ఆత్మీయ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకోకుండా.. తనను మీ కుటుంబ సభ్యుడిలా భావించి సహకరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను కోరారు. స్థానిక గ్రీన్‌పార్కు హోటల్‌లో ఆదివారం రాత్రి అధికారులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి తాను అందరి వాడనంటూ వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పేదోడి గూడు కూలగొట్టారని ఆవేదనతో ఆనందపురం తహసీల్దార్‌తో అలా మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశంలేదని వివరణ ఇచ్చుకున్నారు. అయితే మంత్రి ఆగ్రహానికి గురైన ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. ఎంతో సౌమ్యునిగా పేరొందిన మంత్రి గంటా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే సుతిమెత్తగా మందలించేవారు. నలుగురి మధ్య పల్లెత్తుమాట అనేవారు కాదు. కళ్లతోనే హెచ్చరిక చేసేవారు. నాలుగు రోజుల క్రితం ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావు పట్ల నోరు పారేసుకున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఆనందపురం మండలంలో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని హౌసింగ్ స్కీమ్ కోసం టిడ్కోకు అప్పగించిన వైనాన్ని తప్పుబడుతూ తహసీల్దార్ పట్ల ఒంటికాలుపై లేచారు. ఏం వేషాలేస్తున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తహసీల్దార్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజనలకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీల దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్‌పై మంత్రి గంటా ఆగ్రహించిన తీరుపై సాక్షి కథనం ప్రచురించింది. ఈ కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెవెన్యూ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తమ యూనియన్ సభ్యుడైన తహసీల్దార్‌కు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చింది. గంటా వ్యాఖ్యలను ఖండించింది. కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు కూడా చేసింది. రాష్ట్ర యూనియన్‌కు కూడా జరిగిన ఘటనను తెలియజేయడంతో రాష్ట్ర నేతలు సైతం తహసీల్దార్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంతో మంత్రి గంటాకు అధికారుల మధ్య అంతరం ఏర్పడింది. జరిగిన నష్టం పూడ్చుకునేందుకు గంటా స్వయంగా రంగంలోకి దిగారు. అధికారులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు.
పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తా..
పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తానే తప్ప వదులుకునే స్వభావం తనది కాదని ఆత్మీయ సదస్సులో మంత్రి గంటా కాస్త ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును మందలించడానికి కారణాలను వివరిస్తూ శ్లాబ్ వేసుకున్న తర్వాత ఓ నిరుపేద ఇంటిని కూల్చేశారని ముందుగానే చెప్పి ఉంటే వాళ్లు నష్టపోయి ఉండేవారు కాదని, అందుకే కాస్త ఆవేశంతో మాట్లాడానే తప్పఎలాంటి ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని చెప్పుకొచ్చారు. అధికారులంతా నా కుటుంబ సభ్యులేనని, వారిని ఏనాడు పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదని చెప్పుకొచ్చారు. అందరూ నాకు సహకరించాలని కోరారు. దీంతో మంత్రి వివరణకు అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్‌వో చంద్రశేఖరరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. సమావేశంలో గత నాలుగేళ్లలో ఎక్కడా అధికారులను మంత్రి తిట్టిన సందర్భంలేదని ఓ అధికారి ప్రస్తావించగా.. ఆనందపురం తహసీల్దార్ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడారో తమకు ఇప్పటికి అంతుచిక్కడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment