ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీరేట్లు పావు శాతం తగ్గింపు
- మహిళలకు 9.85%
- వడ్డీకే హోమ్ లోన్
- నేటి నుంచి కొత్త రుణాలకు వర్తింపు
- ఫ్లోటింగ్ రేట్ విధానంలో
- ఈఎంఐల తగ్గుదల
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేట్లను పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు సోమవారం నుంచి కొత్త గృహ రుణాలకు వర్తిస్తుందని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్(రియల్ ఎస్టేట్, హాబిటాట్, హౌసింగ్ డెవలప్‌మెంట్) జె. లక్ష్మి వెల్లడించారు. ఇంతకు ముందు 10.15 శాతంగా ఉన్న వడ్డీరేటును 9.9 శాతానికి తగ్గించామని పేర్కొంది. మహిళలకైతే 10.10 శాతం నుంచి 9.85 శాతానికి తగ్గించామని వివరించారు. మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై వడ్డీరేటు బేస్‌రేట్(9.85 శాతంగా)తో సమానంగా ఉందని వివరించారు. ఇతరులకైతే బేస్‌రేట్ కంటే 5 శాతమే అధికమని తెలిపారు. ఈ కొత్త రేట్లు ఈ నెల 13 తర్వాత మంజూరయ్యే కొత్త గృహ రుణాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.ఫ్లోటింగ్ రేట్ విధానంలో గృహ రుణాలు తీసుకున్న ప్రస్తుత రుణ గ్రహీతలకు బేస్ రేట్ తగ్గింపు కారణంగా ఈఎంఐల భారం కొంత తగ్గుతుందని ఎస్‌బీఐ పేర్కొంది.
ఈ నెల 10న ఎస్‌బీఐ బేస్‌రేటును 0.15 శాతం (9.85 శాతానికి) తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పోల్చితే గృహ రుణాలపై వడ్డీని 0.10 శాతం అధికంగా తగ్గించినట్లయింది. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన రెండు రోజుల తర్వాత ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ వడ్డీరేట్లను 0.2 శాతం తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేటు 9.9 శాతంగా ఉంది. ఈ తగ్గింపు కొత్త, పాత రుణ గ్రహీతలకు వర్తిస్తుంది.కాగా గత ఏడాది డిసెంబర్ చివరినాటికి ఎస్‌బీఐ గృహ రుణాలు రూ.1,52,905 కోట్లుగా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ3 నాటికి ఉన్న రుణాల(రూ.1,35,129 కోట్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలు రూ.1,92,284 కోట్ల నుంచి రూ.2,19,951 కోట్లకు పెరిగాయి.
ఫలిస్తున్న రాజన్ మంత్రం
కీలక రేట్లను ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు తగ్గించింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాంకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ఈ ఏడాది రెండు సార్లు రేట్లను తగ్గించినప్పటికీ, బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందించలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా కొన్ని బ్యాంక్‌లు బేస్‌రేట్ తగ్గించాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు బేస్‌రేట్‌ను పావు శాతం వరకూ తగ్గించాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాయి.
గృహ రుణాలపై ఎస్‌బీఐ తాజా వడ్డీ రేట్లు
రుణగ్రహీతలు తాజా గతంలో
మహిళలకు 9.85 10.10
ఇతరులకు 9.90 10.15
ఫ్లోటింగ్ రేట్ ఈఎంఐ తగ్గుదల (రూ. లక్షకు)
రుణగ్రహీతలు తాజా గతంలో
మహిళలకు 867 885
ఇతరులకు 871 889