olympic day
-
విజయనగరంలో ఘనంగా ఒలంపిక్ డే రన్
-
ఒలింపిక్ డే వేడుకల్లో పీవీ సింధు
న్యూఢిల్లీ: ‘ఒలింపిక్ డే’ వేడుకల్లో ప్రపంచ చాంపియన్, ఒలింపిక్స్ రజత పతక విజేత, ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ పీవీ సింధు భాగం కానుంది. జూన్ 23న ఒలింపిక్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన 23 మంది ప్రముఖ అథ్లెట్లు తమ వర్క్అవుట్ వీడియోలను అభిమానులతో పంచుకోనున్నారు. ఇందులో భారత్‌కు చెందిన పీవీ సింధుతో పాటు రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా పాల్గొననుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సింధు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌కు సంఘీభావంగా క్రీడాకారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పేర్కొన్నారు. -
ఘనంగా ఒలింపిక్ డే వేడుకలు
ఆరు కేంద్రాల నుంచి రన్ ముఖ్య అతిథిగా క్రీడామంత్రి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ డే (జూన్ 23) సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం నిర్వహించిన వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. నగరంలోని ఆరు కేంద్రాల నుంచి సుమారు 6000 మంది బాలబాలికలు ఒలింపిక్ డే రన్లో పాల్గొన్నారు. వీరందరూ చివరకు ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు చేరుకున్నారు. టార్చ్ బేరర్ల నుంచి టార్చ్‌లను ముఖ్య అతిథి రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి పద్మారావు గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఒలింపిక్ డే రన్ ప్రాధాన్యతను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తోందని... శిక్షణా కేంద్రాల్లో త్వరలోనే కోచ్‌లను, అవసరమైన వనరులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పిస్తామని.. ప్రత్యేక ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సంఘం ఆధ్వర్యంలో రన్ నిర్వహించామన్నారు. దీనికి సహకరించిన ఆయా జిల్లా కలెక్టర్లు, పోలీసు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సలహాదారు పాపారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రంగారావు, ఒలింపియన్లు, క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
– కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక - ఘనంగా ఒలింపిక్ డే – ఐదు కూడళ్ల నుంచి ఒలింపిక్ జ్యోతులతో ప్రజాప్రతినిధుల రన్ – భారీగా తరలి వచ్చిన విద్యార్థులు, క్రీడాకారులు – అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు (టౌన్): క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎంపీ బుట్టారేణుక క్రీడాకారులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఒలింపిక్ డేను పురస్కరించుకొని శుక్రవారం కర్నూలు నగరంలో ఔట్డోర్స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ఒలింపిక్ సంఘం రాష్ట్ర చైర్మన్ కె.యి. ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలను ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారయణ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రతి ఏడాది ఒలింపిక్ డే నిర్వహిస్తున్నారన్నారు. నగరంలో ఇంతపెద్ద ఎత్తున రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టమైన క్రీడను ఎంచుకొని అందులో రాణిస్తే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తాయన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎవ్వరికీ లేని గుర్తింపు క్రీడాకారులకే ఉందన్నారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. టీజీవీ సంస్థల అధినేత టీజీ భరత్ మాట్లాడుతూ క్రీడారంగానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఆధునిక ఒలింపిక్ జ్యోతులకు అయ్యే ఖర్చు తాము భరిస్తామన్నారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం చైర్మన్ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఒలింపిక్ డే వేడుకల్లో పాలొ్గని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ సీబీ హరినాథ్‌రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మల్లికార్జున పాల్గొన్నారు. ఐదు కూడళ్ల నుంచి ఒలింపిక్ జ్యోతులతో రన్ ఒలింపిక్డేను పురస్కరించుకొని నగరంలోని ఐదు ముఖ్య కూడళ్ల నుంచి ఒలింపిక్ జ్యోతులతో ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థినీ, విద్యార్థులు భారీ రన్ నిర్వహించారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నుంచి టీజీ భరత్, సిల్వర్ జూబ్లీ కళాశాల నుంచి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, మల్లికార్జున, చెన్నమ్మ సర్కిల్ నుంచి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, పాత బస్తీ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రాష్ట్ర ఒలింపిక్ సంఘం చైర్మెన్ కేఈ ప్రభాకర్, కార్యదర్శి పురుషోత్తం, ఏపీఎస్పీ పోలీసు పటాలం నుంచి కమాండెంట్ శామ్యూల్‌జాన్, నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథ్‌రెడ్డి క్రీడా జ్యోతులను వెలిగించి జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఐదు కూడళ్ల నుంచి స్థానిక రాజ్‌విహార్ సెంటర్‌కు వెళ్లి అక్కడి నుంచి స్టేడియానికి చేరుకున్నారు. విజేతలకు బహుమతులు ఒలింపిక్ డే రన్‌ను పురస్కరించుకొని మూడు రోజుల పాటు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు, మెడల్స్‌ను అందించారు. అంతర్జాతీయ క్రీడాకారులైన డేవిడ్ (సాఫ్ట్‌బాల్), జాఫ్రిన్ (టెని్నస్), లావణ్య (వాలీబాల్)ను కమిటీ చైర్మన్ కేఈ ప్రభాకర్‌తో పాటు అతిథులు ఘనంగా సన్మానించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఒలింపిక్ డే రన్‌ను పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని అలరించాయి. శ్రీలక్ష్మి, మాంటిస్సోరి, ఇండస్ పాఠశాలల విద్యార్థులు, సైక్లోన్ డ్యాన్స్ అకాడమి నృత్యకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కమిటీ సభ్యులు రవూఫ్, విజయ్‌కుమార్, రామాంజనేయులు, శ్రీనివాసులు, కబడ్డీ సంఘం కార్యదర్శి రాజశేఖర్, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి హర్షవర్దన్, స్కేటింగ్ సంఘం కార్యదర్శి సునీల్‌కుమార్, త్రోబాల్ సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్, పీఈటీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్, జాకీర్, సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి గంగాధర్, వెయిట్‌లిఫ్టింగ్ కార్యదర్శి పాపా పాల్గొన్నారు. -
ఒలింపిక్ రన్ టీ షర్టు ఆవిష్కరణ
సికింద్రాబాద్: ఒలింపిక్ డే సందర్భంగా ఈనెల 23న నిర్వహించనున్న ఒలింపిక్ రన్ టీ షర్టును రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి పద్మారావుగౌడ్ సోమవారం ఆవిష్కరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతి ఏడాది ఒలింపిక్ డే రన్ నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన టీ షర్టులను మంత్రి పద్మారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ, మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు సభ్యుడు పాండు యాదవ్, స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రభు కుమార్‌గౌడ్, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు చందు గంగపుత్ర, వెంకటరావు, ధరమ్‌రాజ్ చౌదరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
'ఒలింపిక్ డే' రన్ ప్రారంభం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒలింపిక్ డే రన్ మంగళవారం విజయవంతంగా ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ కార్యక్రమాలను జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఒలింపిక్ డే రన్ ప్రారంభించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో సినీనటులు రానా దగ్గుపాటి, ఛార్మీ, రెజీనా, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. విజయనగరం: జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ నిర్వహించారు. క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ రన్‌ను స్థానిక ఎమ్మెల్యే ఎం.గీత క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జడ్పీ ఛైర్మన్ స్వాతిరాణి పాల్గొన్నారు. నెల్లూరు: పట్టణంలోని ఏసీ స్టేడీయంలోని వీఆర్సీ గ్రౌండ్లో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రన్లో విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్స్లర్ వీరయ్య జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. -
ఒలంపిక్ డే 5కే రన్
కడప స్పోర్ట్స్ : జిల్లాలో క్రీడా స్ఫూర్తి వెల్లువెత్తింది. ఒలంపిక్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒలంపిక్ డే 5కే రన్ ఉత్సాహంగా సాగింది. అంతర్జాతీయ ఒలంపిక్డే ను పురస్కరించుకుని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఒలంపిక్ రన్ నిర్వహించారు. ఇక్కడి డీఎస్ఏ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడారు. దేశాల మధ్య స్నేహబంధాన్ని పెంపొందించేందుకు ఒలంపిక్ రన్ దోహదపడుతుందన్నారు. జిల్లాలో క్రీడాస్ఫూర్తి పెద్ద ఎత్తున ఉందనడానికి ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులే నిదర్శనమన్నారు. ప్రతిభ ఉన్నా లేకపోయినా ప్రతి క్రీడాకారునికీ క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమన్నారు. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలంపిక్ రన్‌ను జిల్లాలో నిర్వహించడం సంతోషకరమన్నారు. గతంలో క్రీడలు అంటే తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదన్నారు. నేడు వారిలో మార్పు రావడం శుభపరిణామమన్నారు. కొత్త కొత్త క్రీడల్లో తమ పిల్లల ప్రవేశం కోసం తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పైకా పథకం ఉందన్నారు. క్రీడాకారులకు అన్ని విధాల చేయూతనందిస్తామని ప్రకటించారు. జిల్లాలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తుండటం గర్వంగా ఉందని తెలిపారు. జిల్లాలో ఒలంపిక్ భవన్ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జాయింట్ కలెక్టర్ రామారావు ఆకాంక్షించారు. ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ రాజారత్నం ఐజాక్, కార్యదర్శి సుభాన్‌బాషా మాట్లాడారు. అనంతరం ఒలంపిక్ రన్‌ను కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించగా, అన్నమయ్య సర్కిల్, కృష్ణా సర్కిల్, గోకుల్ సర్కిల్, వన్‌టౌన్, ఏడురోడ్లు మీదుగా జియోన్ వ్యాయామ కళాశాల వరకు నిర్వహించారు. రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్పగౌరవ్, డీఎస్డీఓ బాషామోహిద్దీన్, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ రామచంద్రారెడ్డి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మాస్టర్ నాగూర్, కోశాధికారి లక్ష్మణ్, వివిధ క్రీడాసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, వికాస్ కళాశాల, జియోన్ వ్యాయామ కళాశాల, రిమ్స్ కళాశాల విద్యార్థులు, తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు.