బాబోయ్ ఉల్లి
- రోజురోజుకూ పెరుగుతున్న ధర
- వినియోగదారుల బెంబేలు
- రేటు తగ్గించేందుకు అధికారుల ప్రయత్నాలు
- మహారాష్ట్ర నుంచి దిగుమతికి సన్నాహాలు
కొందామంటే ఉల్లి కొండెక్కి కూర్చొంది. వర్షాభావ పరిస్థితులతో ఉత్పత్తి భారీగా తగ్గిపోతోంది. రైతు బజార్లకు మొన్నటివరకు గ్రామీణ ప్రాంతాల నుంచి విపరీతంగా సరకు పోటెత్తగా ఇప్పుడు ఉల్లి బస్తాలు రావడం లేదు. దీంతో ధర క్రమక్రమంగా ఆకాశాన్నంటుతోంది. మొన్నటివరకు కిలో రూ.22 వరకు ఉంటే బుధవారం నాటికి రూ.27కు చేరుకుంది. అదే బహిరంగ మార్కెట్లో రూ.31 పలుకుతోంది.
సాక్షి, విశాఖపట్నం: వినియోగదారులు ఉల్లి ధర చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరు విని యోగం తగ్గించుకుంటుండగా, మరికొందరు కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతుబజార్లు, మార్కెట్లో లభ్యమవుతున్న సరకు కూడా బాగా కుళ్లిపోయి ఉంటోంది. సరఫరా లేక రేటు పెరిగిపోతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.
రానురాను ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉండడంతో జిల్లా మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నగరంలోని 12 రైతు బజార్లతోపాటు ఇతరత్రా రోజుకు వినియోగం 40 టన్నుల వరకు ఉంటోంది. కానీ సరఫరా మాత్రం 10 టన్నులకు మించి ఉండడం లేదు. దీంతో మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డెరైక్టర్‌తోపాటు మరికొందరు అధికారులు బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు పయనమయ్యారు. అక్కడ లాసల్‌గావ్ మార్కెట్ కమిటీ నుంచి నగర అవసరాలకు సరిపడా భారీగా సరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో ఉల్లి రూ.24 పలుకుతోంది. దీంతో అక్కడ కొనుగోలు చేసి విశాఖకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నగరానికి రోజుకు ఎంత సరకు సరఫరా చేయాలనే దానిపై అధికారులు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఇందుకోసం బుధవారం మా ర్కెటింగ్‌శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ 12 రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుబజార్ల వారీగా ఎంత డిమాండ్ ఉంటుందని ఆరా తీశారు. సుమారుగా 2,420 క్వింటాళ్ల సరకు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు.
గురువారంనాటికి మొత్తం డిమాండ్ ఎంతని తేల్చి సాయంత్రం నాటికి కొనుగోలు ఆర్డర్ ఇవ్వనున్నారు. అప్పటివరకు మహారాష్ట్రలో అధికారులు మకాం వేయనున్నారు. మహారాష్ట్రలో కొనుగోలు చేసే ఉల్లిని విశాఖకు తరలించడానికి అయ్యే ఖర్చు ను పరిగణనలోకి తీసుకోకుండా లాభం, నష్టం లేని విధానంలో విక్రయాలు జరపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న ఉల్లి నాణ్యత.. మహరాష్ట్రలో దొరుకుతున్న ఉల్లి నాణ్యతను బేరీజు వేసుకుని కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు శనివారం నుంచి సిటీలో పూర్తిస్థాయిలో ఉల్లి లభ్యత పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరకు నగరానికి చేరుకున్న వెంటనే అత్యధికంగా సీతమ్మధార రైతుబజార్‌కు 5 టన్నులు, ఎంవీపీ రైతుబజార్‌కు 8 టన్నులు, పెదవాల్తేరుకు 5 టన్నుల వంతున తక్షణం సరఫరా చేయనున్నారు. గ్రామీణ ప్రాంతంలోనూ ఉల్లి ధర మండుతున్నప్పటికీ ఇప్పట్లో అక్కడ సరఫరా చేయాలనే ఆలోచన లేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పరిస్థితి శ్రుతిమించితే ఆ తర్వాత రేషన్ దుకాణాల ద్వారా విక్రయాలు జరపాలా? అనేదానిపై కసరత్తు చేస్తారు.