Telangana Olympic Association
-
టీఓఏ అధ్యక్షులుగా జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షులుగా రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఎన్నికయ్యారు. ఆదివారం వెలువరించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జయేశ్‌కు 46 ఓట్లు రాగా, రంగారావుకు 33 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఓఏ నూతన కార్యవర్గం కొలువుదీరింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్ యాదవ్ గెలుపొందగా... జయేశ్ ప్యానల్ అభ్యర్థి జగన్మోహన్ రావు రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. జగదీశ్వర్ యాదవ్‌కు 41 ఓట్లు రాగా... జగన్మోహన్ రావుకు 39 ఓట్లు లభించాయి. ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ అలీ రఫత్, ప్రేమ్‌రాజ్, సరళ్ తల్వార్, వేణుగోపాలాచారి ఎన్నికయ్యారు. మహేశ్వర్ కోశాధికారి పదవిలో కొలువుదీరనున్నారు. సంయుక్త కార్యదర్శులుగా మల్లారెడ్డి, నార్మన్ ఐజాక్, ఎం. రామకృష్ణ, సోమేశ్వర్ వ్యవహరించనున్నారు. ఈసీ సభ్యులుగా అబ్బాస్, దత్తాత్రేయ, మహేందర్ రెడ్డి, పురుషోత్తం రావు, కోటేశ్వర రావు, టి. స్వామి, కె. రామకృష్ణ, ఇస్మాయిల్ బేగ్, హంజా బిన్ ఒమర్, ఖాజా ఖాన్ నియమితులయ్యారు. అయితే ఎన్నికలు నిర్వహణ తీరును ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా పోటీచేసిన జగన్మోహన్ రావు తప్పుబట్టారు. నైతికంగా తనదే విజయమని అన్నారు. ఐఓఏ ముందుగా 30 సంఘాలకు ఓటు హక్కు ఇవ్వగా దాన్ని తర్వాత 42 సంఘాలకు పెంచారని, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారిపై ఐఓసీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. నెల రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించి అందులో తాను జయకేతనం ఎగురువేస్తానని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక వ్యక్తికి బదులుగా మరో వ్యక్తి ఓటు వేశాడని, ఎన్నికలు కుట్ర పూరితంగా జరిగాయని ఆయన ఆరోపించారు. -
జయేష్ రంజన్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న జయేష్ రంజన్‌కు లైన్ క్లియర్ అయింది. జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరణ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా నామినేషన్ తిరస్కరించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఉండటంతో నామినేషన్‌ను ఆమోదించాల్సిందేనని రిటర్నింగ్ అధికారిని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో ఈ నెల 9వ తేదీ జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో రంగరావుతో కలిసి జయేష్ రంజన్ పోటీపడనున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి : రసవత్తరంగా తెలంగాణ ఒలంపిక్ ఎన్నికలు -
రసవత్తరంగా తెలంగాణ ఒలంపిక్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఒలంపిక్ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. తెలంగాణ ఒలింపిక్ భవన్, సంఘం కార్యాలయం అన్నీ ఇక్కడే ఉంచుకుని ఎన్నికలు న్యూఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని జస్టిస్ వినోద్ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా తయారీపై కూడా హైకోర్టు ధర్మాసనం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తివి మరోసారి అదే పదవికి ఎలా పోటీ చేస్తావని జగదీష్ యాదవ్‌ను న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తతంగం లోపభూయిష్టంగా, విమర్శలకు తావిచ్చేదిగా ఉందంటూ హైకోర్టు జగదీష్ వర్గానికి అక్షింతలు వేసింది.కాగా, రేపు ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారి నియామకం, జయేష్ నామినేషన్‌పై కూడా అరిసనపల్లి జగన్మోహన్ రావు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
ఆ ఎన్నికలు జరగనిచ్చే ప్రసక్తే లేదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి హైడ్రామా కొనసాగుతోంది. ఈ నెల 9న జరగబోయే ఎన్నికలను అడ్డుకుంటామని జయేష్ రంజన్ ప్యానల్ అంటోంది. రిటర్నింగ్ అధికారి చంద్రకుమార్ నియామకం చెల్లదని చెబుతోంది. మాజీ న్యాయమూర్తి కేసీ.భానును మొదట రిటర్నింగ్ అధికారిగా నియమించి, అనంతరం తెర మీదకి మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్‌ను తీసుకురావటాన్ని తప్పుబడుతోంది. ఢిల్లీ పెద్దల సహకారంతో కొందరు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నారని జయేష్ రంజన్ ప్యానెల్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో కాదు.. ఎన్నికలు హైదరాబాద్‌లోనే.. ‘తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఢిల్లీలో కాదు.. హైదరాబాద్‌లోనే జరిగి తీరతాయ్’ అని తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అన్నారు. ఒలంపిక్ ఎన్నికల విషయంలో నెలకొన్న పరిణామాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారిగా చంద్రకుమార్ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. జయేష్ రంజన్ నామినేషన్ తిరస్కరించటం అనైతికమని తెలిపారు. నామినేషన్ తిరస్కరించటానికి గల కారణాలు చంద్రకుమార్ ఇప్పటికీ చెప్పటంలేదని, రిటర్నింగ్ ఆఫీసర్‌గా చంద్రకుమార్‌ను ఎవరు నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి : ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ.. -
ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషనన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. గతంలో ఒలంపిక్ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణకు నాయకత్వం వహించిన కె. రంగారావు నామినేషన్‌ను స్వీకరించగా.. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిజెక్టు చేశారు. దీనిపై జయేష్ రంజన్, జితేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు కాస్త రాజకీయనాయుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య పోటీగా మారనున్నాయి. -
ఘనంగా ఒలింపిక్ డే వేడుకలు
ఆరు కేంద్రాల నుంచి రన్ ముఖ్య అతిథిగా క్రీడామంత్రి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ డే (జూన్ 23) సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం నిర్వహించిన వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. నగరంలోని ఆరు కేంద్రాల నుంచి సుమారు 6000 మంది బాలబాలికలు ఒలింపిక్ డే రన్లో పాల్గొన్నారు. వీరందరూ చివరకు ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు చేరుకున్నారు. టార్చ్ బేరర్ల నుంచి టార్చ్‌లను ముఖ్య అతిథి రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి పద్మారావు గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఒలింపిక్ డే రన్ ప్రాధాన్యతను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తోందని... శిక్షణా కేంద్రాల్లో త్వరలోనే కోచ్‌లను, అవసరమైన వనరులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పిస్తామని.. ప్రత్యేక ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సంఘం ఆధ్వర్యంలో రన్ నిర్వహించామన్నారు. దీనికి సహకరించిన ఆయా జిల్లా కలెక్టర్లు, పోలీసు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సలహాదారు పాపారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రంగారావు, ఒలింపియన్లు, క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా ఒలింపిక్ డే రన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, హైదరాబాద్ ఒలింపిక్ సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ ఆసక్తికరంగా సాగింది. ఒలింపిక్ రన్ స్ఫూర్తిని విద్యార్థుల్లో కలుగజేస్తూ నగరంలోని ఐదు ప్రాంతాల నుంచి రన్ కొనసాగింది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్, అంబేడ్కర్ విగ్రహం– ట్యాంక్ బండ్, ఫతేమైదాన్ క్లబ్, ఖైరతాబాద్, సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలల నుంచి ప్రారంభమైన ఈ రన్ ఎల్బీ స్టేడియం వరకు సాగింది. ముఖేశ్ కుమార్, ఇస్మాయిల్ బేగ్, ఎస్. జయరామ్ (బాక్సింగ్), నీతా దాడ్వే (కబడ్డీ), మహేందర్ రెడ్డి (కబడ్డీ) టార్చ్ బేరర్లుగా వ్యవహరించారు. వీరితో పాటు మరింత మంది క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు రన్లో పాలుపంచుకున్నారు. రన్ అనంతరం ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డా. వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా విచ్చేయగా... తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగిన కార్యక్రమం అనంతరం ఒలింపిక్ డే రన్ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ ముగింపు సందేశం అందించారు. రంగారెడ్డి జిల్లాలోనూ.. రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ గురువారం ఉల్లాసంగా సాగింది. దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, నాగోల్ల నుంచి ప్రారంభమయిన రన్... సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం చేరుకున్న అనంతరం ముగింపు కార్యక్రమం జరిగింది. కొత్తపేట కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాదాపు 3000 వేల మంది విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. సరూర్‌నగర్ స్టేడియం, ‘శాట్స్’కి చెందిన కోచ్‌లు జిల్లాలోని వివిధ సంఘాల కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
గందరగోళంలో ‘ఒలింపిక్’ ఎన్నికలు
రెండు రాష్ట్రాల సంఘాల్లోనూ వివాదం మాదే అసలంటూ రెండేసి వర్గాల పోరు సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఒలింపిక్ సంఘాల ఎన్నికలు కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అసలు ఒలింపిక్ సంఘం మాదంటే మాదని రెండేసి వర్గాలు పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపుల కూడా ఇరు వర్గాలు వెనక్కి తగ్గకుండా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏపీ ఒలింపిక్ సంఘం కోసం ఇప్పటికే ఒక ఎన్నికలు జరగ్గా, మరో ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కోసం ఈ నెల 18, 19 తేదీలలో వేర్వేరు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా...చివరకు అధికారిక గుర్తింపు కోసం అందరూ మరోసారి కోర్టు మెట్లెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గల్లా జయదేవ్ గీ సీఎం రమేశ్ ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికలు ఈ నెల 4న తిరుపతిలో నిర్వహించామంటూ ఒక వర్గం ఫలితాలను మీడియాకు వెల్లడించింది. దీని ప్రకారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా, ఆర్కే పురుషోత్తం కార్యదర్శిగా ఎంపికయ్యారు. తమ ఎన్నికను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తించిందని చెబుతూ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ సంతకంతో కూడిన ఉత్తర్వు ప్రతిని కూడా మంగళవారం ఈ వర్గం ప్రతినిధులు మీడియాకు ఇచ్చారు. శనివారం జరిగిన ఈ ఎన్నికలకు పరిశీలకునిగా స్పోర్ట్స్ అథారిటీ (శాప్) తరఫున రవీందర్ బాబు హాజరయ్యారు. అయితే ఈ ఎన్నిక చెల్లదంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వర్గం వాదిస్తోంది. బోర్డు సభ్యుడైన రవీందర్ బాబుకు అబ్జర్వర్‌గా వ్యవహరించే అర్హత లేదని వారు చెబుతున్నారు. ఈ నెల 19న జరగనున్న ఎన్నికలకు సీఎం రమేశ్ అధ్యక్ష పదవికి, కార్యదర్శి పదవి కోసం జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి, కేపీ రావు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఎన్నికలు జరిగాయని ప్రకటించుకున్న సంఘంపై కోర్టుకెక్కాలని ఈ వర్గం భావిస్తోంది. వీరి తరఫున ఉపాధ్యక్ష పదవి కోసం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణాలోనూ అదే స్థితి మరో వైపు తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 19న జరగాల్సిన ఎన్నికలకు మంగళవారంతో నామినేషన్లు ముగిశాయి. కార్యదర్శి పదవి కోసం జగదీశ్వర్ యాదవ్ పోటీ పడుతుండగా, అనూహ్యంగా అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె. జగదీశ్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆయనతో పాటు వేణుగోపాలచారి కూడా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి ఇంతకు ముందే టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డిని ఇరు వర్గాలు తమ అధ్యక్ష అభ్యర్థిగా చెప్పుకున్నాయి. ఆయన ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు. అయితే అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి కె. రంగారావు నేతృత్వంలో ఈ నెల 18న ఎన్నికలకు సిద్ధమవుతున్న మరో వర్గానికే ఐఓఏ గుర్తింపు దక్కవచ్చని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఈ వైపు వచ్చి మళ్లీ నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ముందు జాగ్రత్తగా జగదీశ్ వర్గం జగదీశ్వర్ రెడ్డితో నామినేషన్ వేయించింది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులే కావడం విశేషం. మొత్తానికి రెండు వర్గాలు తమదే అసలైన సంఘం అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ‘ఏపీఓఏ కార్యదర్శి హోదాలో ఇరు రాష్ట్ర ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు నా పేరుతో ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఈ నెల 19న ఎన్నికలు జరుపుతున్నాం. ఎవరు అసలు, ఎవరు కాదు అని చెప్పాల్సింది మేం కాదు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్లి సవాల్ చేయవచ్చు. అక్కడే అసలు వర్గం ఏమిటో తేలుతుంది’ -జగదీశ్వర్ యాదవ్