విజయవాడ సిటీ
మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉంది మార్కెట్ శాఖ అధికారుల తీరు. కనీస వసతులు లేక అధ్వానంగా మారిన జిల్లా రైతుబజార్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖకు బదలాయించడం విమర్శలకు దారితీసింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని ఒకవైపు జిల్లా వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మార్కెటింగ్‌కు శాఖకు బదిలీ చేయడం తగదని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని రైతుబజార్ల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇక్కడే పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు, స్టాళ్ల నిర్వాహకులు కోరుతున్నారు.
నిధుల మళ్లింపుపై ఉన్న ధ్యాస..
అభివృద్ధిపై లేదా..
ఈ ఏడాది జిల్లాలోని రైతుబజార్లలో వచ్చిన ఆదాయం రూ.1.50కోట్లను వారం రోజుల కిందట మార్కెటింగ్ శాఖకు బదలాయించారు. ఇక్కడి రైతుబజార్లలో కనీస వసతులు లేక స్టాళ్ల నిర్వాహకులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా నిధులను బదలాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో 17 రైతుబజార్లు ఉన్నాయి. వాటిలో 12 రైతుబజార్లలో కనీస వసతులు లేవు.
స్టాల్స్ లేకపోవడంతో డేరాలు కట్టుకుని ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రెండో అతి పెద్దదైన నగరంలోని స్వరాజ్యమైదానం రైతుబజార్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పటమట, కేదారేశ్వరిపేట, సింగ్‌నగర్‌లలోని రైతుబజార్లు పల్లపు ప్రాంతంలో ఉండటంతో వర్షాకాలం నీటిలో నానుతున్నాయి. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, జగ్గయ్యపేటలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, ఫ్లోరింగ్, తాగునీరు సరిగా లేక స్టాళ్ల నిర్వాహకులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
బ్బందిపైనా చిన్నచూపే!
జిల్లాలోని రైతుబజార్లలో 19 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనాలు అందడం లేదు. పట్టణాల్లో పనిచేసే ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.14వేలు, రూరల్ ప్రాంతాల వారికి రూ.13వేలు, సిబ్బందికి పట్టణాల్లో రూ.6,735, మున్సిపాలిటీల్లో రూ,5,735, పంచాయతీల్లో పనిచేసేవారికి రూ.5వేలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. సిబ్బందికి డ్రస్ కూడా ఇవ్వడం లేదు. కార్యాలయాల్లో కంప్యూటర్లు, ఫోన్లు ఏర్పాటుచేయలేదు. ఇక్కడ వచ్చిన ఆదాయంతో రైతుబజార్లను ఆభివృద్ధి చేయాలని, విడిపోయే ఉమ్మడి రాష్ట్రానికి వర్తించేలా మార్కెటింగ్ శాఖకు బదలాయించడం తగదని రైతులు అంటున్నారు.