ఒంగోలు: క్రీడలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, ఇలా అయితే 2019లో జాతీయ క్రీడలు లేనట్లే అని జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కరణం పున్నయ్య చౌదరి అన్నారు. తన సహచర మిత్రుడు, సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన అంకమ్మ చౌదరి ఇటీవల పక్షవాతానికి గురి కావడంతో ఆయనను పరామర్శించేందుకు ఆయన ఒంగోలు వచ్చారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడల నిర్వహణకు సంబంధించి రూ.4.54 కోట్ల ను రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా డిపాజిట్ చేయాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్‌ను గుర్తించకపోవడం బాధాకరం అన్నారు. జూన్ 8వ తేదీలోగా ఆ మొత్తాన్ని జమచేయకపోతే ఉత్తరాఖండ్ ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతుందన్నారు. జూన్ 9వ తేదీ చెన్నైలోని తాజ్‌హోటల్‌లో ఒలింపిక్ అసోసియేషన్ జాతీయ సర్వసభ్య సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుందన్నారు. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు, క్రీడా శిక్షకుల కొరత వేధిస్తున్నాయని, దీనిపై మాట్లాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్‌మెంట్ కోసం మూడుసార్లు యత్నించినా అవకాశం దక్కలేదన్నారు.
ఇంత వరకు జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడా జట్ల ఎంపిక లేదని, వాటికి శిక్షణ ఇచ్చేం దు కు అవసరమైన కోచ్‌ల నియామకం కూడా పూర్తి కాలేదన్నారు. ముందుగా జాతీయ క్రీడల కమిటీ ఏర్పడాల్సి ఉన్నా ఇంతవరకు అతీగతీ లేదని, ఈ నేపథ్యంలో మంత్రులు జారీ చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. క్రీడా పాలసీ అంటూ సలహాలు, సూచనలు తీసుకున్న ప్రభుత్వం ఆ పాలసీని ఏం చేసిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. క్రీడాబోర్డును ఏర్పాటు చేశారని, కానీ పదిసార్లు బోర్డు సమావేశమై ప్రతిపాదనలు చేసినా వాటిని ఆమోదించేందుకు ప్రభుత్వం ముందుకురాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు.
రాష్ట్ర జట్లకు శిక్షణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన చేపట్టేందుకు కనీసంగా మరో రూ.500 కోట్లు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం ఉందని లేకుంటే తాము సిద్ధం అంటూ ఇప్పటికే ఉత్తరాఖండ్ సంసిద్ధంగా ఉందని, సైట్ కూడా ఓపెన్‌చేసి దాని వివరాలను పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులో ఉంచిందన్నారు. ఇటువంటి పరిస్థితిలో మంత్రులు మాత్రం ఒకరు జాతీయ క్రీడలంటే మరొకరు ఒలింపిక్ క్రీడల నిర్వహణకు సన్నద్ధమవుతున్నామం టూ హాస్యాస్పద ప్రకటనలు చేస్తుండడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేడియం లేని ప్రాంతం ఒంగోలు ఒక్కటే
జిల్లా కేంద్రంలో స్టేడియంలేని ఏకైక ప్రాంతం ఒంగోలు ఒక్కటే అని పున్నయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా జాతీయ క్రీడల ఖిల్లా అన్నారు. 22 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ప్రకాశం జిల్లావాసులే అన్నారు. బ్యాడ్మింటన్‌లో ఆరు అవార్డులను సొంతం చేసుకున్న గోపీచంద్ ప్రకాశం జిల్లావాసే అన్నారు. క్రీడా ప్రాంగణాల కోసం అంటూ ఉన్న స్థలాలను వదిలి ఇతరుల స్థలాలను ఉచితంగా ఇవ్వమని జిల్లా యంత్రాంగం వెంపర్లాడడం హాస్యాస్పదమన్నారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ఒంగోలు ఊరచెరువులో క్రీడా ప్రాంగణం కోసం శంకుస్థాపన కూడా చేశారని, ప్రస్తుతం అందులో ఆక్రమణలు పోగా మరో 15 ఎకరాల స్థలం ఉందని అందులో స్టేడియం నిర్మాణానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
మంగమ్మ కాలేజీ స్థలం ఎంతో విలువైనదని, ఆ స్థలాన్ని ఉచితంగా ఇచ్చేందుకు ఆ కమిటీ సిద్ధంగా లేదన్నారు. అందులో ఏదైనా మంచి విద్యాసంస్థలను ఏర్పాటుచేయాలని ఆ కమిటీ భావిస్తుందన్నారు. ఒంగోలు నూతన జాతీయ రహదారి పక్కన కూడా విలువైన ప్రభుత్వ భూమి ఉందని, ఆ స్థలాన్ని తీసుకున్నా మంచి స్టేడియం నిర్మించుకోవ చ్చన్నారు. ఇక ఒంగోలులో మధ్యలో నిలిచిన స్టేడియంకు పర్వతరెడ్డి ఆనంద్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని, ఆ నిధులు ఏమయ్యాయో బహిర్గతం చేయాలన్నారు. 2002లో ఇంకొల్లులో గోపీచంద్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించిందని, కానీ ఆ కోటి కూడా ఏమయ్యాయో లెక్కలు తేలడంలేదని, వెంటనే వాటిని దేని కోసం ఎంత వినియోగించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం మొద్దు నిద్ర
Published Mon, May 30 2016 9:40 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement