కాకినాడ సిటీ: నాణ్యమైన ఉల్లిపాయలను తక్కువ ధరకే విక్రయించేందుకు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఎస్టేట్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన శుక్రవారం రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో ఉల్లి, బియ్యం ధరల నియంత్రణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని రకాల ఉల్లిపాయలను తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచుతూ రకాల వారీగా ధరల బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. రోజుకు ఎంత స్టాకు ఉంచుతున్నారు. ఎంత విక్రయించారు అనే వివరాలను ప్రతీ రోజు తనకు అందజేయాలని ఆదేశించారు.
ఉల్లి నిల్వల అవసరాలను మూడు, నాలుగు రోజుల ముందే తెలిపితే స్థానిక హోల్‌సేల్ డీలర్లతో ఆర్డీఓలు మాట్లాడి సరఫరా జరిగేట్లు చర్యలు తీసుకుంటారన్నారు. అవసరమైతే కర్నూలు, మహారాష్ర్టల నుంచి నేరుగా రప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతు బజార్ కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయిస్తున్న నాణ్యమైన సన్నరకం బియ్యానికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందన్నారు.
అన్ని రైతు బజార్లలో తగిన పరిమాణంలో ఈ బియ్యం నిల్వలు ఎల్లప్పుడూ ఉండేలా చూడాలని ఆదేశించారు. రైతుబజార్లలో పారిశుధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. షెడ్లకు మరమ్మతులు అవసరమైతే వెంటనే ప్రతిపాదించాలని కోరారు. కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందిన 22 మందికి జిల్లాలోని వివిధ రైతు బజార్లలో ఖాళీగా ఉన్నషాపులను కేటాయించాలని ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టీవీఎస్‌జీ కుమార్ పాల్గొన్నారు.
రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లి
Published Sat, Jul 12 2014 12:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement