‘బాబో’య్‌ కాటంనేని | Officials Fear With Katamneni Bhaskar Behave in Collectorate | Sakshi
Sakshi News home page

‘బాబో’య్‌ కాటంనేని

Published Mon, Feb 11 2019 7:40 AM | Last Updated on Mon, Feb 11 2019 7:40 AM

Officials Fear With Katamneni Bhaskar Behave in Collectorate - Sakshi

కొత్త కలెక్టర్‌ పొద్దెరగడం లేదు... ఇప్పుడు కలెక్టరేట్‌లో ఏ సెక్షన్‌లో ఎవరిని కదిలించినా ఇదే మాట..ఏ సెక్షన్‌ అంటే ఏ ఒక్కటే కాదు.. ఎ టు జెడ్‌ ఎవరిని కదిపినా.. అదే భయం.ఉన్నతాధికారుల మొదలు కింది స్థాయి సిబ్బంది వరకు కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ దెబ్బకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడున్నర గంటల మొదలు రాత్రి ఎనిమిదిన్నర వరకు కలెక్టరేట్‌లోనే కాటంనేని మకాం వేసేస్తున్నారు.ఉదయం పూట కొన్ని సెక్షన్లను మాత్రమే రావాలని ఆయన నిర్దేశిస్తున్నప్పటికీ ఏకంగా కలెక్టర్‌ ఏడున్నరకు వచ్చి కూర్చుంటే పదిగంటలకు తాము వస్తే ఏం బాగుంటుందని మిగిలిన సెక్షన్ల అధికారులూ ఈసురోమంటూ ఏడున్నరకే వచ్చేస్తున్నారు.

ఇక వెళ్లేటప్పుడూ అదే తంతు... సరే టైంది ఏముందిలే మూడు, నాలుగుగంటలు ఎక్స్‌ట్రా చేసేద్దామని మెంటల్‌గా ప్రిపేర్‌ అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఎలా ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడో.. ఏం యాక్షన్‌ తీసుకుంటాడోనని భయపడిపోతున్నారు.కాటంనేని రాక సమాచారంతోనే పశ్చిమగోదావరి ట్రాక్‌ రికార్డ్‌ చూసి భయపడిపోయిన ఉద్యోగులకు ఊహించినట్టుగానే మొదట్లోనే ఝలక్‌ తగిలింది.సమస్య చెప్పుకుందామని వచ్చిన ఓ మాజీ అధికారిపై పోలీస్‌ యాక్షన్‌కు దిగడం చూసి అందరూ బెంబేలెత్తిపోయారు.ఇక పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చేందుకు గానూ కొత్తగా వచ్చిన తహసీల్దార్లకు శనివారం రాత్రి నరకం చూపించిన వైనంతో ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులు బాబోయ్‌ కాటంనేని అని వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెవెన్యూ ఉద్యోగులు ఊహించిందే జరుగుతోంది. గత నాలుగైదు నెలల నుంచి కొత్త కలెక్టర్‌గా కాటంనేని భాస్కర్‌ వస్తున్నారంటేనే కలెక్టరేట్‌ ఉద్యోగులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో కాటంటేని సుదీర్ఘ హయాం నాలుగున్నరేళ్ల కాలంలో ఉద్యోగులు, అధికారులు పడిన ఇబ్బందులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటేనే ఉద్యోగుల వెన్నులో వణుకు మొదలైంది.
2014 జూలై వరకు వాణిజ్య మంత్రిత్వశాఖలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన కాటంనేని భాస్కర్‌ తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్‌ అయిన తొలినాళ్లలోనే చీటికీమాటికీ షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారంటూ జిల్లా వ్యాప్తంగా 40మంది ఎంపీడీవోలు తిరుగుబాటు చేశారు. సామూహిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించి కాటంనేనిని జిల్లా నుంచి బదిలీ చేయాలని రోడ్డెక్కారు. అప్పటి గనులశాఖ మంత్రి పీతల సుజాత దగ్గరుండి పంచాయితీ చేసి ఇకపై అకారణంగా షోకాజ్‌లు జారీ చేయరని హామీనివ్వడంతో సద్దుమణిగింది. కానీ ఆ తర్వాత కూడా ఆయన తీరులో మార్పు రాకపోగా మరింతగా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారన్న పేరు తెచ్చుకున్నారు.
సమయపాలన లేకుండా ఎప్పడుపడితే అప్పుడు సమీక్షా సమావేశాలకు రాలేక, నోటికొచ్చినట్టు మాట్లాడే ఆయన దూషణలు భరించలేక అప్పట్లో ఆ జిల్లా డీటీసీ సిహెచ్‌ శ్రీదేవి ఉద్యోగ సంఘాల నేతల వద్ద బోరున విలపించి వేరే జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు.
‘ఉపాధ్యాయులు కదిలే శవాలు’ అని ఓసారి చేసిన వ్యాఖ్యతో భగ్గుమన్న మాస్టార్లు ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. చివరకు తాను అలా అనలేదని, ఇకపై ఉపాధ్యాయులను ఆ విధంగా దూషించనని చెప్పడంతో ఎట్టకేలకు ఆందోళన ఆగింది.
కాటంనేని వ్యవహారశైలిని వ్యతిరేకించిన ఉద్యోగ సంఘ నేత ఎల్‌.విద్యాసాగర్‌ను వెంటాడి.. వేధించి వ్యక్తిగత జీవితంలోని వివాదాలను రోడ్డెక్కించి.. కేసులు పెట్టి.. చివరికి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. విద్యాసాగర్‌ ఓ దశలో కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.
ఎర్రకాలువ ఆధునికీకరణ పనుల విషయంలో అర్ధరాత్రి ఆకస్మిక పరిశీలనకు తాను వస్తున్నానని చెప్పడంతో అనిల్‌కుమార్‌ అనే అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అర్ధరాత్రి సమయంలో హడావిడిగా వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇప్పటికీ ఆయన విధులకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇక ఇరిగేషన్‌ అధికారులను కుక్కల బండి ఎక్కించి, చిప్పకూడు తినిపిస్తాను అని చేసిన తీవ్ర వ్యాఖ్యలు  ఇరిగేషన్‌ శాఖలో తీవ్ర దుమారాన్నే రేపాయి.
ఓ సందర్భంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులను సమావేశ మందిరంలో ఏకంగా రెండు గంటలపాటు నిల్చోబెట్టిన సందర్భమూ వివాదమైంది.
ఇలా చెప్పుకుంటూపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన వచ్చే ముందే తెలుసుకున్న విశాఖ అధికారులు ఒకింత భయపడుతూనే వచ్చారు. మొదటి రోజు నుంచే ఆయన తీరు చూసి మరింత జాగ్రత్తగా ఉందాం అని మానసికంగా సిద్ధమయ్యారు. ఆయన సామాజిక వర్గ నేపథ్యం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌బాబులతో ఉన్న సాన్నిహిత్యం,  పూర్తిగా గ్రామీణ నేపథ్యమున్న పశ్చిమగోదావరి జిల్లాలో పనితీరు, పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యత.. వెరసి కాటంనేని అక్కడ ఎలా ఉన్నా చెల్లుబాటైందన్న వాదనలు ఉన్నాయి. కానీ మహావిశాఖ నగరం, గ్రామీణం. మన్యం కలబోత అయిన విశాఖ వంటి వినూత్న జిల్లాలో ఆయన వర్కింగ్‌ స్టైల్‌ మారుతుందని ఆశించారు.

ఇక్కడా అదే తరహా వర్కింగ్‌ స్టైల్‌ చూసి విశాఖ జిల్లా ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కలెక్టరేట్‌లోనే యూఎల్‌సీ విభాగంలో డెప్యుటీ తహసీల్దార్‌గా పనిచేసి రిటైర్‌ అయిన ఎల్‌.విజయ్‌కుమార్‌ ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్య చెప్పుకునేందుకు గత సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. 2013లో రిటైర్‌ అయిన ఈయనకు నేటికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రాలేదు. మూడు పీఆర్సీలు అమలు కాలేదు. 13కు పైగా ఇంక్రిమెంట్లు పడలేదు. మరీ ముఖ్యంగా దాదాపు ఆరేళ్లుగా పెన్షన్‌ రావడం లేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోలేదంటూ ఆయన కలెక్టర్‌ ఎదుట ఒకింత ఆవేశపూరిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతే చిర్రెత్తుకొచ్చిన కలెక్టర్‌ అతను విధులకు విఘాతం కల్గించారన్న అభియోగంపై ఫిర్యాదు చేయాల్సిందిగా డీఆర్‌వోను ఆదేశించారు. డీఆర్‌వో ఆదేశాల మేరకు కలెక్టరేట్‌ బీట్‌ చూసే పోలీసు సిబ్బంది రిటైర్డ్‌ డీటీ విజయకుమార్‌ను బలవంతంగా అక్కడ నుంచి మహారాణి పేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సెక్షన్‌ 186, సెక్షన్‌ 188 కింద కేసులు నమోదు చేశారు. గోడు చెప్పుకుంటే కేసులు పెడతారా? అంటూ విజయకుమార్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఉదంతంపై ‘సాక్షి’లో ప్రముఖంగా రావడంతో వెంటనే వెనక్కి తగ్గిన కలెక్టరేట్‌ వర్గాలు రిటైర్డ్‌ డీటీపై కేసుపెట్టలేదని ప్రకటించుకుని ఆయనతో చర్చలు జరిపాయి.

ఇక కొత్తగా జిల్లాకు బదిలీపై వచ్చిన సుమారు 45 మంది తహసీల్దార్లకు సెలవురోజైన రెండో శనివారం ఆర్డర్లు ఇస్తామని కలెక్టరేట్‌కు పిలిపించారు. ఉదయం 9గంటలకే రిపోర్ట్‌ చేసిన వారిని రాత్రి 10 గంటల వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకునే సరికి హడావుడిగా ఆర్డర్లు ఇచ్చి పంపించారు.

ఇక్కడా అదే అసహనం
ఈ రెండు ఘటనలే కాదు... కలెక్టరేట్‌ సిబ్బంది అప్పుడే కాటంనేని తీరుపై తీవ్ర అసంతృప్తికి గురవుతూ బయటకు చెప్పలేక మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. తానొక్కడే నిజాయితీ పరుడునని భావిస్తూ.. మిగిలిన అందరినీ అనుమానిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలు, తానొక్కడే పనిచేసే వాడినని.. మిగిలిన వారంతా పనితప్పించుకునే వారే అనే విధంగా ఆయన వ్యవహారశైలితో కలెక్టరేట్‌ వర్గాలు తీవ్ర మదనపడుతున్నాయి. అప్పటికీ కలెక్టర్‌ ఉదయం ఏడున్నర గంటలకే వస్తుండటంతో దాదాపు కలెక్టరేట్‌ ముఖ్య అధికారులంతా ముందుగానే చేరుకుంటున్నారు. వాస్తవానికి ఆయన కొన్ని సెక్షన్ల అధికారులను మాత్రమే రావాలని నిర్దేశిస్తున్నప్పటికీ ఏకంగా కలెక్టర్‌ ఏడున్నరకు వచ్చి కూర్చుంటే పదిగంటలకు తాము వస్తే ఏం బాగుంటుందని మిగిలిన సెక్షన్ల అధికారులూ ఈసురోమంటూ ఏడున్నరకే వచ్చేస్తున్నారు. సరే టైంది ఏముందిలే మూడు, నాలుగుగంటలు ఎక్స్‌ట్రా చేసేద్దామని మెంటల్‌గా ప్రిపేర్‌ అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఎలా ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడో.. ఏం యాక్షన్‌ తీసుకుంటాడోనని భయపడిపోతున్నారు. నిజానికి కలెక్టరేట్‌లోనూ అవినీతి ఆరోపణలతో పాటు పనితీరులో నిర్లిప్తత ప్రదర్శించే అధికారులూ లేకపోలేదు. కానీ అందరినీ ఒకేగాటన కట్టి చివరికి నిజాయితీగా పనిచేసే ఉన్నతాధికారులనూ పక్కనపెట్టి వన్‌మాన్‌ షో మాదిరి వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. కలెక్టర్‌పై ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న అసంతృప్తి నివురుగప్పినా నిప్పులా మారకముందే... ఏలూరులో మాదిరి తిరుగుబాటు దశ వరకు రాకుండానే పాలన గాడి తప్పకుండానే పరిస్థితి అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్‌ కాటంనేనిపైనే ఉంది. ఏమంటారు సారూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement