వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్టు
గుంటూరు రూరల్
గుంటూరు నగరంలో ఇటీవల ఓ వృద్ధురాలిని హత్యచేసి బంగారు ఆభరణాలు అపహరించిన కేసులో నిందితుడిని అరండల్‌పేట పోలీసులు శనివారం అరెస్టుచేశారు. వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో అదనపు ఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. గుంటూరు శారదాకాలనీ పదో లైనులో నివాసం ఉండే కూరాకుల గురవమ్మ (75) భర్త బాలయ్య రవాణా శాఖలో పనిచేసి రిటైరై పదేళ్ల కిత్రం మృతిచెందాడు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
అందరికీ వివాహాలయ్యాయి. గురవమ్మ ఒక్కటే ఉంటుండగా.. సమీపంలో నివాసం ఉండే కుమార్తె తల్లి బాగోగులు చూస్తుండేది. ఆ ఇంటిలోని ఓ భాగంలో నాలుగేళ్లుగా ఇరుగుల దుర్గారమేష్ అలియాస్ దుర్గా అలియాస్ రమేష్ అలియాస్ దుర్గారావు అద్దెకు ఉంటున్నాడు. బేల్దార్ పనిచేస్తుండగా.. ఆయన భార్య అంకమ్మ మిషన్ కుడుతుంది.
వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. ప్రస్తుతం గర్భిణి అయిన అంకమ్మ పిల్లలతోసహా ముట్లూరులోని పుట్టింటికి వెళ్లింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న దుర్గారమేష్ మదర్‌థెరిస్సా కాలనీలో చేపట్టిన ఇంటి నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేశాడు. దానికితోడు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాడు.
గురవమ్మ కొంతకాలంగా ఇల్లు ఖాళీచేయమని దుర్గారమేష్‌కు చెబుతోంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల అద్దెఇంటికి తాళంవేసి వెళ్లిపోయాడు. ఆర్థిక ఇబ్బందులను అధికమించేందుకు దుర్గారమేష్ అడ్డదారి పట్టాడు. తన ఇంటి యజమాని ఒక్కతే ఉంటుందని, ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించాలని పథకం పన్నాడు. ఈ నెల పదో తేదీ అర్ధరాత్రి దుర్గారమేష్ ఇంటికి వచ్చాడు. తాను ఉండే ఇంటికి, గురవమ్మ ఉండే ఇంటికి మధ్య చిన్నగోడ మాత్రమే ఉంటుంది. ఆ గోడ దూకి లోపలకు చొరబడిన దుర్గారమేష్ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
అయితే అలికిడికి గురవమ్మ నిద్రలేవడంతో కరెంటువైరుతో గొంతునులిమి ఆమెను హతమార్చాడు. బీరువా పగులగొట్టి 18 సవర్ల బంగారు ఆభరణాలు (4 సవర్ల బంగారు గాజులు, రెండు వరుసల కాశికాయల దండ, రెండు వరుసల బంగారు నాంతాడు, ఒక వెండి నాంతాడు, రెండు ఉంగరాలు, వెండి మొలతాడు) అపహరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలి హత్య సమాచారం అందుకున్న రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు హత్యకేసు నమోదు చేశారు.
పక్కనే అద్దెకు ఉంటున్న దుర్గారమేష్‌పై పోలీసులకు అనుమానం కలిగింది. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. శనివారం అరండల్‌పేట ఒకటో లైనులోని రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో దుర్గారమేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో క్రైం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ శేషయ్య, ఎస్‌ఐ బాబారావులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. ఆర్థిక సమస్యల వల్ల వృద్ధురాలిని హత్యచేసి బంగారు ఆభరణాలు అపహరించినట్లు అంగీకరించాడు.
మదర్‌థెరిస్సా కాలనీలో ఇంటి నిర్మాణం అపివేసినచోటు సెప్టింక్ ట్యాంక్‌లో బంగారు ఆభరణాలు దాచిపెట్టినట్లు చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దుర్గారమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వృద్ధురాలి హత్య కేసును త్వరితగతిన ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేసేందుకు ఎస్పీకి సిఫారసు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో క్రైం డీఎస్పీ వెంకటేశ్వరరావు, అరండల్‌పేట సీఐ సీహెచ్ శేషయ్య, సిబ్బంది పాల్గొన్నారు.