విన్నపాలు వినని అధికారులు
విజయనగరం కంటోన్మెంట్ : ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కట్టా కృష్ణమూర్తి. డెంకాడ మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ఆయన తన పేరున గ్రామంలో ఎవరో ఇంటి బిల్లు చేసుకున్నారనీ, వాస్తవానికి తాను ఇల్లు కట్టలేదని, బిల్లులు ఎవరు తిన్నారో పరిష్కరించాలని 2010లో గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. కానీ నేటికీ పరిష్కారం కాలేదు. ఇదే వ్యక్తికి అదే సమస్య మీద గృహనిర్మాణ శాఖాధికారులు నీవు గృహనిర్మాణ శాఖలో ఇల్లు నిర్మించుకున్నందున రూ.12వేలు బకాయి ఉన్నావని, ఆ బకాయిని స్వయంగా నెల్లిమర్ల సబ్‌డివిజన్ కార్యాలయంలో చెల్లించాలని నోటీసు ఇచ్చారు.
బాధితుడు కృష్ణమూర్తి ఇంటికి స్వయంగా హౌసింగ్ ఏఈ వెళ్లి నోటీసు అందించడం గమనార్హం! అప్పుడెప్పుడో నా పేరున రుణం వాడారని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశానని, నేను తీసుకోని బిల్లును ఇప్పుడెందుకు చెల్లిస్తానని కృష్ణమూర్తి చెప్పి చూసినా ఏఈ వినిపించుకోలేదు. ఇదీ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్ విభాగం తీరు. ఇక్కడకు వచ్చి ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఇప్పటికీ కొందరు అనుకుంటుంటే చాలా ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయి. సాక్షాత్తు కలెక్టర్ పాల్గొని జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులందర్నీ కూర్చుండబెట్టి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌కు ఇచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకూ పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
జిల్లాలోని పేద, బడుగు వర్గాలే కాకుండా ఇతర వర్గాల వారికీ చాలా సమస్యలున్నాయి. మండల కార్యాలయాల్లో పలు సమస్యలున్నా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో జిల్లా కేంద్రంలోనూ వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. దీని ప్రకారం 1983లో ఫిబ్రవరి 2న జీఓ నంబర్ 2ను విడుదల చేశారు. అయితే ఈ పరిష్కార వేదిక ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడంతో పాటు ప్రజల్లోనూ సరిగా ప్రచారానికి నోచుకోకపోవడంతో 2002 మేనెలలో దీనిపై పెద్ద వర్క్‌షాపును నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ పరిష్కారానికి ఓ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి వారం గ్రీవెన్స్‌సెల్‌కు సగటున 250 వినతులు వస్తున్నాయి. ఇలా ఏటా 12వేలకు పైగానే వినతులు స్వీకరిస్తున్నప్పటికీ దరఖాస్తు దారులకు న్యాయం జరగడం లేదని అంటున్నారు.
గ్రీవెన్స్ సెల్‌లో అధికారులు స్వీకరిస్తున్న వినతులతో పాటు ఇటీవల కేంద్రమంత్రి పి అశోక్ గజపతిరాజు జిల్లా కేంద్రంలోనూ, బొబ్బిలిలోనూ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన 367 వినతులను కలెక్టరేట్‌లోని ప్రజావాణి సెల్‌కు పంపించారు. ఇందులో 209 పరిష్కరించినట్లు చేసినట్టు అధికారులు చూపెడుతున్నారు. అదేవిధంగా మూడింటికి సమాధానమిచ్చామని, మరో 21 తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇంకా 134 వినతులకు మోక్షం కలగలేదు.
ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను పెండింగ్‌లో ఉంచుతున్న అధికారులు ఇక ఎప్పుడు పరిష్కరిస్తారోనని దరఖాస్తు దారులు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌సెల్‌ను తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.