మౌనం వీడేనా? | Officials Silence On Adulterated fertilizer | Sakshi
Sakshi News home page

మౌనం వీడేనా?

Published Thu, Sep 27 2018 8:23 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

Officials Silence On Adulterated fertilizer - Sakshi

కల్తీ ఎరువులు రైతులను కలవర పెట్టాయి. జిల్లాలోని యూరియాను కొంతమంది అక్రమార్కులు పక్క రాష్ట్రం ఒడిశాకు తరలించి.. అక్కడ దానికి రంగు వేసి తిరిగి జిల్లాకు తీసుకొచ్చి డీఏపీ ఎరువుగా విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో మంగళవారం వ్యవసాయాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ నకిలీ ఎరువుల విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లోనైనా వ్యవసాయశాఖ అధికారులు మౌనం వీడి.. చర్యలకు ఉపక్రమిస్తారో..లేదోనని రైతులు ఆసక్తిగా చూస్తున్నారు.

శ్రీకాకుళం, టెక్కలి: జిల్లాలో కల్తీ ఎరువులపై స్వయంగా నేను చెప్పినా పట్టించుకోరు...టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కల్తీ ఎరువులు విక్రయిస్తున్నారని డీలర్ల పేరుతో సహా ఫిర్యాదులు వస్తున్నా మీరేం చేస్తున్నారు... వ్యవసాయాధికారులు నిద్రపోతున్నారా...డీలర్లతో లాలూచీపడుతున్నారా అంటూ సాక్షాత్‌ జిల్లా కలెక్టర్‌ ధనంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏం చేయాలో తేలియక వ్యవసాయ శాఖ అధికారులు కలవర పడుతున్నారు. కలెక్టర్‌ హెచ్చరికలతోనైనా కల్తీ ఎరువుల బాగోతంపై అధికార యంత్రాంగం స్పందిస్తుందా లేక ఇదంతా మామూలే అని పెడచెవిన పెడతారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. జిల్లాలో కల్తీ ఎరువులపై ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వ్యవసాయాధికారులు, విజిలెన్స్‌ అధికారులు తూతూ మంత్రంగా హడావుడి తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే కలెక్టర్‌ ధనంజయరెడ్డి మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించనట్లుగా కల్తీలకు పాల్పడుతున్న ప్రాంతాలు, డీలర్ల పేర్లుతో సహా పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ వ్యవసాయాధికారులు మౌనం వహించడంలో ఆంతర్యమేమిటో కలెక్టర్‌ హెచ్చరికలో కొన్ని మాటలతో ఏకీభవించక తప్పదు. ఖరీఫ్‌ ఆరంభం నుంచి పెద్ద ఎత్తున కల్తీ ఎరువులు జిల్లాకు వస్తున్నప్పటికీ వ్యవసాయాధికారులు మాత్రం కనీసం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించలేదనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. మరో వైపు విజిలెన్స్‌ పరిశీలనతో సైతం పూర్తి స్థాయిలో ప్రగతి లేకపోవడంతో అనేక సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కలెక్టర్‌ ధనంజయరెడ్డి చేసిన హెచ్చరికలతోనైనా వ్యవసాయాధికారుల్లో చలనం కనిపిస్తుందా...విజిలెన్స్‌ యంత్రాంగం ఈ మాటలను చాలెంజ్‌గా తీసుకుని సంయుక్తంగా విచారణ చేస్తారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

ఇన్వాయిస్, ఈ–పాస్‌ అమ్మకాలపై దృష్టి సారించకపోవడంపై సందేహాలు
యూరియా (సూపర్‌ రకం) లో గ్రాన్యూల్స్‌ రకం ఎరువును ఒడిశాకు తరలించి అక్కడ డీఏపీ రూపంలో కల్తీ జరిగి మరళా ఆంధ్రా ప్రాంతానికి తరలివచ్చి వాటిని కొంత మంది దళారీలతో గ్రామాల్లో అమ్మకాలు చేసినట్లు గతంలో అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే దీనిపై అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం సర్వత్రా విమర్శలకు నెలవైంది. ఇటీవల కాలంలో విజిలెన్స్‌ అధికారులు డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో తనిఖీలు నిర్వహించే సమయంలో కొంతమంది ఎరువుల దుకాణాల డీలర్లు మూకుమ్మడిగా  వారి దుకాణాలను మూసివేసి పారిపోయారు. ఈ విషయం అధికారుల కళ్లెదుటే జరిగింది. దుకాణాలను ఎందుకు మూసివేశారనే అనుమానం కూడా అధికారుల్లో రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇన్వాయిస్, ఈ–పాస్‌ అమ్మకాలపై అధికార యంత్రాంగం కనీసం దృష్టి సారించలేదనే చెప్పాలి. కల్తీ డీఏపీపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఇన్వాయిస్, ఈ–పాస్‌ అమ్మకాలపై సమగ్ర పరిశీలన చేస్తే అసలు దొంగలు ఇట్టే దొరికిపోతారనే విషయం సామాన్య ప్రజలకు తెలిసినట్లుగా అధికార యంత్రాంగానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కల్తీ ఎరువులపై జిల్లా కలెక్టర్‌ ధనంజయరెడ్డి హెచ్చరించిన దానిపై వ్యవసాయాధికారులు, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా సమగ్ర పరిశీలన చేస్తారా లేదా అనే విషయం వారి చర్యలపై ఆధార పడి ఉంటుందనే చెప్పుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement