
నీరు చెట్టు... అధికార పార్టీ కార్యకర్తల ఉపాధికి తొలిమెట్టు.. అక్షరాలా దానిని నమ్మిన తమ్ముళ్లు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. జిల్లాలో మంజూరైన పనులన్నీ వారే చేజిక్కించుకున్నారు. చకచకా పనులు చేసేసి ఎంచక్కా బిల్లులకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఏడునెలలయింది. ఒక్క పైసా విదల్చట్లేదు. మన సర్కారే కదా... బిల్లులు వెంటనే వచ్చేస్తాయిలే అంటూ ఎంతో ఆత్రంగా అప్పుచేసి మరీ పనులు చేస్తే ఇదేంటిలా.. అంటూ అప్పుడు ఉసూరుమంటున్నారు.
విజయనగరం గంటస్తంభం: నీరు చెట్టు పథకం కింద జిల్లాలో చెరువుల్లో మట్టితీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి పనులు చేపట్టిన విషయం విదితమే. జిల్లాలో విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో మొత్తం 1632 పనులు మంజూ రు చేస్తూ... ఇందుకోసం రూ.145 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.50.50కోట్లు విలువైన 617 పనులు చేపట్టారు. ఈ పనులను çసుమారు సగం సాగునీటి సంఘాలు చేయగా మిగతా సగం జన్మభూమి కమిటీల పేరుతో అధికారపార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు చేపట్టారు.
ఒక్కపైసా బిల్లు అందలేదు
ఈ ఏడాది చేపట్టిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి ఇంతవరకు ఒక్క బిల్లు కూడా అందలేదు. వాస్తవానికి నీటిపారుదలశాఖ అధికారులు రూ. 50.50 కోట్ల విలువైన బిల్లులు పేఅండ్ అకౌంట్స్ కా ర్యాలయానికి పంపించారు. అందులో విజయనగరం డివిజన్‌కు సంబంధిం చి రూ. 28కోట్లు విలువైన బిల్లులుంటే పార్వతీపురం డివిజన్‌కు సంబంధిం చి రూ. 22.5కోట్ల విలువైన బిల్లులున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చిన బిల్లులు సంబంధిత అధికారులు ప్రభుత్వానికి పంపుతున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేగానీ బిల్లులు చెల్లించే అవకాశం లేదు.
నిర్వాహకుల అందోళన
ఏప్రిల్ నెల నుంచి బిల్లులు అందకపోవడంతో పనులు చేసిన నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పనులు చేసిన వారిలో సగంమంది వరకు సాగునీటిసంఘాల సభ్యులే ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో సాగునీటిసంఘాల్లో ఉన్న అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సభ్యుల్లో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న వారు 20శాతం మాత్రమే. వీరు పనులు చేసేందుకు చేతి సొమ్ము వినియోగించారు. మిగతావారు పనుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. ఆభరణాలు తాకట్టు పెట్టి మరీ పనులు చేపట్టారు. ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ వైఖరిపై వారు మండిపడుతున్నారు. వాస్తవానికి సాగునీటి సంఘాల్లో అధికారపార్టీ నేతలే 85 శాతం వరకు ఉన్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయినా పార్టీ పరువు పోకుండా ఉండేందుకు బయటకు చెప్పకపోయినా ఆర్థిక సమస్యలు ఎదురవడంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏమి ప్రభుత్వమంటూ నిట్టూర్చుతున్నారు.
ఇన్ని నెలలు పెండింగ్‌లో పెడితే ఎలా...
ఇదిలాఉంటే జన్మభూమి కమిటీల పేరుతో చేసిన వారిలో శ్రీమంతులు 40శాతం మించి ఉండరు. మిగతావారు చేతిలో సొమ్ములు లేకపోయినా ఇతరులపై ఆధారపడి పనులు చేశారు. ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమదని, పనులు చేయాలని సరదా పడి చేస్తే ఇప్పుడు ఆ సరదా తీరిందని మదన పడుతున్నారు. ఇన్ని నెలలు బిల్లులు పెండింగా? అంటూ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్లదీ అదే పరిస్థితి. ఇప్పుడు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇలాగే పరిస్థితులుంటే తర్వాత పనులు చేయడానికి ఎవరూ ముందుకు రారని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం నీటిపారుదలశాఖ ఈఈ ఎం.వి.రమణ వద్ద సాక్షి ప్రస్తావించగా బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమని, ఆ విషయం తమ పరిధిలో లేదన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉందని, వారం, పదిరోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment