Housing Development
-
రౌత్ అరెస్ట్ చట్టవ్యతిరేకం
ముంబై: ముంబైలోని గోరేగావ్‌లో పాత్రా ఛావల్(సిద్దార్థ్ నగర్) పునర్నిర్మాణాభివృద్ధి ప్రాజెక్టులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టయి కారాగారంలో గడుపుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేసు వాదనల సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే.. కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘ ఈడీ ముందు హాజరయ్యేందుకు రౌత్ సమయం కావాలన్నారు. అంతలోపే అరెస్ట్చేయడం చట్టవ్యతిరేకం. ప్రధాన నిందితులైన హౌజింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్(హెచ్‌డీఐఎల్)కు చెందిన రాకేశ్ వధవాన్, సారంగ్ వధవాన్లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌చేయలేదు? మహారాష్ట్ర హౌజింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) అధికారులను ఎందుకు అరెస్ట్చేయలేదో కారణం చెప్పలేదు. కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈ కేసుతో సంబంధం లేకుండా సివిల్ వివాదంలో అరెస్ట్‌చేశారు. సంజయ్ రౌత్‌ను ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్‌చేశారు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. తర్వాత సంజయ్, ప్రవీణ్‌లకు బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం రాత్రి సంజయ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తోంది. -
విన్నపాలు వినని అధికారులు
విజయనగరం కంటోన్మెంట్ : ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కట్టా కృష్ణమూర్తి. డెంకాడ మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ఆయన తన పేరున గ్రామంలో ఎవరో ఇంటి బిల్లు చేసుకున్నారనీ, వాస్తవానికి తాను ఇల్లు కట్టలేదని, బిల్లులు ఎవరు తిన్నారో పరిష్కరించాలని 2010లో గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. కానీ నేటికీ పరిష్కారం కాలేదు. ఇదే వ్యక్తికి అదే సమస్య మీద గృహనిర్మాణ శాఖాధికారులు నీవు గృహనిర్మాణ శాఖలో ఇల్లు నిర్మించుకున్నందున రూ.12వేలు బకాయి ఉన్నావని, ఆ బకాయిని స్వయంగా నెల్లిమర్ల సబ్‌డివిజన్ కార్యాలయంలో చెల్లించాలని నోటీసు ఇచ్చారు. బాధితుడు కృష్ణమూర్తి ఇంటికి స్వయంగా హౌసింగ్ ఏఈ వెళ్లి నోటీసు అందించడం గమనార్హం! అప్పుడెప్పుడో నా పేరున రుణం వాడారని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశానని, నేను తీసుకోని బిల్లును ఇప్పుడెందుకు చెల్లిస్తానని కృష్ణమూర్తి చెప్పి చూసినా ఏఈ వినిపించుకోలేదు. ఇదీ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్ విభాగం తీరు. ఇక్కడకు వచ్చి ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఇప్పటికీ కొందరు అనుకుంటుంటే చాలా ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయి. సాక్షాత్తు కలెక్టర్ పాల్గొని జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులందర్నీ కూర్చుండబెట్టి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌కు ఇచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకూ పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని పేద, బడుగు వర్గాలే కాకుండా ఇతర వర్గాల వారికీ చాలా సమస్యలున్నాయి. మండల కార్యాలయాల్లో పలు సమస్యలున్నా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో జిల్లా కేంద్రంలోనూ వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. దీని ప్రకారం 1983లో ఫిబ్రవరి 2న జీఓ నంబర్ 2ను విడుదల చేశారు. అయితే ఈ పరిష్కార వేదిక ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడంతో పాటు ప్రజల్లోనూ సరిగా ప్రచారానికి నోచుకోకపోవడంతో 2002 మేనెలలో దీనిపై పెద్ద వర్క్‌షాపును నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ పరిష్కారానికి ఓ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి వారం గ్రీవెన్స్‌సెల్‌కు సగటున 250 వినతులు వస్తున్నాయి. ఇలా ఏటా 12వేలకు పైగానే వినతులు స్వీకరిస్తున్నప్పటికీ దరఖాస్తు దారులకు న్యాయం జరగడం లేదని అంటున్నారు. గ్రీవెన్స్ సెల్లో అధికారులు స్వీకరిస్తున్న వినతులతో పాటు ఇటీవల కేంద్రమంత్రి పి అశోక్ గజపతిరాజు జిల్లా కేంద్రంలోనూ, బొబ్బిలిలోనూ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన 367 వినతులను కలెక్టరేట్లోని ప్రజావాణి సెల్‌కు పంపించారు. ఇందులో 209 పరిష్కరించినట్లు చేసినట్టు అధికారులు చూపెడుతున్నారు. అదేవిధంగా మూడింటికి సమాధానమిచ్చామని, మరో 21 తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇంకా 134 వినతులకు మోక్షం కలగలేదు. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను పెండింగ్‌లో ఉంచుతున్న అధికారులు ఇక ఎప్పుడు పరిష్కరిస్తారోనని దరఖాస్తు దారులు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌సెల్‌ను తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీరేట్లు పావు శాతం తగ్గింపు
మహిళలకు 9.85% వడ్డీకే హోమ్ లోన్ నేటి నుంచి కొత్త రుణాలకు వర్తింపు ఫ్లోటింగ్ రేట్ విధానంలో ఈఎంఐల తగ్గుదల న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేట్లను పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు సోమవారం నుంచి కొత్త గృహ రుణాలకు వర్తిస్తుందని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్(రియల్ ఎస్టేట్, హాబిటాట్, హౌసింగ్ డెవలప్మెంట్) జె. లక్ష్మి వెల్లడించారు. ఇంతకు ముందు 10.15 శాతంగా ఉన్న వడ్డీరేటును 9.9 శాతానికి తగ్గించామని పేర్కొంది. మహిళలకైతే 10.10 శాతం నుంచి 9.85 శాతానికి తగ్గించామని వివరించారు. మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై వడ్డీరేటు బేస్‌రేట్(9.85 శాతంగా)తో సమానంగా ఉందని వివరించారు. ఇతరులకైతే బేస్‌రేట్ కంటే 5 శాతమే అధికమని తెలిపారు. ఈ కొత్త రేట్లు ఈ నెల 13 తర్వాత మంజూరయ్యే కొత్త గృహ రుణాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.ఫ్లోటింగ్ రేట్ విధానంలో గృహ రుణాలు తీసుకున్న ప్రస్తుత రుణ గ్రహీతలకు బేస్ రేట్ తగ్గింపు కారణంగా ఈఎంఐల భారం కొంత తగ్గుతుందని ఎస్బీఐ పేర్కొంది. ఈ నెల 10న ఎస్బీఐ బేస్‌రేటును 0.15 శాతం (9.85 శాతానికి) తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పోల్చితే గృహ రుణాలపై వడ్డీని 0.10 శాతం అధికంగా తగ్గించినట్లయింది. హెచ్డీఎఫ్సీ సంస్థ గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన రెండు రోజుల తర్వాత ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్డీఎఫ్సీ సంస్థ వడ్డీరేట్లను 0.2 శాతం తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత హెచ్డీఎఫ్సీ వడ్డీరేటు 9.9 శాతంగా ఉంది. ఈ తగ్గింపు కొత్త, పాత రుణ గ్రహీతలకు వర్తిస్తుంది.కాగా గత ఏడాది డిసెంబర్ చివరినాటికి ఎస్బీఐ గృహ రుణాలు రూ.1,52,905 కోట్లుగా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ3 నాటికి ఉన్న రుణాల(రూ.1,35,129 కోట్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. హెచ్డీఎఫ్సీ గృహ రుణాలు రూ.1,92,284 కోట్ల నుంచి రూ.2,19,951 కోట్లకు పెరిగాయి. ఫలిస్తున్న రాజన్ మంత్రం కీలక రేట్లను ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు తగ్గించింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాంకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ఈ ఏడాది రెండు సార్లు రేట్లను తగ్గించినప్పటికీ, బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందించలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా కొన్ని బ్యాంక్‌లు బేస్‌రేట్ తగ్గించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు బేస్‌రేట్‌ను పావు శాతం వరకూ తగ్గించాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాయి. గృహ రుణాలపై ఎస్బీఐ తాజా వడ్డీ రేట్లు రుణగ్రహీతలు తాజా గతంలో మహిళలకు 9.85 10.10 ఇతరులకు 9.90 10.15 ఫ్లోటింగ్ రేట్ ఈఎంఐ తగ్గుదల (రూ. లక్షకు) రుణగ్రహీతలు తాజా గతంలో మహిళలకు 867 885 ఇతరులకు 871 889