కేసముద్రం, న్యూస్‌లైన్ : రెండు జతల యూనిఫాంల పంపిణీపై ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కేసముద్రం మార్కెట్ హమాలీలు బుధవారం కార్యాలయంలో అధికారులను నిర్బంధించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి మాట్లాడుతూ మార్కెట్‌లో వెట్టిచాకిరీ చేస్తున్న హమాలీ కార్మికులకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపించారు. రైతులకు నిరంతరాయంగా సేవలందిస్తున్న కార్మికులకు ఏటా రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేస్తామని చెప్పినా ఇంతవరకు దానిని ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పారు. యూనిఫాంల విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఆందోళనను విరమించేదిలేదని తెలిపారు. దీంతో మార్కెట్ అధికారులు విషయాన్ని జేడీ దృష్టికి తీసుకెళ్లారు. ఏడాదికి రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పడంతో కార్మికులు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ నాయకుడు దండు శ్రీను, హమాలీ యూనియన్ నాయకులు మాసం వెంకటయ్య, బండారు వెంకన్న, బొడ్డు వెంకన్న, సరోజన, రాధ, యాకుబ్, రాజు పాల్గొన్నారు.