ఆగని బీద బ్రదర్స్‌ దందా.. | Beeda Brothers Illegal Mining Kavali | Sakshi
Sakshi News home page

ఆగని ‘బీద’ దందా

Published Sat, Jun 15 2019 11:04 AM | Last Updated on Sat, Jun 15 2019 11:06 AM

Beeda Brothers Illegal Mining Kavali - Sakshi

సాక్షి, కావలి(కర్నూలు) : అధికారం అండతో బీద సోదరులు ప్రారంభించిన గ్రావెల్‌ దందాను ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. సొంత అవసరాలకు సామాన్యులు ట్రక్కు గ్రావెల్‌ తరలిస్తుంటే నానా హంగామా చేసే అధికార యంత్రాంగం బీద సోదరులు నిబంధనలకు విరుద్ధంగా లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలిస్తున్నా సంబంధిత మైనింగ్‌ శాఖాధికారులు మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం మారినా కొనసాగుతున్న బీద సోదరుల గ్రావెల్‌ దందాపై దృష్టి సారించకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతి నిత్యం వందల టిప్పర్లతో వెయ్యి ట్రిప్పుల గ్రావెల్‌ రవాణా చేస్తున్నారు. ఏడాదిన్నరగా 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించారు. ఒప్పందాల ప్రకారం  ఇంకా 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ రవాణా చేయాల్సి ఉంది. బీద బద్రర్స్‌ గ్రావెల్‌ దందాతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో చిల్లి పడింది. గ్రావెల్‌ దందా ఒక ఎత్తైతే.. గ్రావెల్‌ తవ్వకాలు సాగించిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఇసుక తరలించి డంప్‌లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఇందు కోసం గ్రావెల్‌ గోతుల్లో బోర్లు కూడా వేసుకుని, అన్ని వసతులు సిద్ధం చేసుకున్నారు.

మొన్నటి వరకు టీడీపీలో కీలక నేతలుగా చెలామణి అయిన సోదరులు సొంత మండలాన్ని కేంద్రంగా చేసుకుని గ్రావెల్‌ దందాకు తెర తీశారు. అధికారం అండతో నిబంధనలకు విరుద్ధంగా బీద సోదరులు తమ బినామీల పేర్లతో గ్రావెల్‌ తవ్వకాల కోసం కొద్ది మొత్తంలో భూములను రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టి లీజుకు తీసుకున్నారు. అయితే సుమారు 170 ఎకరాలను ఆక్రమించారు. మైనింగ్‌ శాఖ నిబంధనల ప్రకారం ఆరడుగుల మేర గ్రావెల్‌ తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే వంద ఎకరాలకు పైబడి 10 నుంచి 17 అడుగుల మేర లోతులో తవ్వేశారు. సుమారు 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించారు. గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు వందల రూ.కోట్ల సీనరైజ్‌ ఎగ్గొట్టి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తున్నారు.  

అల్లూరు మండలం నార్త్‌ ఆములూరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏడాదిన్నర నుంచి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర, బీద గిరిధర్‌ సౌజన్యంతో కొనసాగుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామంలోని సర్వే నంబర్‌ 349/5, 6, 7, 8, 10, 11, 12,  13, 14, 15,  సర్వే నంబర్‌ 351/3, 4, సర్వే నంబర్‌ 350/1, 2, 3, 4, 5, 6, 7, 348/14, 329/1 తదితర సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.  

నాణ్యమైన గ్రావెల్‌ ఇక్కడే
జిల్లాలోని బిట్రగుంట–గూడూరుల మధ్య మూడో రైల్వే లైన్‌ నిర్మాణ పనులను శ్రీనివాస ఇడిఫైస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈపీఎల్‌) చేస్తోంది. ఈ రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనుల్లో గ్రావెల్‌తో నేలను చదును చేయడం అత్యంత కీలకమైన పని. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే రైలు పట్టాలు బిగిస్తారు. అయితే నేలను చదును చేయడానికి అవసరమైన గ్రావెల్‌ నాణ్యమైనది, జిగురు ఎక్కువ శాతం ఉండేది అవసరం. ఈ లక్షణాలు కలిగిన గ్రావెల్‌ అల్లూరు మండలం నార్త్‌ ఆములూరులోని ప్రభుత్వ భూముల్లో ఉంది.  ఏడాదిన్నర క్రితం ఈ పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన నిర్మాణ సంస్థ అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న బీద సోదరులను ఆశ్రయించింది. కోట్లాది రూపాయలు చేతులు మారడంతో గ్రావెల్‌ తవ్వకాలకు పచ్చ జెండా ఊపారు. దీంతో బిట్రగుంట నుంచి గూడూరు వరకు ఇక్కడ నుంచి గ్రావెల్‌ను మూడో లైన్‌కు నిర్మాణానికి తరలిస్తున్నారు.  

50 వేల క్యూబిక్‌ మీటర్ల వరకే అనుమతి
అయితే బీద సోదరులు వివిధ అవసరాల కోసం తమ బినామీల పేర్లతో 110 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. గ్రావెల్‌ తవ్వకాల కోసం ఇక్కడ పది.. పదిహేను ఎకరాల విస్తీర్ణంలో 50 వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ వంద ఎకరాల్లో ఎంత అవసరమో అంత గ్రావెల్‌ యథేచ్ఛగా తవ్వకాలు చేసుకుని తరలించుకోవచ్చని నిర్మాణ సంస్థకు అప్పగించారు. వాస్తవానికి 25 లక్షలు క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ నిర్మాణ సంస్థకు అవసరం కాగా, ఇప్పటి వరకు 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు.

100 టిప్పర్లు, ఐదు పొక్లెయిన్లు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం తవ్వకాలు చేస్తూనే ఉంది. రోజుకు వెయ్యి ట్రిప్పులు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అనుమతించిన ప్రభుత్వ భూములే కాకుండా అనుమతి లేని భూముల్లో కూడా యథేచ్ఛగా తవ్వకాలు చేసేస్తున్నారు. 10 నుంచి 17 అడుగుల లోతులు వరకు తవ్వకాలు చేసి తరలిస్తున్న గ్రావెల్‌ వల్ల ఏర్పడిన గోతుల్లో టిప్పర్లు మరమ్మతులు చేసే గ్యారేజ్‌లు, సిబ్బంది విడిది గదులను ఏర్పాటు చేసుకొన్నారు. బోరు పాయింట్‌ను నిర్మించి నీటిని వినియోగించుకొంటున్నారు.

సమీపంలో ఉన్న పైడేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకొచ్చి గ్రావెల్‌ తరలించగా ఏర్పడిన భారీ గోతులనే ఇసుక డిపోలుగా మలుచుకొని నిల్వ చేస్తున్నారు. బీద సోదరులు అండదండలతో ప్రారంభమైన ఈ అక్రమ గ్రావెల్‌ తరలింపు దందా రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ గ్రావెల్‌ తరలింపు నిర్విరామంగా జరుగుతున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికారిక అంచనాల ప్రకారం రూ.300 కోట్లు విలువ చేసే గ్రావెల్‌ను అక్రమంగా తరలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తవ్వేసిన గ్రావెల్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌ సంస్థకు జరిమానాలు విధించడంతో పాటు తవ్వకాలను ఆపేయడమా? సీనరైజ్‌ వసూలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement