ఉల్లాసంగా ఒలింపిక్ డే రన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, హైదరాబాద్ ఒలింపిక్ సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ ఆసక్తికరంగా సాగింది. ఒలింపిక్ రన్ స్ఫూర్తిని విద్యార్థుల్లో కలుగజేస్తూ నగరంలోని ఐదు ప్రాంతాల నుంచి రన్ కొనసాగింది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్, అంబేడ్కర్ విగ్రహం– ట్యాంక్ బండ్, ఫతేమైదాన్ క్లబ్, ఖైరతాబాద్, సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలల నుంచి ప్రారంభమైన ఈ రన్ ఎల్‌బీ స్టేడియం వరకు సాగింది. ముఖేశ్ కుమార్, ఇస్మాయిల్ బేగ్, ఎస్. జయరామ్ (బాక్సింగ్), నీతా దాడ్వే (కబడ్డీ), మహేందర్ రెడ్డి (కబడ్డీ) టార్చ్ బేరర్లుగా వ్యవహరించారు.
వీరితో పాటు మరింత మంది క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు రన్‌లో పాలుపంచుకున్నారు. రన్ అనంతరం ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డా. వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా విచ్చేయగా... తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగిన కార్యక్రమం అనంతరం ఒలింపిక్ డే రన్ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ ముగింపు సందేశం అందించారు.
రంగారెడ్డి జిల్లాలోనూ..
రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ గురువారం ఉల్లాసంగా సాగింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్‌బీ నగర్ క్రాస్ రోడ్స్, నాగోల్‌ల నుంచి ప్రారంభమయిన రన్... సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం చేరుకున్న అనంతరం ముగింపు కార్యక్రమం జరిగింది. కొత్తపేట కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాదాపు 3000 వేల మంది విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొన్నారు. సరూర్‌నగర్ స్టేడియం, ‘శాట్స్’కి చెందిన కోచ్‌లు జిల్లాలోని వివిధ సంఘాల కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.