ఒలంపిక్ డే 5కే రన్
కడప స్పోర్ట్స్ : జిల్లాలో క్రీడా స్ఫూర్తి వెల్లువెత్తింది. ఒలంపిక్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒలంపిక్ డే 5కే రన్ ఉత్సాహంగా సాగింది. అంతర్జాతీయ ఒలంపిక్‌డే ను పురస్కరించుకుని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఒలంపిక్ రన్ నిర్వహించారు. ఇక్కడి డీఎస్‌ఏ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడారు. దేశాల మధ్య స్నేహబంధాన్ని పెంపొందించేందుకు ఒలంపిక్ రన్ దోహదపడుతుందన్నారు. జిల్లాలో క్రీడాస్ఫూర్తి పెద్ద ఎత్తున ఉందనడానికి ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులే నిదర్శనమన్నారు. ప్రతిభ ఉన్నా లేకపోయినా ప్రతి క్రీడాకారునికీ క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలంపిక్ రన్‌ను జిల్లాలో నిర్వహించడం సంతోషకరమన్నారు. గతంలో క్రీడలు అంటే తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదన్నారు.
నేడు వారిలో మార్పు రావడం శుభపరిణామమన్నారు. కొత్త కొత్త క్రీడల్లో తమ పిల్లల ప్రవేశం కోసం తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పైకా పథకం ఉందన్నారు. క్రీడాకారులకు అన్ని విధాల చేయూతనందిస్తామని ప్రకటించారు. జిల్లాలోని వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తుండటం గర్వంగా ఉందని తెలిపారు. జిల్లాలో ఒలంపిక్ భవన్ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జాయింట్ కలెక్టర్ రామారావు ఆకాంక్షించారు. ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ రాజారత్నం ఐజాక్, కార్యదర్శి సుభాన్‌బాషా మాట్లాడారు.
అనంతరం ఒలంపిక్ రన్‌ను కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించగా, అన్నమయ్య సర్కిల్, కృష్ణా సర్కిల్, గోకుల్ సర్కిల్, వన్‌టౌన్, ఏడురోడ్లు మీదుగా జియోన్ వ్యాయామ కళాశాల వరకు నిర్వహించారు. రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్పగౌరవ్, డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ రామచంద్రారెడ్డి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మాస్టర్ నాగూర్, కోశాధికారి లక్ష్మణ్, వివిధ క్రీడాసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, వికాస్ కళాశాల, జియోన్ వ్యాయామ కళాశాల, రిమ్స్ కళాశాల విద్యార్థులు, తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు.