అమలాపురం పోలీసులు సీజ్ చేసిన చమురు ట్యాంకర్ల వాహనాలు
ఓఎన్జీసీ పైపులైన్లకు కన్నం వేసి... ట్యాంకర్ల నుంచి చమురు కాజేస్తున్న ఆయిల్ మాఫియా కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మొన్నటి దాకా ఈ చమురు జిడ్డు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు, ఓఎన్జీసీలోనే ఇంటి దొంగలు, రాజమహేంద్రవరానికి చెందిన చమురు ట్యాంకర్ల యాజమాని, ఆయన కుటుంబీకులకే అంటుకుంది. తాజాగా ఆ జిడ్డు పోలీసులకు అంటుకుంటోంది. ఈ కేసుల్లో పోలీసులకూ భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలతో కోనసీమ పోలీసు శాఖలోనే కాదు ఈ సీమ ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది.
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: రెండు నెలల కిందట అల్లవ రం మండలం ఓడలరేవు గ్రామంలో ఓఎన్జీసీ పైపులైన్లకు కన్నం వేసి బైపాస్ పైపుల ద్వారా సమీపంలోని జీడిమామిడి తోటలో సిన్‌టెక్స్ ట్యాంక్‌లో నింపుతుండగా ఆయిల్ చోరీ వెలుగు చూసింది. ఓఎన్జీసీ సెక్యూరిటీ విభాగం నిఘాలో బయటపడ్డ ఈ అక్రమ భాగోతంలో దొరికిన తీగను లాగిన పోలీసులు కేజీ బేసిన్‌లో ఉన్న ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న పలు ఓఎన్జీసీ బావుల నుంచి ఉప్పలగుప్తం మండలం ఎస్.యానంలోని ఆన్ లోడింగ్ పాయింట్‌కు వస్తున్న చమురు ట్యాంకర్ల ద్వారా కూడా భారీ స్థాయిలో చమురు చోరీ అవుతున్నట్లు గుర్తించారు. 2014 నుంచి దాదాపు రూ.200 కోట్ల విలువైన చమురు చోరీకి గురై ఉంటుందని అనధికార అంచనా కూడా వేశారు. ఈ కేసుల్లో పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇదంతా పాత ఎపిసోడ్.
వెలుగులోకి ముడుపుల ఆరోపణలు
తాజాగా ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమలాపురం నుంచి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు అందినట్లు ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో మొత్తం రూ.30 లక్షల డీల్ జరిగిందని ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు ఆ ముడుపులపై కొన్ని పత్రికల్లో అమరావతి నుంచి కథనాలు రావడంతో కోనసీమలో ఈ ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ ఆరోపణలతో అమలాపురం డివిజన్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో నిందితుడైన దాదాపు 70 వరకూ చమురు ట్యాంకర్లు ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి తనను, తన కుటుంబీకులను ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులకు రూ.30 లక్షలు ఆఫర్ చేశాడని... దానిని పోలీసు అధికారులు తిరస్కరించారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. అలాగే ఆయిల్ మాఫియా బాస్‌ల నుంచి స్థాయిని బట్టి ఒక్కో పోలీసు అధికారికి రూ.10 లక్షలు, రూ.5 లక్షలు, రూ.2 లక్షల వంతున నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలపై అమలాపురం డివిజన్ పోలీసులు చర్చించుకుంటున్నారు. అయితే అమలాపురం పోలీసు అధికారులు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూనే ఈ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు అధికారికి డిపార్ట్‌మెంట్‌లోనే అంతర్గతం ఉన్న శత్రువులైన అధికారులు లీకులు ఇచ్చి ముడుపుల ప్రచారం చేయిస్తున్నారని వివరణ ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆయిల్ మాఫియాపై ఓఎన్జీసీ అధికారులే సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు... ఆ సంస్థ త్వరలోనే దర్యాప్తు ప్రారంభిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇది వాస్తవమే అయితే ఆయిల్ మాఫియా కేసులో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడడం ఖాయమని పోలీసు వర్గాలు అంటున్నాయి.
ఎట్టకేలకు ఫిర్యాదు చేసిన ఓఎన్జీసీ అధికారులు
ఆయిల్ చోరీ కేసు దర్యాప్తుకి ఓఎన్జీసీ అధికారులు తమకు ఆది నుంచి సహకరించడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. పైపులైన్లకు కన్నం వేసి... ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న చమురు చోరీలపై తమకు ఫిర్యాదు చేస్తే ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు వారం రోజుల కిందట ఆ సంస్థ అధికారులు ఆయిల్ చోరీలపై ఫిర్యాదు చేయడం కొత్త పరిణామం. చమురు బావుల వద్ద లోడింగ్ పాయింట్లు, ఎస్.యానాం అన్‌లోడింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ, నిఘాతో ఆ సంస్థ అధికారులు విధుల్లో ఉంటారు. ట్యాంకర్ల నుంచి వచ్చిన చమురు ఎంత పరిమాణంలో వచ్చింది... అంతే పరిమాణంలో దిగుమతి అవుతుందా లేదా...? అనే ఖచ్చితమైన గణాంకాలు ఆ అధికారులకు అధికారిక నమోదుతో సమాచారం ఉంటుంది. అయినా చోరీలు సాగుతున్నాయంటే పరోక్షంగా ఇంటి దొంగల వత్తాసు లేకుండా ఇన్ని అక్రమాలు ఎలా జరుగుతాయన్నది ప్రశ్నార్థకమే. ఆ దిశగా ఓఎన్జీసీ నుంచి కనీస ఆరా గాని... చర్యలు లేవంటే ఇంటి దొంగలకు ఎంతటి అండదండలు ఉన్నాయో అంచనా వేయవచ్చు. రాజమహేంద్రవరానికి చెందిన చమురు ట్యాంకర్ల యాజమానికి చెందిన కొన్ని ట్యాంకర్లలో అక్రమ అదనపు ట్యాంకు, ట్యాంకర్లలో ఆయిల్ చాంబర్లకు వేసే ఓఎన్జీసీ తాళం కప్పలకు డూప్లికేట్ తాళాలు వంటి మోసాలు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment