
ముంబై: ముంబైలోని గోరేగావ్‌లో పాత్రా ఛావల్(సిద్దార్థ్ నగర్) పునర్‌నిర్మాణాభివృద్ధి ప్రాజెక్టులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టయి కారాగారంలో గడుపుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేసు వాదనల సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే.. కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
‘ ఈడీ ముందు హాజరయ్యేందుకు రౌత్ సమయం కావాలన్నారు. అంతలోపే అరెస్ట్‌చేయడం చట్టవ్యతిరేకం. ప్రధాన నిందితులైన హౌజింగ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్టక్చర్(హెచ్‌డీఐఎల్)కు చెందిన రాకేశ్ వధవాన్, సారంగ్ వధవాన్‌లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌చేయలేదు? మహారాష్ట్ర హౌజింగ్, ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంహెచ్‌ఏడీఏ) అధికారులను ఎందుకు అరెస్ట్‌చేయలేదో కారణం చెప్పలేదు.
కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈ కేసుతో సంబంధం లేకుండా సివిల్ వివాదంలో అరెస్ట్‌చేశారు. సంజయ్ రౌత్‌ను ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్‌చేశారు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. తర్వాత సంజయ్, ప్రవీణ్‌లకు బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం రాత్రి సంజయ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment