
బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో మాట్లాడుతున్న జగన్
సమరోత్సాహం వెల్లివిరిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. జై జగన్.. జైజై జగన్ నినాదంతో సభా ప్రాంగణం మారుమోగింది. జిల్లా నలుమూలల నుంచి వెల్లువలా జనసమూహం తరలివచ్చింది. 39 డిగ్రీల తీవ్ర ఎండను సైతం భరిస్తూ తమ అభిమాన నేత రాక కోసం, ఆయన ప్రసంగం కోసం ఎదురుచూశారు. ఒక్కసారిగా వైఎస్ జగన్‌ను చూసి రెట్టించిన సంతోషంతో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయంతో సమరశంఖారావం సభా ప్రాంగణం దద్దరిల్లింది. వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జరిగిన సభలో పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించడంతోపాటు సభావేదిక ముందు ఏర్పాటుచేసిన ర్యాంపుపై తిరుగుతూ బూత్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. సింహపురి గడ్డపై సాగిన సమర శంఖారావం పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని ఎస్‌వీజీఎస్ కళాశాల ప్రాంగంణంలో జరిగిన సభలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించి శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతోపాటు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేలా జోష్ నింపారు. జగన్ మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరులోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు తరలివచ్చారు.
ఈ క్రమంలో పలుచోట్ల పార్టీ శ్రేణులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. తొలుత సూళ్లూరుపేట ఎమ్మెల్యే, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నాయుడుపేట, గూడురు, వెంకటాచలం టోల్‌గేట్ మీదుగా జగన్ నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
దుగ్గరాజపట్నం కట్టి తీరుతాం
వైఎస్ జగన్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సభలో మాట్లాడారు. ప్రధానంగా సూళ్లూరుపేటకు చెందిన బూత్ కమిటీ సభ్యుడు వెంకటేష్ దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో టీడీపీ ఇచ్చిన హమీని విస్మరించిందని చెప్పగా దానికి స్పందించిన జగన్ అందరి ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే దుగ్గరాజపట్నం పోర్టు కట్టి తీరుతామని ప్రకటించారు. జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, సెజ్‌లు ఉన్నాయిని, కానీ వాటిలో తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల వారు పనిచేస్తున్నారని స్థానికంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావడం లేదని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక యువతకు స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు.
ఓటు చూసుకోండి
ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తూ లక్షల సంఖ్యలో ఓట్లు తొలగిస్తోందని, ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీని అభిమానించి ప్రేమించే ప్రతిఒక్కరూ తమ ఓటును సరిచూసుకోవాలిని జగన్ సూచించారు. అలాగే బూత్ కమిటీ సభ్యులు మీకు కేటాయించిన 35 ఇళ్లకు వెళ్లి వారి ఓటర్ల జాబితాను ఒకసారి పరిశీలించాలని, వాటితో పాటు మీ ఓట్లు కూడా ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు.
ర్యాంపుపై అటూ ఇటూ నడుస్తూ..
జగన్ ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల తొలగింపు, సర్కారు కుయుక్తులు మొదలుకుని సభ్యులడిగిన ప్రశ్నలకు బదులివ్వడం వరకూ సుదీర్ఘంగా ప్రసంగం కొనసాగింది. సభా వేదిక నుంచి పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వేదిక ముందు భాగంలో ఉన్న ర్యాంపుపై అటూ ఇటూ నడుస్తూ బదులిచ్చారు. దీంతో సభకు హాజరైన వారిలో ఉత్సాహం రెట్టించింది. మరోవైపు మంగళవారం జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అశేష జనవాహిని ముండుటెండను లెక్కచేయకుండా జగన్ కోసం తరలివచ్చారు. అలాగే రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగం మొత్తం జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
హాజరైన నేతలు
సభలో నెల్లూరు, తిరుపతి మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్ రావు, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య. ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్ కుమార్‌యాదవ్. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సమన్వయకర్తలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మేరళిధర్, బాపట్ల, తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు నేదురుమల్లి రామకుమార్‌రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు ఎల్లసిరి గోపాలరెడ్డితోపాటు అన్ని నియోజకవర్గాల ముఖ్య నేతలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేద్దాం. జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను గెలిపించుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దాం. మన లక్ష్యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంమే.
– నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, తిరుపతి, నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జి
ఓట్లు తొలగింపుపై విచారణ జరిపించాలి
ఓట్ల తొలగింపుపై టీడీపీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారు. ఎవరు పేర్ల మీద ఓటర్లు తొలగించారో ప్రత్యేక విభాగంతో దర్యాప్తు చేయిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఓట్ల తొలగిస్తూనే ప్రతిపక్ష పార్టీపై నిందలు వేస్తున్నారు.
– పంజల సుకుమార్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ జిల్లా బూత్‌కమిటీ కన్వీనర్
టీడీపీకి బుద్ధి చెబుదాం
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుదాం. చంద్రబాబు చేస్తున్న మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియచేసి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే నవరత్నాలను ప్రతి ఒక్కరికీ వివరిద్దాం. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరం కష్టపడి పార్టీని గెలిపించుకుందాం.
– భగవాన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ జిల్లా బూత్‌కమిటీ అబ్జర్వర్
Comments
Please login to add a commentAdd a comment