‘కోళ్ల’ ఇంట్లో కలెక్టర్‌ కార్యక్రమం! | Official event at MLA's residence | Sakshi
Sakshi News home page

‘కోళ్ల’ ఇంట్లో కలెక్టర్‌ కార్యక్రమం!

Published Thu, Jul 13 2017 3:18 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

‘కోళ్ల’ ఇంట్లో కలెక్టర్‌ కార్యక్రమం!

‘కోళ్ల’ ఇంట్లో కలెక్టర్‌ కార్యక్రమం!

సాక్షి ప్రతిప్రతినిధి, విజయనగరం: ఆయనో ఐఏఎస్‌ అధికారి... చట్టాలు, నిబంధనల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. జిల్లా మేజిస్ట్రేట్‌ హోదాలో ఉన్నారు. అలాంటి వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటికెళ్లి అధికారిక కార్యక్రమాలు చేస్తుండటం జిల్లా ప్రజలను విస్మయపరుస్తోంది. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నివాసం ఎల్‌.కోటలో ఉంది. అక్కడ ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిధిలో లేని జబ్బులకు చికిత్స చేయించుకోవడానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదలైన రూ.32.98 లక్షల చెక్కులను నియోజవర్గంలోని 84 మందికి అందించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ హాజరై లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యేతో కలిసి అందించారు. ఇలా చేయడం మొదటిసారి కాదు.. సబ్సిడీపై వేపాడ, ఎస్‌కోట మండలాలకు చెందిన ఐదుగురు గిరిజన మత్స్యకారులకు ఈ నెల 2న ఆటో రిక్షాలు, ట్రేలు, ఎలక్ట్రానిక్‌ కాటా ఆక్సిజన్‌ సిలిండర్లు పంపిణీ కూడా ఎమ్మెల్యే నివాసంలోనే నిర్వహించారు. మూడు నెలల క్రితం ఇదే విధంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

ఎవరున్నా ఇంతే....
జిల్లా కలెక్టర్‌గా ఎవరు ఉన్నా కోళ్ల లలిత కుమారి నివాసానికి వెళ్లి అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం  ఆనవాయితీగా మార్చేశారు. వివేక్‌యాదవ్‌కు ముందు జిల్లా కలెక్టర్‌గా పని చేసి, ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీగా ఉన్న ఎంఎం నాయక్‌ కూడా ఇదే కూడా విధంగా చేసేవారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులెవరూ అధికారిక కార్యక్రమాల కోసం రాజకీయపార్టీ కార్యాలయాలకు గానీ, ప్రజా ప్రతినిధుల నివాసాలకు గానీ వెళ్లకూడదని ప్రొటోకాల్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అలా వెళ్లాల్సి వస్తే ప్రభుత్వానికి ముందుగా లేఖ రాసి అనుమతి తీసుకోవాలని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement