. పక్కనే 24 చిన్న నల్లని బండరాళ్లను రెండు పెద్ద తెల్లని బం డరాళ్లను తీసుకొచ్చారు. కల్వర్టుపై గీసిన గీతలపై రాళ్లను ఉంచి ఆట మొదలుపెట్టారు. మధ్యాహ్నం 12.10 నిమిషా లకు కడుపులో ఆకలి పడడంతో రైతులంతా ఆట విడుపు ను పక్కన పెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. కేసరి ఇంటికి వెళ్లకుం డా నేరుగా తన పొలానికి చేరుకున్నాడు. పొలంలో మట్టిపెళ్లలు తీస్తూ, గాలికి వచ్చిపడ్డ ముళ్ల పొదలను తీస్తూ గట్టుకు వేస్తూ కనిపించాడు. కాసేపు అలా పని చేశాక పొలంలోకి వచ్చిన గొర్రెల కాపరులతో మాట్లాడారు. ‘అన్న పోయిన యాడాది పొలాలల్ల నాట్లు ఏశిండ్లు. ఈయేడు ఇప్పటిదాకా తుకాలు వోయలే గొర్లకు మేపదలికి సుకమైంది లేకుంటే గుట్టకు పోయి మేపవడుతుండ్య’ అంటూ గొర్రెల కాపరి దన్గరి సాయినాథ్ రైతు కేసరితో మాట్లాడుతూ కనిపిం చింది. ‘పొలాలు మాకు ఫాయిదా జేయకున్న మీ గొర్లకు సుకమైందంటే సాలుమరి’ అంటూ కేసరి అన్నాడు. పచ్చ గా ఉన్న పొలాలన్నీ బీళ్లుగా కనిపించాయి. పొలాల్లో గొర్రెలు, ఆవులు, గేదెలు మేస్తూ కనిపించాయి. 1.18 నిమిషాలకు గొర్రెలు బీడు పొలంలో మేస్తూ ఉంటే.. రైతు కేసరి పక్కనే ఉన్న సీసీ కెనాల్ వైపు నడిచాడు. సిరాల ప్రాజెక్టు నీటితో నిండుగా కనిపించే సీసీ కెనాల్ పెరిగిన తుంగ, గడ్డి మొక్కలతో వట్టిపోయి కనిపించింది. పెరిగిన తుంగను చూసి నీళ్లులేని కాలువలను చూయిస్తూ రైతు కేసరి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రైతుల నసీబ్ కరాబ్ ఉన్నది. కెనాల్లో ఎప్పుడూ నీరు కనిపించేది ఈ ఏడు ఆ పరిస్థితి లేదు. ఆనలు పడితే పొలాల్లో తుకాలు పోశి నాట్లు ఏసుకుంటం. లేకుంటే పొలాల్లో ఏ పంట రాదు’ అంటూ రైతు కేసరి సీసీ కెనాల్లోకి దిగాడు. కెనాల్లో మొలిచిన తుంగను తొలగిస్తూ కనిపించాడు. ‘రేపు నీళ్లు వస్తే తుంగ ఆట్లనే పెరిగిపోతది. ఇప్పుడైతే పనిలేదు. పని లేనప్పుడు ఈ తుంగను తీసేద్దాం’ అంటూ రైతు కేసరి కెనాల్లో పనిచేస్తుండగా మరో రైతు వాగ్మారే గంగాధర్ అటువైపు వచ్చాడు. వాగ్మారే గంగాధర్‌తో నడుస్తూ పక్కనే పంట పొలంలో పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లిపోయాడు. తదుపరి ఇంటికి చేరాడు. -
కానిచ్చేద్దాం..
భైంసారూరల్, న్యూస్‌లైన్ : కోట్లాది రూపాయలు వెచ్చించి చేపడుతున్న నిర్మాణలపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పనుల్లో నాణ్యత లోపిస్తోంది. ఫలితంగా చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. మండలంలోని సిరాల గ్రామంలో ఉన్న సిరాల ప్రాజెక్టు నుంచి దేగాం వరకు సీసీ కాలువ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశ పనులు గత ఏడాది ఇలేగాం వరకు రూ.180లక్షతో పూర్తయ్యాయి. ఇలేగాం నుంచి దేగాం వరకు రెండో దశ కాలువ సీసీ పనులు రూ.210.30లక్షలతో చేపట్టారు. గత ఏడాది మొదటి దశ పనుల్లోనూ అధికారుల పర్యవేక్షణ కొరవడి సీసీ కాలువ అప్పుడే ఆనవాళ్లు కోల్పోయింది. ఏడాది తిరక్కుండానే అధ్వానంగా మారింది. గడ్డి, పిచ్చిమొక్కలతో నిండి పగుళ్లు తేలింది. తూములు లేక నీరంతా వృథాగా బయటకు పోతోంది. మూడు కిలోమీటర్ల మేర చేపట్టిన సీసీ పనుల్లో అధికారుల ముందుచూపు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ పల్లంలో పొలాలు ఎత్తులో ఉండడంతో సాగునీరు అందడం లేదు. ఇప్పుడూ అలాగే.. గత ఏడాది అనుభవాలతోనైనా ఇరిగేషన్ శాఖ అధికారులు తేరుకోలేదు. రైతుల ఇబ్బందులపై సమావేశం నిర్వహించలేదు. ఆయకట్టు రైతులకు మున్ముందు తలెత్తే సమస్యలపై తెలుసుకోలేదు. ఇవేవీ లేకుండా రెండో దశ పనులు చేపట్టారు. ఇసుక దొరకడం లేదన్న సాకుతోనే పక్కనే నాలుగు కిలోమీటర్ల దూరంలోని సుద్దవాగు నుంచి మట్టితో కూడిన ఇసుక తెచ్చి నిల్వ చేశారు. దానితోనే సీసీ పనులు చేపడుతున్నారు. మట్టితోకూడిన ఇసుక వాడకంతో అప్పుడే సీసీ పగుళ్లు తేలి కనిపిస్తోంది. పగుళ్లు తేలిన ప్రాంతాల్లో సిమెంట్ పూతలు వేశారు. నిర్మాణాలు అక్కడక్కడ కూలిపోతున్నాయి. అయినా ఎవరూ స్పందించడం లేదు. నల్లరేగడి నేలల్లో తవ్విన కాలువలకు సరైన క్యూరింగ్ చేయడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే గత ఏడాది దుస్థితే మళ్లీ పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ప్రారంభంలోనే ఉన్నతాధికారులు తేరుకుంటే ఆయకట్టుకు నీరందించే సీసీ కాలువ కలకాలం నిలుస్తుంది. పనులపైనే రైతుల ఆశలు.. ఒకప్పుడు సిరాల ప్రాజెక్టు కింద ఏడు గ్రామాల రైతులు పంటలు పండించుకునేవారు. ప్రాజెక్టులో పూడిక, కాలువ దుస్థితితో ఏడు గ్రామాల ఆయకట్టు మూడు గ్రామాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం సీసీ పనులు మెరుగ్గా సాగితే ఈ మూడు గ్రామాల ఆయకట్టు అయినా పండుతుంది. ప్రస్తుతం సిరాల, ఇలేగాం, దేగాం రైతులకు ఖరీఫ్ సీజన్లో కాలువల ద్వారా నీరు అందిస్తున్నారు. రబీలో ప్రాజెక్టు సామర్థ్యం మేర ఆయకట్టు నిర్ధారిస్తున్నారు. సీసీ పనులు చేపడితే నీరు వృథాపోకుండా అధికారుల లక్ష్యంమేర సాగుకు ప్రయోజనం చేకూరుతుంది. మూడు గ్రామాల్లో నాలుగు వేల ఎకరాలకుపైగానే పంటలు పండుతున్నాయి. -
ప్రాజెక్టుపై పట్టింపేది
భైంసారూరల్, న్యూస్‌లైన్ : నైజాం కాలంలో నిర్మించిన సిరాల ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదు. 1902లో నైజాం హాయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో సిరాల, ఇలేగాం, దేగాం, వాలేగాం, ముద్గల్, మచ్కల్, రాంటేక్ ఏడు గ్రామాలకు సాగునీరందేది. ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందేందుకు నైజాం హాయాంలోనే కాలువలు నిర్మించారు. రాను రాను అధికారుల నిర్లక్ష్యంతో కాలువలు పూడుకుపోయాయి. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయింది. ఫలితంగా ఇప్పుడు ఏడు గ్రామాలకు బదులు మూడు గ్రామాల రైతులకు కూడా నీరందడంలేదు. వైఎస్ చొరవతో... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆయాకట్టు రైతులతో నివేదికలు తెప్పించుకుని అవసరం ఉన్న మేరకు నిధులు మంజూరి చేశారు. రూ. 1.80 కోట్లు మంజూరి చేసి సీసీ కాలువలు నిర్మించారు. సీసీ కెనాల్ నిర్మాణ సమయంలోని ప్రధాన ప్రాజెక్టు మరమ్మత్తులకై అధికారులు దృష్టిసారించలేదు. దీంతో సీసీ కెనాల్ నిర్మించినా రైతులకు ఏ మాత్రం లాభం చేకూరలేదు. ప్రాజెక్టు ప్రధాన తూములు లీకేజీలు వదిలేసి మరో రూ. 2 కోట్లతో ఇంకా సీసీ పనులు చేపడుతున్నారు. సీసీ పనుల కంటే ముందు ప్రాజెక్టుపై దృష్టి సారించాలని ఆయాకట్టు రైతులు కోరుతున్నారు. నిర్మించిన ఏడాదికే... సిరాల ప్రాజెక్టు నుంచి ఇలేగాం గ్రామం వరకు మూడు కిలో మీటర్ల మేర నిర్మించిన సీసీ కెనాల్ పనులు అధ్వాన్నంగా ఉన్నాయి. సీసీ కెనాల్లో ఇరువైపుల ఉన్న మట్టి జారుకుపోయి పిచ్చిమొక్కలు మొలకెత్తాయి. పిచ్చి మొక్కలతో నీటి ప్రవాహాం ముందుకు వెళ్లడం లేదు. సీసీ కెనాల్లో మొలిచిన పిచ్చి మొక్కలు, కాలువల నిర్మాణాలను పగుల గొడుతున్నాయి. మూడు కిలో మీటర్ల మేర ఉన్న సీసీ కెనాల్‌కు ఉన్న తూములకు ఎక్కడ షెట్టర్లు లేవు. దీంతో నీరంతా వృథాగా బయటకుపోతుంది. తక్షణం చేయాల్సింది... సిరాల ప్రాజెక్టుపైన ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి. తక్షణమే ప్రధాన తూము మరమ్మత్తులు చేపట్టాలి. మూడు కిలో మీటర్ల మేర ఉన్న సీసీ కెనాల్లో పేరుకుపోయిన పూడిక తొలగించాలి. పిచ్చిమొక్కలు తొలగించేసి నీటి ప్రవాహానికి అడ్డంకులులేకుండా చేయాలి. కెనాల్‌కు ఉన్న తూములకు షెట్లర్లు బిగించాలి. లేని పక్షంలో రైతులకు సాగునీరందడం కష్టతరమవుతుంది.