భైంసా : అప్పుడు సమయం ఉదయం 7.30 గంటలు అప్పటికే ‘సాక్షి’ బృందం భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చేరుకుంది. పనుల్లేక రైతులు ఇళ్ల ముందు కనిపించారు. గతేడాది ఈ సమయానికి సిరాల ప్రాజెక్టు సీసీ కెనాల్ ద్వారా వచ్చే నీటితో పంటలను సాగు చేసే బిజీలో ఉండిపోయారు.
కానీ.. ఈ ఏడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. పొలాల్లో పనుల్లేక.. ప్రాజెక్టు నిండక కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నారు రైతులు. ఉదయం 8 గంటలకు ఇలేగాం గ్రామంలోని రైతు కొట్టుర్‌వా ర్ కేసరి వద్దకు వెళ్లి పొలంలోకి పోలేదా అంటూ అడుగగా.. ‘ఏం జేద్దాం ఆనలు లేవు. చెరు రిండలే. ఆడ వోయి ఏం జేయాల’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. 9.15 నిమిషాలకు రైతు కేసరి వద్దకు గట్టు హన్మంతు, జార్దన్ నర్సింలు, గుద్దేటి సాయన్న, బాబుమియా, అల్లకొండ మాదవ్‌రావు, గోవర్ధన్, ఉప్పు దత్తు వచ్చారు.
పొలాలకు వెళ్లాల్సిన రైతులంతా ఆవేదనతో మాట్లాడుకోవడం కనిపించింది. ‘కేసరన్న ఆనలు అస్తయ లేవే పొలాలల్ల ఏమన్న అలుకుదమా తుకం పోశటట్లు కనిపిస్తలేదు’ అంటూ ఉప్పు దత్తు మొదలు పెట్టాడు. ‘తుకం పోశి ఏం జేద్దం. ఇప్పుడే ఇంత లాస్ అయినం. తుకం పోశిన పైసలు మనకోలిస్తలు’ అంటూ రైతు కేసరి సమాధానం ఇచ్చాడు. ‘ఆన దేవుడు సూడకచ్చిండు. ఒక్క ఆన ముంతపోతలు పోస్తే చెరు రిండుతది. దుప్పటి తడుపు ఆనలు వడితే పొలాలకు ఫయిదలేదు’ అంటూ మరో రైతు నర్సింలు మాటకలిపాడు.
రైతులంతా ఇలా కష్టాలతో మాట్లాడుతుండగానే తన ఇంటికి వచ్చిన వారితో కలిసి పక్కనే ఉన్న ఖలీల్ హోటల్‌కి వెళ్లిపోయారు. అక్కడే అందరూ కలిసి టీ తాగుతూ కష్టసుఖాలను చెప్పుకున్నారు. రైతులంతా వర్షాలు కురియాలంటూ కోరుకోవడమే వారి మాటల్లో కనిపించింది. 10.40 గంటలకు హోట ల్‌లో టీ తాగిన రైతులు ‘కేసరి అన్న బాల్‌బక్రీ ఆడుదామంటూ’ మరో రైతు షాదుల్లా వారి వద్దకు వచ్చాడు. ‘ఏం జేద్దాం అట్లన్న టైంపాసవుతది’ అంటూ రైతు కేసరి షాదుల్లాతో మాట కలిపాడు. మాట్లాడుతుండగానే టీ కొట్టు ప క్కనే రోడ్డుపై నిర్మించిన కల్వర్టుపైకి రైతులంతా వెళ్లారు. పక్కనే 24 చిన్న నల్లని బండరాళ్లను రెండు పెద్ద తెల్లని బం డరాళ్లను తీసుకొచ్చారు. కల్వర్టుపై గీసిన గీతలపై రాళ్లను ఉంచి ఆట మొదలుపెట్టారు.
మధ్యాహ్నం 12.10 నిమిషా లకు కడుపులో ఆకలి పడడంతో రైతులంతా ఆట విడుపు ను పక్కన పెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. కేసరి ఇంటికి వెళ్లకుం డా నేరుగా తన పొలానికి చేరుకున్నాడు. పొలంలో మట్టిపెళ్లలు తీస్తూ, గాలికి వచ్చిపడ్డ ముళ్ల పొదలను తీస్తూ గట్టుకు వేస్తూ కనిపించాడు. కాసేపు అలా పని చేశాక పొలంలోకి వచ్చిన గొర్రెల కాపరులతో మాట్లాడారు. ‘అన్న పోయిన యాడాది పొలాలల్ల నాట్లు ఏశిండ్లు. ఈయేడు ఇప్పటిదాకా తుకాలు వోయలే గొర్లకు మేపదలికి సుకమైంది లేకుంటే గుట్టకు పోయి మేపవడుతుండ్య’ అంటూ గొర్రెల కాపరి దన్గరి సాయినాథ్ రైతు కేసరితో మాట్లాడుతూ కనిపిం చింది.
‘పొలాలు మాకు ఫాయిదా జేయకున్న మీ గొర్లకు సుకమైందంటే సాలుమరి’ అంటూ కేసరి అన్నాడు. పచ్చ గా ఉన్న పొలాలన్నీ బీళ్లుగా కనిపించాయి. పొలాల్లో గొర్రెలు, ఆవులు, గేదెలు మేస్తూ కనిపించాయి. 1.18 నిమిషాలకు గొర్రెలు బీడు పొలంలో మేస్తూ ఉంటే.. రైతు కేసరి పక్కనే ఉన్న సీసీ కెనాల్ వైపు నడిచాడు. సిరాల ప్రాజెక్టు నీటితో నిండుగా కనిపించే సీసీ కెనాల్ పెరిగిన తుంగ, గడ్డి మొక్కలతో వట్టిపోయి కనిపించింది. పెరిగిన తుంగను చూసి నీళ్లులేని కాలువలను చూయిస్తూ రైతు కేసరి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రైతుల నసీబ్ కరాబ్ ఉన్నది. కెనాల్‌లో ఎప్పుడూ నీరు కనిపించేది ఈ ఏడు ఆ పరిస్థితి లేదు.
ఆనలు పడితే పొలాల్లో తుకాలు పోశి నాట్లు ఏసుకుంటం. లేకుంటే పొలాల్లో ఏ పంట రాదు’ అంటూ రైతు కేసరి సీసీ కెనాల్‌లోకి దిగాడు. కెనాల్‌లో మొలిచిన తుంగను తొలగిస్తూ కనిపించాడు. ‘రేపు నీళ్లు వస్తే తుంగ ఆట్లనే పెరిగిపోతది. ఇప్పుడైతే పనిలేదు. పని లేనప్పుడు ఈ తుంగను తీసేద్దాం’ అంటూ రైతు కేసరి కెనాల్‌లో పనిచేస్తుండగా మరో రైతు వాగ్మారే గంగాధర్ అటువైపు వచ్చాడు. వాగ్మారే గంగాధర్‌తో నడుస్తూ పక్కనే పంట పొలంలో పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లిపోయాడు. తదుపరి ఇంటికి చేరాడు.
పల్లె కన్నీరు పెడుతోంది!
Published Thu, Jul 17 2014 12:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement