చట్టసభల్లో ‘సింహ’గళం | Nellore Leaders In Legislatures | Sakshi
Sakshi News home page

చట్టసభల్లో సింహగళం

Published Tue, Jun 18 2019 9:44 AM | Last Updated on Tue, Jun 18 2019 9:49 AM

Nellore Leaders In Legislatures - Sakshi

సాక్షి , నెల్లూరు :  రాష్ట్ర అసెంబ్లీలో సింహపురి గళం బలంగా వినిపించింది. పార్లమెంట్‌లో జిల్లా నుంచి ఎన్నికైన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం అసెంబ్లీలో జలవనరుల శాఖ మంత్రి అనిల్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ నరసింహం ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు మాట్లాడిన మాటలకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ జవాబు ఇస్తూ టీడీపీ ఐదేళ్ల పాలనపై, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై ఘాటుగా విమర్శించారు. నీరు లేకుండా చెట్టు లేకుండా రూ.18 వేల కోట్లు చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌లను విస్మరించారంటూ ధ్వజమెత్తారు.

2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిలను ఏనాడు 36 టీఎంసీల నీటిని నిల్వ చేసిన పాపాన పోలేదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే సోమశిల ముంపు గ్రామాలైన వైఎస్సార్‌ జిల్లాలోని బాధితులకు పరిహారం ఇచ్చి 78 టీఎంసీల నీటిని నిల్వ చేయించిన అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. వైఎస్సార్‌ శ్రీకారం చుట్టిన సంగం, పెన్నా బ్యారేజీలను 2014లో సీఎం అయిన చంద్రబాబు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చినా.. ఐదేళ్లలో అడుగు ముందుకు వేయలేదంటూ దుయ్యబట్టారు. 

కుటుంబ హత్యలను రాజకీయ హత్యలుగా ప్రచారమా?
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో జిల్లాకు చేసిందీ ఏమీ లేదని విమర్శించారు. వరుసగా ఓడిపోయిన చంద్రమోహన్‌రెడ్డిని అడ్డదారిలో మంత్రిని చేసి నిత్యం తమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించాలని ఆయనకు పని కల్పించారన్నారు. టీడీపీ కార్యకర్తల్ని చంపేస్తున్నారని చంద్రబాబు గోల చేస్తున్నారని,, సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో చేవూరు శ్రీనివాసులు అనే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది. అయితే ఆయన హత్యకు కారణం వివాహేతర సంబంధం అని అన్ని పత్రికల్లో ప్రచురితమైన పేపర్లను సభలో చూపించి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు మాట్లాడే ముందు కనీసం సరిగ్గా చూసుకోకపోవటం ఏంటని ప్రశ్నించారు. 

బాబును ఏయిర్‌ పోర్టులో భద్రతా దళాలు తనిఖీలను నేరంగా చూపించేలా మాట్లాడటం సరికాదని ఘాటుగా విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఆఖరికి ఆయన కుమారుడుకి రెండు ఉద్యోగాలు.. మూడు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. జాబుల కోసం చంద్రబాబు మాటలు విని ఉమ్మడి కుటుంబాలు సైతం విడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.   

పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం
సోమవారం దేశ రాజధానిలో ఢిల్లీలోని పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమ జరిగింది.   నెల్లూరు నుంచి వైఎస్సార్‌సీపీ నుంచి పార్లమెంట్‌ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాద్‌ మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగులో ప్రమాణం చేయగా, బల్లి దర్గాప్రసాద్‌ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకరాం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు కొందరు ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల అనంతరం ఎంపీలకు మాట్లాడే అవకాశం రానుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement