
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షులుగా రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఎన్నికయ్యారు. ఆదివారం వెలువరించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జయేశ్‌కు 46 ఓట్లు రాగా, రంగారావుకు 33 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఓఏ నూతన కార్యవర్గం కొలువుదీరింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్ యాదవ్ గెలుపొందగా... జయేశ్ ప్యానల్ అభ్యర్థి జగన్‌మోహన్ రావు రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. జగదీశ్వర్ యాదవ్‌కు 41 ఓట్లు రాగా... జగన్‌మోహన్ రావుకు 39 ఓట్లు లభించాయి. ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ అలీ రఫత్, ప్రేమ్‌రాజ్, సరళ్ తల్వార్, వేణుగోపాలాచారి ఎన్నికయ్యారు. మహేశ్వర్ కోశాధికారి పదవిలో కొలువుదీరనున్నారు.
సంయుక్త కార్యదర్శులుగా మల్లారెడ్డి, నార్మన్ ఐజాక్, ఎం. రామకృష్ణ, సోమేశ్వర్ వ్యవహరించనున్నారు. ఈసీ సభ్యులుగా అబ్బాస్, దత్తాత్రేయ, మహేందర్ రెడ్డి, పురుషోత్తం రావు, కోటేశ్వర రావు, టి. స్వామి, కె. రామకృష్ణ, ఇస్మాయిల్ బేగ్, హంజా బిన్ ఒమర్, ఖాజా ఖాన్ నియమితులయ్యారు. అయితే ఎన్నికలు నిర్వహణ తీరును ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా పోటీచేసిన జగన్‌మోహన్ రావు తప్పుబట్టారు. నైతికంగా తనదే విజయమని అన్నారు. ఐఓఏ ముందుగా 30 సంఘాలకు ఓటు హక్కు ఇవ్వగా దాన్ని తర్వాత 42 సంఘాలకు పెంచారని, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారిపై ఐఓసీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. నెల రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించి అందులో తాను జయకేతనం ఎగురువేస్తానని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక వ్యక్తికి బదులుగా మరో వ్యక్తి ఓటు వేశాడని, ఎన్నికలు కుట్ర పూరితంగా జరిగాయని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment