సాక్షి, వాకాడు(నెల్లూరు) : మత్స్య సంపద పునరుత్పత్తి నేపథ్యంలో 61 రోజుల వేట నిషేధం తర్వాత బతుకు వేటకు సాగరంపై సమరానికి మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. శనివారం తెల్లవారు జాము నుంచి వేటకు బయలుదేరాల్సి ఉండడంతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు ఇంజన్ పడవలు, వలలను సిద్ధం చేసుకుని శుక్రవారం ట్రయల్ వేట సాగించారు. గత కొన్నేళ్లుగా సముద్రంలో ప్రకృతి విపత్తులతో అంతంత మాత్రంగా వేట సాగుతోంది. ఏటా వేట నిషేధ కాలంలో గత ప్రభుత్వం నుంచి సాయం కూడా అందని పరిస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మత్స్యకారులకు వరాలు ప్రకటించడంతో ఉత్సాహంగా ఉన్నారు.
చేపల వేటే జీవనాధారంగా సాగుతున్న మత్స్యకారులు సాగరంపై సమరానికి సిద్ధమయ్యారు. మత్స్య సంపద పునరుత్పత్తి కాలంగా ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటను నిషేధించింది. 61 రోజుల వేట విరామం తర్వాత శనివారం తెల్లవారు జాము నుంచి వేట పునః ప్రారంభవుతోంది. జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారులు తమ వేట సామగ్రిని సంసిద్ధం చేసుకున్నారు. గంగమ్మ తల్లికి పూజలు చేసి వేటకు బయలుదేరుతారు.
వేటే జీవనాధారమైన మత్స్యకారులు రెండు నెలలుగా వేట లేక ఆకలితో అలమటించారు. గత ప్రభుత్వ హయాంలో రెండేళ్లుగా వేట విరామం పరిహారం సక్రమంగా అందించకపోవడంతో ప్రతి ఏడాది 50 నుంచి 60 శాతం మంది మత్స్యకారులు మాత్రమే నిరాశతో వేటకు వెళ్లేవారు. కానీ ఈ సారి కొత్త ప్రభుత్వం మత్స్యకారుల కన్నీళ్లు తుడిచే విధంగా వరాలు కురిపించడంతో పూర్తిస్థాయిలో ఉత్సాహంగా వేటకు బయలుదేరారు. జిల్లాలో 169 కిలో మీటర్ల సముద్ర తీరం వెంబడి 12 మండలా పరిధిలో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.
ఈ గ్రామాల్లో సుమారు 3 లక్షలకు పైగా మత్స్యకార జనాభా ఉంది. అందులో లక్ష మందికి పైగా మెరుగైన జీవనోపాధి కోసం చెన్నై, నాగూరునాగపట్నం, రామేశ్వరం, కడలూరు, తూతుకుడి తదితర ప్రాంతాలకు వలసలు పోయారు. మిగిలిన 2 లక్షల మంది మత్స్యకారులు జిల్లా తీరంలోనే జీవనం సాగిస్తున్నారు. కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో కేవలం వేటపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులు 59 వేల మంది ఉన్నారు. జిల్లాలోని మత్స్యశాఖ అధికారిక రికార్డుల ప్రకారం 18 సోనా బోట్లు, 3,200 ఫైబర్ బోట్లు, 1,500 కొయ్య తెప్పలు ఉన్నాయి.
కానీ వాస్తవంగా మెకనైజ్డ్ పడవలు 7,000 ఉన్నాయి. కొయ్య తెప్పలు 3,000 ఉన్నాయి. వీటిలో ఒకరు నుంచి ఐదు మంది వరకు చేపలు వేట చేయడానికి సముద్రంలోకి వెళ్తారు. నిషేధ సాయానికి కొర్రీలు ∙విరామంలో ఆదుకోని బాబు ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయిన తర్వాత మత్స్యకారులకు రూ.4,000 నగదు పరిహారంగా ఇస్తామన్నారు. దీంతో మొదటి ఏడాది బియ్యం పంపిణీ చేయడాన్ని పూర్తిగా రద్దు చేసి, 2015–16 లో కేవలం రూ.2,000 మాత్రమే పరిహారంగా ఇచ్చారు. జిల్లాలో 59 వేల మంది మత్స్యకారులు చేపలు వేట చేయడం ద్వారా కుటుంబాలను పోషించుకొంటుంటేæ కేవలం 10,916 మందికే పరిహారం ఇవ్వాలని లెక్కలు తేల్చారు.
అయితే వారిలో 7 వేల మందికే పరిహారం అందింది. 2016–17లో 13,114 మందికి రూ.4,000 చొప్పున ఇవ్వాలని తేల్చగా, వారిలో 8 వేల మందికే ఇచ్చారు. 2017–18లో 11,500 మందికి రూ.4,000 చొప్పున పరిహారం అందజేసేందుకు నివేదికలు తయారు చేయగా>, వారిలో 7,500 మందికే అందాయి. 2018–19 లో 13 వేల మందికి పరిహారం అందజేయాలని నివేదికలు సిద్ధం చేశారు. కానీ ఇచ్చినది 8,250 మందికి మాత్రమే. ఇలా జిల్లాలో చేపలు వేట చేసి బతుకుతున్న మత్స్యకారులకు వేట నిషేధ కాలానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం జిల్లాలోని మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారులు, కుటుంబాలను పోషించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పలు పాలవుతున్నారు.
వైఎస్ జగన్ హామీతో ఆనందోత్సాహాలు
ఎన్నికలకు ముందు, ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో వరాలు ప్రకటించారు. సీఎంగా అన్ని వర్గాలకు హామీలు నెరవేరుస్తుండడంతో మత్స్యకారులు తమ భవిష్యత్‌పై భరోసా ఉందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయం రూ.10 వేలకు పెంచుతామని, సబ్సిడీపై డీజల్ అందజేస్తామని, బీమా పరిహారాన్ని రెండింతలకు పెంచడం, బోట్లు రిజిస్ట్రేషన్ తదితర సంక్షేమాలతో జగన్ మత్స్యకారులను ఆదుకోబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment