ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆరుగురి అరెస్ట్
కావలి/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో పోలీసులు శనివారం ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
కాగా దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ16జెడ్0702) డ్రైవర్ బి.రామ్‌సింగ్ కావలి ట్రంక్‌రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతడు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్‌తో పాటు మరికొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్రవాహనాల్లో బస్సును వెంబడించి మద్దూరుపాడు వద్ద అడ్డుకున్నారు.
డ్రైవర్ రామ్సింగ్ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న కావలి రూరల్ సీఐ ఎం.రాజేశ్ ప్రయాణికులు రోడ్డుపై ఉండటాన్ని గమనించి వివరాలు ఆరా తీశారు. గాయపడిన డ్రైవర్ రామ్సింగ్ను చికిత్స నిమిత్తం వెంటనే కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో మాట్లాడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
డీఎస్పీ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి నేతృత్వంలో కావలి డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం తీవ్రంగా గాలించారు.
కావలిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
కాగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి.
దాడికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నట్టు పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు, అప్పారావు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం సమర్పిసా్తమన్నారు. అంతకుముందు విజయవాడలో చికిత్స పొందుతున్న రామ్సింగ్ను ఈయూ నేతలు పరామర్శించారు.