సాక్షి, నెల్లూరు : నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన మాంసాన్ని నెల్లూరు చికెన్‌స్టాల్ యజమానులు చెన్నైలో తక్కువ నగదు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పద్మావతి సెంటర్‌లో ఓ చికెన్ స్టాల్‌ను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం సదరు స్టాల్‌పై కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఫ్రీజర్లలో భారీగా కుళ్లిపోయిన, నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించారు. సుమారు 350 కేజీలకు పైగా కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్టాల్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న యజమాని, సిబ్బంది అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం మాంసాన్ని డంపింగ్‌యార్డులో పూడ్చిపెట్టాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. స్టాల్‌లో ఏర్పాటు చేసిన ఫ్రీజర్లను సీజ్ చేశారు.
తక్కువ మొత్తంతో..
నగరంలోని కొందరు చికెన్ స్టాల్స్ యజమానులు తక్కువ మొత్తం వెచ్చించి అధికమొత్తంలో నగదు సంపాదించాలని అత్యాశ పడ్డారు. ఈక్రమంలో చెన్నైలోని పలు చికెన్ స్టాల్స్‌లో మిగిలిపోయిన మాంసాన్ని తక్కువ రేట్‌కు కొనుగోలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా కొందరు స్టాల్స్ యజమానులు అక్కడి నుంచి చికెన్‌ను ఇక్కడికి తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం పోలీస్ గ్రౌండ్స్ సమీపంలోని ఓ ఇంట్లో చెన్నై నుంచి దిగుమతి చేసుకున్న మాంసాన్ని కార్పొరేషన్ అధికారులు భారీ స్థాయిలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నగరంలోని పలు చికెన్ స్టాల్స్ యజమానులు ఇదే దారిలో చెన్నైలో నిల్వ చికెన్‌ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి దాడులకు దిగారు. దిగుమతి చేసుకున్న మాంసాన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. మందుబాబులు తాగిన మైకంలో చెడిపోయిన మాంసాన్ని గుర్తించరని ఇలా చేస్తున్నారు.
దాడులు కొనసాగుతూనే ఉంటాయి
నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై, అపరిశుభ్రంగా ఉండే హోటళ్లు, చికెన్ స్టాల్స్‌పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, ఎంహెచ్‌ఓ వెంకటరమణ పేర్కొన్నారు. స్టాల్స్‌లో ఫ్రీజర్లుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు కార్పొరేషన్‌లో వెటర్నరీ వైద్యుడిని నియమించినట్లు తెలిపారు. జంతు వదశాలలో కార్పొరేషన్ ఆమోదించి ముద్రవేసిన మాంసాన్నే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. అనుమానాస్పద దుకాణాలపై ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్యుడు మదన్‌మోహన్, శానిటరీ సూపర్‌వైజర్ ప్రతా ప్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment