ఓకే ఆల్‌రైట్...తూచ్ ఆపేయండి
నెల్లూరు(పొగతోట): జిల్లాలో తహశీల్దార్లకు మండలాల కేటాయింపు ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు అనే చందంగా మారింది. తహశీల్దార్లకు మండలాల కేటాయింపు జాబితాను కలెక్టరేట్ అధికారులు సిద్ధం చేస్తారు.. అంతలోనే దానిని నిలిపివేయండంటూ జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు. ఈ విధంగా పలుమార్లు జాబితాను సిద్ధం చేశారు. జాబితా సిద్ధం చేయడం జిల్లా అధికారులతో సంతకాలు చేయించడం... ఓకే ఆల్‌రైట్... అని అధికారులు అంటారు. అంతలోనే తూచ్.. జాబితాలో చిన్న మార్పులు అని సూచిస్తారు. ఈ విధంగా తహశీల్దార్ల జాబితాలో అనేక పర్యాయాలు మార్పులు చేశారు.
సోమవారం రాత్రి 11 గంటలకు పైన జాబితాను సిద్ధం చేశారు. ఉదయం డీఆర్‌ఓ నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం సమయానికి జాబితాలో మార్పులు చేయాలని డీఆర్‌ఓ తెలిపారు. కొద్ది సమయం అనంతరం జిల్లా అధికారుల నుంచి సమాచారం వచ్చింది. రెండు మార్పులు చేసి 55 మంది తహశీల్దార్లకు మండలాలు కేటాయింపుతో జాబితాను విడుదల చేశారు. అర్ధగంట తరువాత విడుదల చేసిన జాబితాలో మార్పులు చేయాలని సమాచారం. ఈ విధంగా తహశీల్దార్లకు మండలాల కేటాయింపు జాబితా ముందుకు, వెనక్కు వెళుతోంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమిపాలైన నాయకులు తమకు అనుకూలంగా ఉండే తహశీల్దార్లను నియమించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దాంతోనే జాబితాను సిద్ధం చేయడానికి అనేక పర్యాయాలు మార్పులు చేయవలసి వచ్చిందని సమాచారం. టీడీపీ నాయకులు సూచించిన వారికి కోరుకున్న మండలాలు కేటాయించారనే ఆరోపణలున్నాయి.
నెల్లూరు, కోవూరు, కావలి, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు సూచించిన తహశీల్దార్లను నియమించారనే ఆరోపణలున్నాయి. కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ తహశీల్దార్లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి వారికి ర్యాంకులు కేటాయించారు.
ర్యాంకులు ఆధారంగా మండలాలు కేటాయించాలని భావించారు. టీడీపీ నాయకులు ఒత్తిడితో జాబితా సిద్ధం చేయడంలో అనేక పర్యాయాలు మార్పులు చేర్పులు చేయవలసి వచ్చింది. ఎట్టకేలకు 22 మందితో జాబితా సిద్ధం చేశారు.