ఘనంగా ఒలింపిక్ డే వేడుకలు
ఆరు కేంద్రాల నుంచి రన్
ముఖ్య అతిథిగా క్రీడామంత్రి
ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ డే (జూన్ 23) సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం నిర్వహించిన వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. నగరంలోని ఆరు కేంద్రాల నుంచి సుమారు 6000 మంది బాలబాలికలు ఒలింపిక్ డే రన్‌లో పాల్గొన్నారు. వీరందరూ చివరకు ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు చేరుకున్నారు. టార్చ్ బేరర్ల నుంచి టార్చ్‌లను ముఖ్య అతిథి రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి పద్మారావు గౌడ్ అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఒలింపిక్ డే రన్ ప్రాధాన్యతను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తోందని... శిక్షణా కేంద్రాల్లో త్వరలోనే కోచ్‌లను, అవసరమైన వనరులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పిస్తామని.. ప్రత్యేక ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సంఘం ఆధ్వర్యంలో రన్ నిర్వహించామన్నారు. దీనికి సహకరించిన ఆయా జిల్లా కలెక్టర్లు, పోలీసు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సలహాదారు పాపారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రంగారావు, ఒలింపియన్లు, క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.