Olympic Day Run
-
ఆర్కే బీచ్‌లో సందడి చేశారుగా!
సాక్షి, విశాఖపట్నం : ఒలింపిక్ డే సందర్భంగా విశాఖ సాగరతీరంలో నిర్వహించిన రన్ ఉత్సాహంగా సాగింది. క్రీడల్లో పతకాలు సాధించిన వారితో పాటు ఔత్సాహిక క్రీడాకారులు, పలు పాఠశాలల విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. ది ఒలింపిక్ సంఘం విశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఐదు కిలోమీటర్ల పరుగును సంఘం ప్రతిని«ధి, ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు ప్రారంభించారు. సాగరతీరంలోని కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన పరుగు వైఎంసీఏ వద్ద ముగిసింది. వాస్తవానికి ఒలింపిక్ డే రన్ జూన్ 23న జరగనుంది. రాష్ట్ర స్థాయిలో ఆదివారం జరగనుండగా సంఘీభావంగా విశాఖలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచి పతకాలందుకున్న పలువురు క్రీడాకారుల్ని సంఘం ప్రతినిధులు సత్కరించారు. సాయిగణేష్, పి.బోనంగి, వై.హరికృష్ణ, ఆర్.స్వాతి, ఉత్తేజితరావు, నిషితా, శ్రీదేవి, ముత్యాలమ్మ, ఐశ్వర్యాదేవి, ఎస్.మహేష్, రామయ్య, ఉషా, ఎన్.సునీల్, కే.శ్రీను, కే.రాజేష్, జి.వెంకటేశ్వరరావు, ఎం.రాము, వి.తులసీ, వి.సత్యనారాయణ, వి.రమేష్, ఆర్.అరుణ సాయికుమార్, కే.యశ్వంత్, సాయి సంహిత, బి.అన్మిష, ఎస్.మేరీ, జి.వినయ్‌కుమార్, పూర్ణిమాలక్ష్మి, పవన్‌కుమార్, నారాయణమ్మ, నాగలక్ష్మి, అప్పలరాజు, సీహెచ్ దీపిక, ఎస్‌కెఎల్ బషీర్, జి.క్రాంతి, కె.భావన, సీహెచ్ దత్త అవినాష్, టి.ఆషిత, పీవీటీ కుమార్, జె.గణేష్, గుణష్నిత, పి.గాయత్రి, బి.కావ్య, జి.మేఘన, ఎ.కిషోర్, వీరుబాబు, నాగేంద్ర, అరుణ సాయికుమార్, యశ్వంత్ సత్కారం అందుకున్నారు. వీరిలో కొందరు జాతీయస్థాయిలో పతకాలు సాధించగా, మరికొందరు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. రన్ ముగింపు కార్యక్రమంలో ది ఒలింపిక్ సంఘం విశాఖ ప్రతినిధి పీవీజీఆర్ నాయుడు మాట్లాడుతూ విశాఖలో ప్రతి క్రీడకు సంఘం ఉందని, అవి చక్కగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. తొలుత జిల్లా సంయుక్త కలెక్టర్–2 వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒలింపిక్ రన్లో క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. సంఘం అధ్యక్షుడు ప్రసన్నకుమార్ ఒలింపిక్ డే రన్ ప్రత్యేకతను వివరించారు. చక్కటి ప్రోత్సాహం అందించే కోచ్‌లను సత్కరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టీఎస్ఆర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, మాణిక్యాలు, రామయ్య, కె.సూర్యనారాయణ, ఏయూ వ్యాయామ విద్యావిభాగ హెడ్ విజయ్‌మోహన్, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఒలింపిక్ డే రన్‌కు విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ), ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘ఒలింపిక్ డే రన్’కు విశేష స్పందన లభించింది. 3,000 మందికి పైగా చిన్నారులు ఈ పరుగులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒలింపిక్ జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. చార్మినార్, విక్టరీ ప్లేగ్రౌండ్, వైఎంసీఏ, గాంధీ విగ్రహం, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మెహదీపట్నం, యూసుఫ్‌గూడ మీదుగా నిర్వహించిన ఈ పరుగు ముగింపోత్సవం ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్ని ఎంతో ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులు సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తా చాటుతున్నారని కితాబిచ్చారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు ప్రోత్సాహకంగా సర్కారు 10 నుంచి 50 లక్షల వరకు ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్‌ను కల్పించడంతో యువత క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తినిస్తుందన్నారు. దేశంలోనే క్రీడల్లో తెలంగాణను నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, నంది టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
23న ఒలింపిక్ డే రన్
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జూన్ 23న నగరంలో ‘ఒలింపిక్ డే రన్’ జరుగనుంది. ఫతే మైదాన్ క్లబ్లో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు, ఇతర క్రీడా సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జంట నగరాల్లో జూన్ 23న, తెలంగాణ ఇతర జిల్లాల్లో జూన్ 21న ఒలింపిక్ డే రన్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలో చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్, వైఎంసీఏ హైదరాబాద్, సికింద్రాబాద్ గాంధీ విగ్రహం, బోయిన్పల్లి, చార్మినార్, మెహదీపట్నం ప్రాంతాల నుంచి రన్ ప్రారంభమవుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు తెలి పారు. క్రీడాభిమానులంతా రన్‌ను విజయ వంతం చేయాలని ఆయన కోరారు. -
ఉల్లాసంగా ఒలింపిక్ డే రన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, హైదరాబాద్ ఒలింపిక్ సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ ఆసక్తికరంగా సాగింది. ఒలింపిక్ రన్ స్ఫూర్తిని విద్యార్థుల్లో కలుగజేస్తూ నగరంలోని ఐదు ప్రాంతాల నుంచి రన్ కొనసాగింది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్, అంబేడ్కర్ విగ్రహం– ట్యాంక్ బండ్, ఫతేమైదాన్ క్లబ్, ఖైరతాబాద్, సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలల నుంచి ప్రారంభమైన ఈ రన్ ఎల్బీ స్టేడియం వరకు సాగింది. ముఖేశ్ కుమార్, ఇస్మాయిల్ బేగ్, ఎస్. జయరామ్ (బాక్సింగ్), నీతా దాడ్వే (కబడ్డీ), మహేందర్ రెడ్డి (కబడ్డీ) టార్చ్ బేరర్లుగా వ్యవహరించారు. వీరితో పాటు మరింత మంది క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు రన్లో పాలుపంచుకున్నారు. రన్ అనంతరం ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డా. వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా విచ్చేయగా... తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగిన కార్యక్రమం అనంతరం ఒలింపిక్ డే రన్ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ ముగింపు సందేశం అందించారు. రంగారెడ్డి జిల్లాలోనూ.. రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ గురువారం ఉల్లాసంగా సాగింది. దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, నాగోల్ల నుంచి ప్రారంభమయిన రన్... సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం చేరుకున్న అనంతరం ముగింపు కార్యక్రమం జరిగింది. కొత్తపేట కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాదాపు 3000 వేల మంది విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. సరూర్‌నగర్ స్టేడియం, ‘శాట్స్’కి చెందిన కోచ్‌లు జిల్లాలోని వివిధ సంఘాల కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
అనంతపురంలో ఒలింపిక్ డే రన్
-
గిన్నిస్ రికార్డ్సులో ‘విశాఖ ఒలింపిక్’ ఖ్యాతి
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖలో జూన్ 23వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘ఒలింపిక్ డే రన్’కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం లభించింది. పరుగులో పాల్గొన్న 86,549 మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుకోనున్నారు. ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో సంస్థ ఇచ్చిన రికార్డు గుర్తింపు పత్రాన్ని చదివి వినిపించారు. విశాఖ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని కార్యక్రమాలకు విశాఖ వేదికగా నిలిచి విశేష గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ పొందవచ్చని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు హర్షవర్థన్ ప్రసాద్ తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం హర్షించదగ్గ విషయమని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ అన్నారు. కార్యక్రమానికి విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి గణపతిరావు, ఉపాధ్యక్షుడు శంకరరావు, సంయుక్త కార్యదర్శి లలిత్‌కుమార్, ప్రతినిధి రవీంద్ర, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పేరుతోనూ సర్టిఫికెట్ పొందచ్చు వాస్తవంగా ఈ పరుగులో 98 వేల మంది పాల్గొన్నారు. పరుగు ప్రారంభంలో జరిగిన తొక్కిసలాటలో ప్రారంభ బాక్సులో వేసిన కొన్ని ఫాయిల్స్ పాడవడంతో వాటిని లెక్కించలేదు. దీంతో 86,549 మంది మాత్రమే రికార్డుకు నోచుకున్నారు. మిగిలిన బాక్సులో టికెట్టు ఫాయిల్స్ వేసిన వారికి సర్టిఫికెట్లను అందించేందుకు గిన్నిస్ బుక్ అనుమతినిచ్చిందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ తెలిపారు. తమ పేరుతో సర్టిఫికెట్ కావల్సిన వారు నిర్ణీత రుసం చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ సంఘం కార్యాలయంలో రూ.300 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం నుంచి సర్టిఫికెట్లు ఒలింపిక్ డే రన్లో పాల్గొన్నవారు సర్టిఫికెట్లను బుధవారం నుంచి అందించేందుకు జిల్లా ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసింది. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం రూమ్ నంబర్-6లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో పొందవచ్చు. రన్లో పాల్గొన్నప్పుడు ఇచ్చిన నంబర్ కార్డును తమతో తెచ్చుకోవల్సి ఉంటుంది. ఆ నంబరును పరిశీలించి సర్టిఫికెట్‌ను నిర్వాహకులు అందించనున్నారు. ఒలింపిక్ సంఘానికి సొంత భవనం విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘానికి సొంత భవనం ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. సంఘం పేరిట సొంత స్థలం ఉంటే నిర్మాణానికి కొందరు ముందుకు వచ్చారని చెప్పారు. త్వరలోనే ఆ ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.