సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేటలోని నాసర్‌పురాలో గువ్వల సత్తెవ్వ అనే వృద్ధురాలికి ఉండటానికి కనీసం ఇల్లయినా లేదు. అంతటి ఆ పేదరాలి పింఛను ఏడాదిగా ఆగింది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలవాల్సిన కొందరు నేతలు సామాజిక భద్రత పింఛన్లను పక్కదారి పట్టిస్తున్నారు. అధికార యంత్రాంగం పక్షాన పూర్తి స్వేచ్ఛతో జరగాల్సిన పెన్షన్ల పంపిణీలో నేతల జోక్యం వల్ల అర్హులకు అందకుండాపోతున్నాయి.
పట్టణంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, అభయ హస్తం, గీత కార్మిక, చేనేత పింఛన్ల లబ్ధిదారులు మొత్తం 6,335 మంది ఉన్నారు. డీఆర్‌డీఏ వీరికి నెల నెలా రూ.15 లక్షలు ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పంపిణీ చేస్తోంది. కనీసం రూ.200 గరిష్టం రూ.500గా ఉన్న పెన్షన్ల సొమ్ము దుర్వినియోగం అవకుండా చర్యలకు శ్రీకారం చుట్టారు. డివైస్(మెషీన్)లపై లబ్ధిదారుల వేలిముద్రలు, ఆధార్ సంఖ్య, రేషన్ కార్డు వివరాలను నిక్షిప్తం చేశారు. అలా 5,545 పింఛన్లు మాత్రమే ఎన్‌రోల్(నమోదు) అయ్యాయి. అంటే 790 మంది లబ్ధిదారులు ముందుకు రాలేదన్నమాట. ఈ మిగిలిన జాబితాలోని మనుషులు చాలామటుకు భౌతికంగా పంపిణీ సిబ్బందికి కనిపించడంలేదు. వారికి సంబంధించిన డబ్బులు మాన్యువల్‌గా అక్కడ పెట్టి వెళ్లాలనీ, ఆన్‌లైన్ సిస్టం అంటే కుదరదని కొన్ని నెలలుగా కొందరు నేతలు సిబ్బందిని దురుసుగా హూంకరిస్తున్నారు. నేతల వ్యవహారంపై లోతుగా శోధిస్తే రూ. లక్షల్లో గోల్‌మాల్ వ్యవహారం వెలుగు చూస్తుందని భావిస్తున్నారు.
పింఛన్ల పంపిణీకి ఇక్కడ ఏడుగురు కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్లు(సీఎస్పీ) ఉన్నారు. వారు వార్డులవారీగా పెన్షన్లు అందిస్తున్నారు. అంతా చేస్తే వాళ్లకు నెలకు వచ్చే వేతనం కేవలం రూ. రెండు వేలే. అంతటి చిరుద్యోగులను కొందరు నాయకులు బెదిరిస్తున్నారు. లిస్టుల్లోని పేర్ల ప్రకారం డబ్బులు అప్పజెప్పి వెళ్లాలంటూ దబాయిస్తున్నారు. ఇటు నిబంధనలు ఉల్లంఘించలేక అటు నేతల హెచ్చరికలను తట్టుకోలేక అడకత్తెరలో పోకచెక్క చందంలా నలుగుతున్నారు.
పారదర్శకానికి చర్యలు
డీఆర్‌డీఏ ఏపీఓ జయలక్ష్మి, పంపిణీ ఏజెన్సీ ప్రతినిధి మొయినొద్దీన్, సీఎస్పీలతో మున్సిపల్ కమిషనర్ రాంబాబు తన చాంబరులో శుక్రవారం సమావేశమయ్యారు.
పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రక్షాళనే లక్ష్యంగా సమీక్షించారు. పై అంశాలూ చర్చకు వచ్చాయి. నిబంధనలు పాటించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని సీఎస్పీలకు కమిషనర్ సూచించారు. ఎవరైనా నేతలు ఆంక్షలు విధించినా... అనర్హులకు డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టినా తన పేరు చెప్పాలంటూ మనోస్థైర్యం కలిగించారు. మాన్యువల్ విధానానికి పూర్తిస్థాయిలో త్వరలోనే స్వస్తి పలుకుతామన్నారు. మరి కమిషనర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
పింఛన్లు పక్కదారి
Published Sat, Oct 26 2013 1:37 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement