పండుటాకులకు..గుండెకోత | old peoples have concern on pension scheme | Sakshi
Sakshi News home page

పండుటాకులకు..గుండెకోత

Published Sat, Nov 8 2014 2:54 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

పండుటాకులకు..గుండెకోత - Sakshi

పండుటాకులకు..గుండెకోత

జీవిత చరమాంకంలో ఆసరానిస్తున్న పింఛన్ పథకంతో సర్కారు ఆడుతున్న క్రూర క్రీడ పండుటాకుల అసువులకే ఎసరు పెడుతోంది. పింఛన్ మొత్తాన్ని పెంచుతున్నామని, సంతోషం, సంతృప్తి వగైరా ఐదురెట్లు పెరుగుతాయని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న పాలకులు తెరమాటున ఆడుతున్న పాచికలాట.. పడమటి పొద్దుకు తిరిగినవారి పాలిట మృత్యుఘాతమవుతోంది. పెరిగిన మొత్తం అందుకుంటామని ఆనందిస్తుండగా..అనేక సాకులతో ఉన్న పింఛన్లు కోల్పోయిన వృద్ధుల్లో కొందరి గుండెలు ఆగిపోతున్నాయి.
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికల వాగ్దానాల అమలులో టీడీపీ సర్కారు పెడుతున్న మెలికలు ఎందరికో మృత్యుఘంటికలుగా మారుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి రావడంతో పింఛన్ మొత్తం రూ.200 నుంచి రూ.వెయ్యికి పెరుగుతుందని సంబరపడ్డ వృద్ధుల్లో పలువురికి..అంధకారమే ఎదురైంది. వయసు తేడాలని, ఆధార్ లేదని.. ఇంకా పలు సాకులతో కొందరి పింఛన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. హతాశులైన పండుటాకులు.. ఆ ఆసరాను పునరుద్ధరించాలని మర పెట్టుకుంటూ జన్మభూమి-మా ఊరు సభల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ఫలితం దక్కకపోవడంతో పిండేసే దుఃఖంతో కొందరి గుండెలు ఆగిపోతున్నాయి. జిల్లాలో ఇలాంటి విషాదాలు  ఎక్కడో ఒక చోట నమోదవుతూనే ఉన్నాయి.

అన్ని విధాలా అర్హత ఉన్న వారి పింఛన్‌లకు కూడా కోత పెడుతుండడంతో ఎందరో వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. సవాలక్ష సాకులు చూపించి ఇప్పటి వరకు సుమారు 90 వేల పైచిలుకు పింఛన్‌దారులను లబ్ధికి దూరం చేసినట్టు లెక్కలు చెపుతున్నాయి. వృద్ధుల నోటి దగ్గరి ముద్దను లేకుండా చేయడానికి సర్కారు చూపుతున్న కారణాలు కేవలం సాంకేతికపరమైనవే అని చెప్పవచ్చు. చివరకు కొత్తగా పింఛన్‌ల కోసం వచ్చిన దరఖాస్తులలో కూడా ప్రభుత్వం కోతపెట్టి వారి గుండెకోతకు కారణమవుతోంది.

పింఛన్ల ఎంపిక పారదర్శకంగా చేస్తున్నామంటూ ఏర్పాటు చేసిన గ్రామకమిటీలు చేసిన సిఫార్సులనే గాలికొదిలేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఆశలను వమ్ముచేయడంతో వారు గుండెపగిలి చనిపోతున్న విషాధ ఘటనలు చోటుచేసుకున్నా సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదు. గాంధీ జయంతికి ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్‌దారులకు భరోసా ఇవ్వకపోగా వారి బతుకుల్లో బుగ్గిపోస్తోందని కుటుంబ సభ్యులు  కన్నీరుమున్నీరవుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే పింఛన్ రద్దయిన ఇద్దరు వృద్ధులు తనువు చాలించడం పింఛన్‌ల పంపిణీల్లో అర్హులకు జరుగుతున్న అన్యాయానికి పరాకాష్టగా నిలుస్తోంది.

చేటు తెచ్చిన సర్వే
కాట్రేనికోన గ్రామం శివారు రామస్వామితోటకు చెందిన పరమట చంద్రన్న(85)కు రూ.200 పింఛన్ వచ్చేది. చంద్రబాబు సర్కార్ వచ్చాక రూ.1000 పింఛన్ వస్తుందని చంద్రన్న ఆశపడ్డాడు. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోగా ఒక్కడే బతుకుబండిని లాగిస్తున్నాడు. పొరుగున  ఉన్న తేటకాయల శివశంకర్ సాకుతుండటంతో రూ.1000 పింఛన్ సొమ్ముతో బతుకు బాగుపడుతుందని ఆశించాడు. అయితే సర్వే అనంతరం అతని పింఛన్ రద్దయింది. దాంతో గత వారం రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించక ఆవేదనతో శుక్రవారం గుండె పగిలి మృతిచెందాడు. గత వారం రోజులుగా పెరిగే పింఛన్ కోసం తిరుగుతున్న చంద్రన్న చివరికి ఇలా ఆ ఆశ నెరవేరకుండానే మరణించడానికి సర్కారే కారణమని స్థానికులు శాపనార్థాలు పెట్టారు.

వయసు తక్కువని ఎసరు పెట్టారు..
కాగా రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో కూడా ఇలాంటి విషాదం జరిగింది. గత నెల వరకూ వచ్చిన రూ.200 ఫించను ఎన్టీఆర్ భరోసాతో రూ.1000 అవుతుందని ఆ గ్రామానికి చెందిన చిగటాపు సూర్యారావు(73) ఆశించాడు. అదే ఆశతో నేతల చుట్టూ తిరుగుతున్న సూర్యారావుకు వయస్సు సరిపోవడం లేదంటూ పింఛన్ జాబితా నుంచి పేరు తొలగించేశారు. భార్య సరస్వతి తెచ్చే కూలికి రూ.వెయ్యి కలిపితే కాస్త నిశ్చింతగా బతకొచ్చు అనుకుంటే వయస్సు తక్కువగా ఉందని పింఛను తొలగించేయడం, వచ్చే రూ.200 కూడా పోవడంతో సూర్యారావు మనస్తాపానికి గురయ్యాడు.

బెంగతో మంచం పట్టి శుక్రవారం కన్నుమూశాడు. హుషారుగా ఉండే సూర్యారావు పింఛన్ రద్దయిందనే బెంగతోనే తనువు చాలించారని భార్య సరస్వతి బావురుమంది. కాగా కోరుకొండ మండలం మునగాల జన్మభూమి గ్రామసభకు వితంతు పింఛన్ కోసం వచ్చిన సోమన మంగ మెట్ట మీద జారిపడి కాలు విరిగి ఆసుపత్రి పాలైంది. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ స్కూల్ ఆవరణలో జన్మభూమి సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమెకు పింఛన్ ఇస్తారో, లేదో స్పష్టత లేదు.

వెలుగులోకి రాని విషాదాలెన్నో..!
పింఛన్ తొలగించేశారని ఆవేదనతో బుధవారం ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామసభకు వచ్చిన వృద్ధురాలు ఒమ్మి చంద్రమ్మ(75) అక్కడికక్కడే కుప్పకూలి విగతజీవిగా మారింది. ఇలా కొన్ని విషాద ఘటనలు వెలుగులోకి రాగా, మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి రావడం లేదు. ఇలా ప్రతి గ్రామంలో పింఛన్‌లను కోతపెడుతూ వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాలతో సర్కార్ ఆటలాడుకుంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఏడెనిమిది వేల పింఛన్‌లను తొలగించేశారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో 40 మంది కుష్టువ్యాధిగ్రస్తుల పింఛన్‌లను తొలగించేశారు.  

జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కుంటిసాకులతో, సాంకేతిక కారణాలతో అనేకుల పింఛన్‌లను తొలగించేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం పురుడుపోసుకోక మునుపు అన్ని రకాల పింఛన్లు కలిపి జిల్లాలో 4,65,617 ఉన్నాయి. వాటిలో 90,981 పింఛన్లను ఎన్టీఆర్ భరోసా అమలులోకి వచ్చిన తరువాత గత సెప్టెంబరులో నిలిపివేశారు. వాటిలో 40,509 మందిని అనర్హులంటూ తొలగించేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టడానికి పలు కారణాలను చూపించారు. ఇవి కాకుండా వేలిముద్రలు సరిపోలడం లేదంటూ మరో 30 వేల వరకు తొలగించేశారు. ఈ చర్యల ద్వారా సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పలువరు ధ్వజమెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement