Estate Officers
-
రైతుబజార్.. కొనేవారు బేజార్
- ఏడాదిగా జిల్లాలో మార్కెటింగ్ శాఖకు ఏడీ కరువు - ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎస్టేట్ ఆఫీసర్లు - వ్యాపారులతో కుమ్మక్కవడంతో మండుతున్న ధరలు సాక్షి, కాకినాడ : ‘సరుకు తాజా.. సొమ్ము ఆదా’ ఇదీ రైతుబజార్ల ఏర్పాటు వెనకున్న ధ్యేయం. దీని ప్రకారం దళారుల బెడద లేకుండా.. అటు రైతులే వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకుని లాభం పొందేందుకు; ఇటు వినియోగదారులు కొంత చౌకగా కూరగాయలు కొనుక్కునేందుకు రైతుబజార్లు దోహదపడాల్సి ఉంది. అయితే.. ‘రైతు’బ జారు పేరులోనే..రైతులు స్వయంగా నిర్వహించే అంగళ్లు దాదాపు లేవన్నది ఆది నుంచీ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ‘పోనీలే.. ధరలు బయటి మార్కెట్ కన్నా కాస్త చౌకగా లభిస్తున్నప్పుడు.. అమ్మేది రైతైతేనేం, వ్యాపారైతేనేం’ అని పలువురు వినియోగదారులు కూరగాయలను రైతుబజార్లలో కొనడానికి అలవాటు పడ్డారు. అయితే ఇప్పుడా నమ్మకం వమ్మవుతోంది. రైతుబజార్ రేట్లకూ, బయటి ధరలకూ వ్యత్యాసం నానాటికీ సన్నగిల్లిపోతోంది. కొన్ని సందర్భాల్లోనైతే.. రైతుబజార్లో కొనేకన్నా బయట కొంటేనే చౌక అనిపిస్తోంది. రైతుబజార్లను పర్యవేక్షించే మార్కెటింగ్ శాఖ చోదకుడు లేని వాహనంలా ఉంది. దాదాపు ఏడాదిగా ఆ శాఖకు జిల్లాలో అసిస్టెంట్ డెరైక్టర్ లేరు. దాంతో కొన్ని రైతుబజార్లలో కూరగాయలమ్మే వ్యాపారులు, బజార్లను పర్యవేక్షించి, ప్రతిరోజూ ధరలను నిర్ణయించే ఎస్టేట్ ఆఫీసర్లు కుమ్మక్కవుతున్నారని, అందుకే రేట్లు నానాటికీ బయటి మార్కెట్ ధరలకు దగ్గరవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే కూరగాయల ధరలు పెరిగి సామాన్యులకు, మధ్యతరగతి వారికి విలాసవస్తువులుగా మారిన ప్రస్తుత తరుణంలో రైతుబజార్లలోనూ రేట్లు భగ్గుమనడంతో.. తృప్తిగా భోజనం చేయడానికీ నోచుకోవడం లేదని ఆ వర్గాలు వాపోతున్నాయి. ఇన్చార్జి ఏలుబడి మొక్కుబడే.. జిల్లాలో 20కి పైగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 12 రైతుబజార్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలక (ఏడీ) పోస్టు జిల్లాలో ఏడాదిగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఏడీగా పనిచేసిన ఝాన్సీరాణి ఏడాది క్రితం పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన సుబ్బరాయన్ పట్టుమని రెండు నెలలు కూడా ఉండలేదు. అప్పటి నుంచి విజయవాడ రీజియన్ డిప్యూటీ డెరైక్టరే ఇక్కడ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదని, ఫోన్లో ఆరా తీయడం తప్ప నెలకు ఒకటి, రెండుసార్లు కూడా జిల్లాకు రావడం లేదని తెలుస్తోంది. అప్పుడప్పుడు జిల్లాస్థాయి సమావేశాలకు హాజరు కావడం మినహా జిల్లాలో ఆ శాఖ కార్యకలాపాలను పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో.. యథారాజా తథా ప్రజా అన్నట్టు ఏడీ కార్యాలయ సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదని పనుల నిమిత్తం వచ్చే వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుబజార్లు వాటి ఏర్పాటు ధ్యేయానికి దూరమవుతున్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను రోజురోజుకూ పెంచేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లలో కొందరు వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకుంటూ ధరలను ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీ ఆదేశించినా ఫలితం శూన్యం.. జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నిత్యం జిల్లాలోని సివిల్ సప్లయిస్ అధికారులతో చర్చిస్తూ ధరల నియంత్రణ విషయమై తగు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తుంటారు. అదేరీతిలో మార్కెటింగ్ శాఖ సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేసినా సరైన బాధ్యుల్లేకపోవడంతో అవి గోడకు చెప్పిన మాదిరే అవుతున్నాయి. దీంతో ఆయన ప్రతిసారీ రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో సమావేశమై వారికి నేరుగా సూచనలు, ఆదేశాలు జారీ చేయాల్సి వస్తోంది. అయినా రైతుబజార్లలో రోజూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఉన్నతాధికారులకు కష్టతరమవుతోంది. దీంతో కొన్ని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, వ్యాపారులతో కుమ్మక్కై ధరలు రోజురోజుకూ పెరిగేందుకు కారకులవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గాడి తప్పిన రైతుబజార్లను తక్షణం వాటి ఏర్పాటు లక్ష్యానికి చేరువ చేయాల్సి ఉంది. ధరల నిర్ణయాన్ని నిత్యం ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. మార్కెటింగ్ శాఖకు వెంటనే ఏడీని నియమించాలి. అప్పుడే కూరగాయల సంచితో రైతుబజారుకు వెళ్లిన వారు.. అక్కడ కొనడం వల్ల కొంతైనా కలిసి వచ్చిందన్న మునుపటి నమ్మకం తిరిగి కలుగుతుంది. -
రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లి
కాకినాడ సిటీ: నాణ్యమైన ఉల్లిపాయలను తక్కువ ధరకే విక్రయించేందుకు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఎస్టేట్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన శుక్రవారం రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో ఉల్లి, బియ్యం ధరల నియంత్రణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని రకాల ఉల్లిపాయలను తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచుతూ రకాల వారీగా ధరల బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. రోజుకు ఎంత స్టాకు ఉంచుతున్నారు. ఎంత విక్రయించారు అనే వివరాలను ప్రతీ రోజు తనకు అందజేయాలని ఆదేశించారు. ఉల్లి నిల్వల అవసరాలను మూడు, నాలుగు రోజుల ముందే తెలిపితే స్థానిక హోల్‌సేల్ డీలర్లతో ఆర్డీఓలు మాట్లాడి సరఫరా జరిగేట్లు చర్యలు తీసుకుంటారన్నారు. అవసరమైతే కర్నూలు, మహారాష్ర్టల నుంచి నేరుగా రప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతు బజార్ కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయిస్తున్న నాణ్యమైన సన్నరకం బియ్యానికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందన్నారు. అన్ని రైతు బజార్లలో తగిన పరిమాణంలో ఈ బియ్యం నిల్వలు ఎల్లప్పుడూ ఉండేలా చూడాలని ఆదేశించారు. రైతుబజార్లలో పారిశుధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. షెడ్లకు మరమ్మతులు అవసరమైతే వెంటనే ప్రతిపాదించాలని కోరారు. కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందిన 22 మందికి జిల్లాలోని వివిధ రైతు బజార్లలో ఖాళీగా ఉన్నషాపులను కేటాయించాలని ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టీవీఎస్‌జీ కుమార్ పాల్గొన్నారు. -
ఇదేమి చిత్రం!
విజయవాడ సిటీ మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉంది మార్కెట్ శాఖ అధికారుల తీరు. కనీస వసతులు లేక అధ్వానంగా మారిన జిల్లా రైతుబజార్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖకు బదలాయించడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని ఒకవైపు జిల్లా వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మార్కెటింగ్‌కు శాఖకు బదిలీ చేయడం తగదని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని రైతుబజార్ల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇక్కడే పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు, స్టాళ్ల నిర్వాహకులు కోరుతున్నారు. నిధుల మళ్లింపుపై ఉన్న ధ్యాస.. అభివృద్ధిపై లేదా.. ఈ ఏడాది జిల్లాలోని రైతుబజార్లలో వచ్చిన ఆదాయం రూ.1.50కోట్లను వారం రోజుల కిందట మార్కెటింగ్ శాఖకు బదలాయించారు. ఇక్కడి రైతుబజార్లలో కనీస వసతులు లేక స్టాళ్ల నిర్వాహకులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా నిధులను బదలాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో 17 రైతుబజార్లు ఉన్నాయి. వాటిలో 12 రైతుబజార్లలో కనీస వసతులు లేవు. స్టాల్స్ లేకపోవడంతో డేరాలు కట్టుకుని ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రెండో అతి పెద్దదైన నగరంలోని స్వరాజ్యమైదానం రైతుబజార్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పటమట, కేదారేశ్వరిపేట, సింగ్‌నగర్‌లలోని రైతుబజార్లు పల్లపు ప్రాంతంలో ఉండటంతో వర్షాకాలం నీటిలో నానుతున్నాయి. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, జగ్గయ్యపేటలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, ఫ్లోరింగ్, తాగునీరు సరిగా లేక స్టాళ్ల నిర్వాహకులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్బందిపైనా చిన్నచూపే! జిల్లాలోని రైతుబజార్లలో 19 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనాలు అందడం లేదు. పట్టణాల్లో పనిచేసే ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.14వేలు, రూరల్ ప్రాంతాల వారికి రూ.13వేలు, సిబ్బందికి పట్టణాల్లో రూ.6,735, మున్సిపాలిటీల్లో రూ,5,735, పంచాయతీల్లో పనిచేసేవారికి రూ.5వేలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. సిబ్బందికి డ్రస్ కూడా ఇవ్వడం లేదు. కార్యాలయాల్లో కంప్యూటర్లు, ఫోన్లు ఏర్పాటుచేయలేదు. ఇక్కడ వచ్చిన ఆదాయంతో రైతుబజార్లను ఆభివృద్ధి చేయాలని, విడిపోయే ఉమ్మడి రాష్ట్రానికి వర్తించేలా మార్కెటింగ్ శాఖకు బదలాయించడం తగదని రైతులు అంటున్నారు.