రైతుబజార్.. కొనేవారు బేజార్ | priceses are increases in market at kakinada | Sakshi
Sakshi News home page

రైతుబజార్.. కొనేవారు బేజార్

Published Sun, Jul 20 2014 11:55 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

రైతుబజార్.. కొనేవారు బేజార్ - Sakshi

రైతుబజార్.. కొనేవారు బేజార్

- ఏడాదిగా జిల్లాలో మార్కెటింగ్ శాఖకు ఏడీ కరువు
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎస్టేట్ ఆఫీసర్లు
- వ్యాపారులతో కుమ్మక్కవడంతో మండుతున్న ధరలు

 సాక్షి, కాకినాడ : ‘సరుకు తాజా.. సొమ్ము ఆదా’ ఇదీ రైతుబజార్ల ఏర్పాటు వెనకున్న ధ్యేయం. దీని ప్రకారం దళారుల బెడద లేకుండా.. అటు రైతులే వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకుని లాభం పొందేందుకు; ఇటు వినియోగదారులు కొంత చౌకగా కూరగాయలు కొనుక్కునేందుకు రైతుబజార్లు దోహదపడాల్సి ఉంది. అయితే.. ‘రైతు’బ జారు పేరులోనే..రైతులు స్వయంగా నిర్వహించే అంగళ్లు దాదాపు లేవన్నది ఆది నుంచీ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ‘పోనీలే.. ధరలు బయటి మార్కెట్ కన్నా కాస్త చౌకగా లభిస్తున్నప్పుడు.. అమ్మేది రైతైతేనేం, వ్యాపారైతేనేం’ అని   పలువురు వినియోగదారులు కూరగాయలను రైతుబజార్లలో కొనడానికి అలవాటు పడ్డారు.

అయితే ఇప్పుడా నమ్మకం వమ్మవుతోంది. రైతుబజార్ రేట్లకూ, బయటి ధరలకూ వ్యత్యాసం నానాటికీ సన్నగిల్లిపోతోంది. కొన్ని సందర్భాల్లోనైతే.. రైతుబజార్‌లో కొనేకన్నా బయట కొంటేనే చౌక అనిపిస్తోంది. రైతుబజార్లను పర్యవేక్షించే మార్కెటింగ్ శాఖ చోదకుడు లేని వాహనంలా ఉంది. దాదాపు ఏడాదిగా ఆ శాఖకు జిల్లాలో అసిస్టెంట్ డెరైక్టర్ లేరు. దాంతో కొన్ని రైతుబజార్లలో కూరగాయలమ్మే వ్యాపారులు, బజార్లను పర్యవేక్షించి, ప్రతిరోజూ ధరలను నిర్ణయించే ఎస్టేట్ ఆఫీసర్లు కుమ్మక్కవుతున్నారని, అందుకే రేట్లు నానాటికీ బయటి మార్కెట్ ధరలకు దగ్గరవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే కూరగాయల ధరలు పెరిగి సామాన్యులకు, మధ్యతరగతి వారికి విలాసవస్తువులుగా మారిన ప్రస్తుత తరుణంలో రైతుబజార్లలోనూ రేట్లు భగ్గుమనడంతో.. తృప్తిగా భోజనం చేయడానికీ నోచుకోవడం లేదని ఆ వర్గాలు వాపోతున్నాయి.
 
ఇన్‌చార్జి ఏలుబడి మొక్కుబడే..
జిల్లాలో 20కి పైగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 12 రైతుబజార్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలక (ఏడీ) పోస్టు జిల్లాలో ఏడాదిగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఏడీగా పనిచేసిన ఝాన్సీరాణి ఏడాది క్రితం పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆ తర్వాత  హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన సుబ్బరాయన్ పట్టుమని రెండు నెలలు కూడా ఉండలేదు. అప్పటి నుంచి విజయవాడ రీజియన్ డిప్యూటీ డెరైక్టరే ఇక్కడ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదని, ఫోన్‌లో ఆరా తీయడం తప్ప నెలకు ఒకటి, రెండుసార్లు కూడా జిల్లాకు రావడం లేదని తెలుస్తోంది.

అప్పుడప్పుడు జిల్లాస్థాయి సమావేశాలకు హాజరు కావడం మినహా జిల్లాలో ఆ శాఖ కార్యకలాపాలను పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో.. యథారాజా తథా ప్రజా అన్నట్టు ఏడీ కార్యాలయ సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదని పనుల నిమిత్తం వచ్చే వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుబజార్లు వాటి ఏర్పాటు ధ్యేయానికి దూరమవుతున్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను రోజురోజుకూ పెంచేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లలో కొందరు వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకుంటూ ధరలను ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
జేసీ ఆదేశించినా ఫలితం శూన్యం..
జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నిత్యం జిల్లాలోని సివిల్ సప్లయిస్ అధికారులతో చర్చిస్తూ ధరల నియంత్రణ విషయమై తగు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తుంటారు. అదేరీతిలో మార్కెటింగ్ శాఖ సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేసినా సరైన బాధ్యుల్లేకపోవడంతో అవి గోడకు చెప్పిన మాదిరే అవుతున్నాయి. దీంతో ఆయన ప్రతిసారీ రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో సమావేశమై వారికి నేరుగా సూచనలు, ఆదేశాలు జారీ చేయాల్సి వస్తోంది. అయినా రైతుబజార్లలో రోజూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఉన్నతాధికారులకు కష్టతరమవుతోంది.

దీంతో కొన్ని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, వ్యాపారులతో కుమ్మక్కై ధరలు రోజురోజుకూ పెరిగేందుకు కారకులవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గాడి తప్పిన రైతుబజార్లను తక్షణం వాటి ఏర్పాటు లక్ష్యానికి చేరువ చేయాల్సి ఉంది.  ధరల నిర్ణయాన్ని నిత్యం ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. మార్కెటింగ్ శాఖకు వెంటనే ఏడీని నియమించాలి. అప్పుడే కూరగాయల సంచితో రైతుబజారుకు వెళ్లిన వారు.. అక్కడ కొనడం వల్ల కొంతైనా కలిసి వచ్చిందన్న మునుపటి నమ్మకం తిరిగి కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement