
వృద్ధుడికి స్వైన్‌ఫ్లూ..
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన ఓ వృద్ధుడికి స్వైన్‌ఫ్లూ సోకింది.
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన ఓ వృద్ధుడికి స్వైన్‌ఫ్లూ సోకింది. ఇతను హైదరాబాద్‌లో చికిత్స పొందినా పూర్తిగా నయం కాకపోవడంతో ప్రస్తుతం అనంతపురం సర్వజనాస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని కొండప్ప బావి వద్ద నివాసముంటుంటున్న ఆయన జనవరి 25న హైదరాబాదులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో 27న కేర్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షించి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్స అనంతరం అతను శనివారం రాత్రి ఉరవకొండకు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసి జిల్లా డిప్యూటీ వైద్యాధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ) డాక్టర్ చౌదరి, తహసీల్దార్ చౌడప్ప, సర్పంచ్ నర్రా సుజాత ఆదివారం బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించారు. రోగి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ గుర్తించారు. విషయాన్ని జిల్లా కలెక్టరుకు, జిల్లా వైద్యాధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ)కు ఫోన్‌లో తెలిపారు. వారి సూచన మేరకు ఖురేషీని 108 వాహనంలో అనంతపురం జనరల్ ఆస్పత్రికి తరలించారు.
(ఉరవకొండ)