కానిచ్చేద్దాం.. | no quality in sirala canal works | Sakshi
Sakshi News home page

కానిచ్చేద్దాం..

Published Thu, Mar 27 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

no quality in sirala canal works

భైంసారూరల్, న్యూస్‌లైన్ : కోట్లాది రూపాయలు వెచ్చించి చేపడుతున్న నిర్మాణలపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పనుల్లో నాణ్యత లోపిస్తోంది. ఫలితంగా చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. మండలంలోని సిరాల గ్రామంలో ఉన్న సిరాల ప్రాజెక్టు నుంచి దేగాం వరకు సీసీ కాలువ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశ పనులు గత ఏడాది ఇలేగాం వరకు రూ.180లక్షతో పూర్తయ్యాయి. ఇలేగాం నుంచి దేగాం వరకు రెండో దశ కాలువ సీసీ పనులు రూ.210.30లక్షలతో చేపట్టారు.

 గత ఏడాది మొదటి దశ పనుల్లోనూ అధికారుల పర్యవేక్షణ కొరవడి సీసీ కాలువ అప్పుడే ఆనవాళ్లు కోల్పోయింది. ఏడాది తిరక్కుండానే అధ్వానంగా మారింది. గడ్డి, పిచ్చిమొక్కలతో నిండి పగుళ్లు తేలింది. తూములు లేక నీరంతా వృథాగా బయటకు పోతోంది. మూడు కిలోమీటర్ల మేర చేపట్టిన సీసీ పనుల్లో అధికారుల ముందుచూపు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ పల్లంలో పొలాలు ఎత్తులో ఉండడంతో సాగునీరు అందడం లేదు.

 ఇప్పుడూ అలాగే..
 గత ఏడాది అనుభవాలతోనైనా ఇరిగేషన్ శాఖ అధికారులు తేరుకోలేదు. రైతుల ఇబ్బందులపై సమావేశం నిర్వహించలేదు. ఆయకట్టు రైతులకు మున్ముందు తలెత్తే సమస్యలపై తెలుసుకోలేదు. ఇవేవీ లేకుండా రెండో దశ పనులు చేపట్టారు. ఇసుక దొరకడం లేదన్న సాకుతోనే పక్కనే నాలుగు కిలోమీటర్ల దూరంలోని సుద్దవాగు నుంచి మట్టితో కూడిన ఇసుక తెచ్చి నిల్వ చేశారు. దానితోనే సీసీ పనులు చేపడుతున్నారు. మట్టితోకూడిన ఇసుక వాడకంతో అప్పుడే సీసీ పగుళ్లు తేలి కనిపిస్తోంది. పగుళ్లు తేలిన ప్రాంతాల్లో సిమెంట్ పూతలు వేశారు. నిర్మాణాలు అక్కడక్కడ కూలిపోతున్నాయి. అయినా ఎవరూ స్పందించడం లేదు. నల్లరేగడి నేలల్లో తవ్విన కాలువలకు సరైన క్యూరింగ్ చేయడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే గత ఏడాది దుస్థితే మళ్లీ పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ప్రారంభంలోనే ఉన్నతాధికారులు తేరుకుంటే ఆయకట్టుకు నీరందించే సీసీ కాలువ కలకాలం నిలుస్తుంది.

 పనులపైనే రైతుల ఆశలు..
 ఒకప్పుడు సిరాల ప్రాజెక్టు కింద ఏడు గ్రామాల రైతులు పంటలు పండించుకునేవారు. ప్రాజెక్టులో పూడిక, కాలువ దుస్థితితో ఏడు గ్రామాల ఆయకట్టు మూడు గ్రామాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం సీసీ పనులు మెరుగ్గా సాగితే ఈ మూడు గ్రామాల ఆయకట్టు అయినా పండుతుంది. ప్రస్తుతం సిరాల, ఇలేగాం, దేగాం రైతులకు ఖరీఫ్ సీజన్‌లో కాలువల ద్వారా నీరు అందిస్తున్నారు. రబీలో ప్రాజెక్టు సామర్థ్యం మేర ఆయకట్టు నిర్ధారిస్తున్నారు. సీసీ పనులు చేపడితే నీరు వృథాపోకుండా అధికారుల లక్ష్యంమేర సాగుకు ప్రయోజనం చేకూరుతుంది. మూడు గ్రామాల్లో నాలుగు వేల ఎకరాలకుపైగానే పంటలు పండుతున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement