
దీక్ష చేపట్టిన మహాలక్ష్మి
కన్నవారు ఇచ్చిన ఆస్తిని లాక్కున్నారు. భృతి ఇవ్వాలని న్యాయం ఆదేశించినా.. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో రామాలయంలో ఐదు నెలలుగా వృద్ధురాలు తలదాచుకుంటోంది. తన దీన స్థితిని గమనించి అధికారులు న్యాయం చేయాలని బుధవారం ఆమరణ దీక్ష చేపట్టారు మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన దేవకివాడ మహాలక్ష్మి! బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
రేగిడి : బూరాడ గ్రామానికి చెందిన శీర రాధాకృష్ణంనాయుడుకు ముగ్గురు కుమారులు, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన దేవకివాడ అప్పారావుతో మహాలక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో తనకున్న ఆస్తిని నలుగురికీ సమానంగా పంచారు. ఇందులో మహాలక్ష్మి వాటాగా రెండు ఇళ్లు, 15 ఎకరాల భూమి వచ్చింది. వీటిని పెళ్లి సమయంలో పసుపు–కుంకుమ కింద ఇచ్చారు. వీరికి కుమార్తె కల్యాణి ఉంది. అయితే బూరాడకు చెందిన మహిళతో అప్పారావు సహజీవనం చేస్తున్నారు.
ఈ విషయం తెలియడంతో అప్పారావు, మహాలక్ష్మి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆమె నిరాదరణకు గురవుతూ వస్తోంది. భర్త నుంచి జీవనభృతి ఇప్పించాలని రాజాం సీనియర్ సివిల్ జడ్జి కోర్టును మహాలక్ష్మి 2014లో ఆశ్రయించింది. ఆమెకు ప్రతినెల రూ.25000 చెల్లించాలని భర్త అప్పారావును కోర్టు ఆదేశించింది. ప్రతినెల తాను రూ.25000 ఇవ్వలేనని జిల్లా కుటుంబ న్యాయస్థానానికి ఆయన తెలిపారు.
ఆమెకు ప్రతి నెల రూ.10వేలు జీవనభృతి ఇవ్వాలని 2016 నవంబర్‌లో జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అప్పారావు.. రెండు నెలలు చెల్లించారు. అనారోగ్యంతో ఆయన ఏడాది క్రితం మృతిచెందారు. అనంతరం తన ఆస్తిని సహజీవనం చేస్తున్న మహిళ కుమారులు దేవకివాడ చిన్నప్పలనాయుడు, దేవకివాడ కృష్ణ, దేవకివాడ కూర్మినాయుడు, కుమార్తె కెంబూరు ఈశ్వరమ్మ లాక్కుని తనను నిరాశ్రయురాలిని చేసి కట్టుబట్టలతో ఇంటి నుంచి గెంటివేశారని మహాలక్ష్మి వాపోయారు.
తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో జీవనాధారం లేక బుధవారం నుంచి పోరాట దీక్ష చేపట్టానన్నారు. ఈ పోరాటానికి గ్రామంలోని మహిళలు, యువత మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ తరఫున మం డల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, జిల్లా దళిత హక్కుల నాయకులు, విజిలెన్స్ కమిటీ మెంబర్ బత్తిన మోహనరావు మహాలక్ష్మి దీక్షకు సంఘీభావం తెలిపారు.
తనకు అన్యాయం జరి గిందని మహిళ పోరాటం చేస్తుంటే.. సర్పంచ్ వావిలపల్లి వరలక్ష్మి పట్టించుకోక పోవడం దారుణ మన్నారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఈ దీక్ష విరమించేదిలేదని మహాలక్ష్మితో పాటు ఆమె కుమార్తె కల్యాణి మొరపెట్టుకున్నారు.
సంక్షేమ పథకాలు నిలుపుదల
ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డు, పింఛన్‌ను అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు నిలుపుదల చేయడంతో మహాలక్ష్మి బోరున విలపిస్తోంది. బతికేందుకు కూడా వీలులేకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తనను తీవ్ర మానసిన వేదనకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్పీ త్రివిక్రమవర్మ వద్దకు వెళ్లి విన్నవించుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment