గందరగోళంలో ‘ఒలింపిక్’ ఎన్నికలు
రెండు రాష్ట్రాల సంఘాల్లోనూ వివాదం
మాదే అసలంటూ రెండేసి వర్గాల పోరు
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఒలింపిక్ సంఘాల ఎన్నికలు కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అసలు ఒలింపిక్ సంఘం మాదంటే మాదని రెండేసి వర్గాలు పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపుల కూడా ఇరు వర్గాలు వెనక్కి తగ్గకుండా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏపీ ఒలింపిక్ సంఘం కోసం ఇప్పటికే ఒక ఎన్నికలు జరగ్గా, మరో ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కోసం ఈ నెల 18, 19 తేదీలలో వేర్వేరు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా...చివరకు అధికారిక గుర్తింపు కోసం అందరూ మరోసారి కోర్టు మెట్లెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
గల్లా జయదేవ్ గీ సీఎం రమేశ్
ఏపీ ఒలింపిక్ సంఘం ఎన్నికలు ఈ నెల 4న తిరుపతిలో నిర్వహించామంటూ ఒక వర్గం ఫలితాలను మీడియాకు వెల్లడించింది. దీని ప్రకారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా, ఆర్‌కే పురుషోత్తం కార్యదర్శిగా ఎంపికయ్యారు. తమ ఎన్నికను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తించిందని చెబుతూ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ సంతకంతో కూడిన ఉత్తర్వు ప్రతిని కూడా మంగళవారం ఈ వర్గం ప్రతినిధులు మీడియాకు ఇచ్చారు. శనివారం జరిగిన ఈ ఎన్నికలకు పరిశీలకునిగా స్పోర్ట్స్ అథారిటీ (శాప్) తరఫున రవీందర్ బాబు హాజరయ్యారు.
అయితే ఈ ఎన్నిక చెల్లదంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వర్గం వాదిస్తోంది. బోర్డు సభ్యుడైన రవీందర్ బాబుకు అబ్జర్వర్‌గా వ్యవహరించే అర్హత లేదని వారు చెబుతున్నారు. ఈ నెల 19న జరగనున్న ఎన్నికలకు సీఎం రమేశ్ అధ్యక్ష పదవికి, కార్యదర్శి పదవి కోసం జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి, కేపీ రావు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇప్పటికే ఎన్నికలు జరిగాయని ప్రకటించుకున్న సంఘంపై కోర్టుకెక్కాలని ఈ వర్గం భావిస్తోంది. వీరి తరఫున ఉపాధ్యక్ష పదవి కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణాలోనూ అదే స్థితి
మరో వైపు తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 19న జరగాల్సిన ఎన్నికలకు మంగళవారంతో నామినేషన్లు ముగిశాయి. కార్యదర్శి పదవి కోసం జగదీశ్వర్ యాదవ్ పోటీ పడుతుండగా, అనూహ్యంగా అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె. జగదీశ్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆయనతో పాటు వేణుగోపాలచారి కూడా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి ఇంతకు ముందే టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డిని ఇరు వర్గాలు తమ అధ్యక్ష అభ్యర్థిగా చెప్పుకున్నాయి.
ఆయన ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు. అయితే అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి కె. రంగారావు నేతృత్వంలో ఈ నెల 18న ఎన్నికలకు సిద్ధమవుతున్న మరో వర్గానికే ఐఓఏ గుర్తింపు దక్కవచ్చని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఈ వైపు వచ్చి మళ్లీ నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ముందు జాగ్రత్తగా జగదీశ్ వర్గం జగదీశ్వర్ రెడ్డితో నామినేషన్ వేయించింది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరూ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులే కావడం విశేషం. మొత్తానికి రెండు వర్గాలు తమదే అసలైన సంఘం అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
‘ఏపీఓఏ కార్యదర్శి హోదాలో ఇరు రాష్ట్ర ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు నా పేరుతో ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఈ నెల 19న ఎన్నికలు జరుపుతున్నాం. ఎవరు అసలు, ఎవరు కాదు అని చెప్పాల్సింది మేం కాదు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్లి సవాల్ చేయవచ్చు. అక్కడే అసలు వర్గం ఏమిటో తేలుతుంది’
-జగదీశ్వర్ యాదవ్