ఇవిగో అర్జీలు.. స్వీకరించే వారేరి..?
► గ్రీవెన్స్ సెల్‌కు హాజరుకానీ ఉన్నతాధికారులు
► అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్
► మొత్తం 468 ఫిర్యాదులు
► డయల్ యువర్ కలెక్టర్‌కు 12 కాల్స్
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): ప్రతి శాఖాధికారి తప్పనిసరిగా గ్రీవెన్స్ సెల్‌కు హాజరవ్వాలి.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారాన్ని కేటాయించండి అంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చినా.. ఉన్నతాధికారుల్లో ఎటువంటి స్పందన లేకుండా పోయింది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కి ఇద్దరు, ముగ్గురు శాఖాధికారులు మినహా ఎవ్వరూ హాజరుకాలేదు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు రాకపోవటంతో అధికారులు కావాలనే హాజరుకాలేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. అయితే కలెక్టరేట్ మాత్రం అర్జీదారులతో కిటకిటలాడింది. మొత్తం 468 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరెడ్డి స్వయంగా వినతులను స్వీకరించారు. వినతుల్లో ఎక్కువగా రేషన్ కార్డు, పింఛన్లు, భూ వివాదాలు, గృహాలు సంబంధించినవి వచ్చాయి. అయితే అర్జీదారులను సర్వర్ సమస్య వేధించింది. సాంకేతిక సమస్య కారణంగా ఫిర్యాదుదారులకు రసీదు ఇవ్వడం కుదరలేదు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్..
అలాగే డయల్ యువర్ కలెక్టర్‌కు 12 మంది ఫోన్ చేసి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరెడ్డి ఫోన్ ద్వారా వినతులను తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ సత్వరమే అర్జీదారుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.