విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖలో జూన్ 23వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘ఒలింపిక్ డే రన్’కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం లభించింది. పరుగులో పాల్గొన్న 86,549 మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుకోనున్నారు. ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో సంస్థ ఇచ్చిన రికార్డు గుర్తింపు పత్రాన్ని చదివి వినిపించారు.
విశాఖ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని కార్యక్రమాలకు విశాఖ వేదికగా నిలిచి విశేష గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ పొందవచ్చని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు హర్షవర్థన్ ప్రసాద్ తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం హర్షించదగ్గ విషయమని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ అన్నారు. కార్యక్రమానికి విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి గణపతిరావు, ఉపాధ్యక్షుడు శంకరరావు, సంయుక్త కార్యదర్శి లలిత్‌కుమార్, ప్రతినిధి రవీంద్ర, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పేరుతోనూ సర్టిఫికెట్ పొందచ్చు
వాస్తవంగా ఈ పరుగులో 98 వేల మంది పాల్గొన్నారు. పరుగు ప్రారంభంలో జరిగిన తొక్కిసలాటలో ప్రారంభ బాక్సులో వేసిన కొన్ని ఫాయిల్స్ పాడవడంతో వాటిని లెక్కించలేదు. దీంతో 86,549 మంది మాత్రమే రికార్డుకు నోచుకున్నారు. మిగిలిన బాక్సులో టికెట్టు ఫాయిల్స్ వేసిన వారికి సర్టిఫికెట్లను అందించేందుకు గిన్నిస్ బుక్ అనుమతినిచ్చిందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ తెలిపారు. తమ పేరుతో సర్టిఫికెట్ కావల్సిన వారు నిర్ణీత రుసం చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ సంఘం కార్యాలయంలో రూ.300 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు.
బుధవారం నుంచి సర్టిఫికెట్లు
ఒలింపిక్ డే రన్‌లో పాల్గొన్నవారు సర్టిఫికెట్లను బుధవారం నుంచి అందించేందుకు జిల్లా ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసింది. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం రూమ్ నంబర్-6లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో పొందవచ్చు. రన్‌లో పాల్గొన్నప్పుడు ఇచ్చిన నంబర్ కార్డును తమతో తెచ్చుకోవల్సి ఉంటుంది. ఆ నంబరును పరిశీలించి సర్టిఫికెట్‌ను నిర్వాహకులు అందించనున్నారు.
ఒలింపిక్ సంఘానికి సొంత భవనం
విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘానికి సొంత భవనం ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. సంఘం పేరిట సొంత స్థలం ఉంటే నిర్మాణానికి కొందరు ముందుకు వచ్చారని చెప్పారు. త్వరలోనే ఆ ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
గిన్నిస్ రికార్డ్సులో ‘విశాఖ ఒలింపిక్’ ఖ్యాతి
Published Mon, Aug 19 2013 2:22 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement