- సంగీత సరస్వతికి అవమానమంటూ కళాకారుల ఆవేదన
భవానీపురం : సంగీత సరస్వతికి అవమానం జరుగుతుందంటూ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రదర్శన ఇచ్చేముందు నమస్కరించి ఎక్కే కళావేదికపై పాశ్చాత్య నృత్యాలు ప్రదర్శించనున్నారని తెలిసి కళాకారులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కళావేదికపై వెస్ట్రన్ డ్యాన్సులకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలోని కళావేదికపై కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో టీవీ ఛానల్స్‌లో ప్రదర్శనలిచ్చే కళాకారులతో, హీరోయిన్లతో వెస్ట్రన్ డ్యాన్సు ఏర్పాటు చేసినట్లు ఫ్లెక్సీలు కళాశాల గేటు ఎదుట ప్రదర్శించారు. వాటిని చూసి కళాభిమానులు, కళాకారులు ఆందోళన చెందుతున్నాన్నారు. వాస్తవానికి సంగీత కళాశాల ప్రాంగణంలోని కళా వేదికపై సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే అనుమతినివ్వాల్సి ఉంది. రాజకీయ పార్టీల సమావేశాలకు, మాంసాహారంతో కూడిన భోజనాలకు, అశ్లీల నృత్యాలు-సంగీత విభావరులకు అనుమతులు లేవు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ నాయకుల ఒత్తిడిలకు తలొగ్గి అన్ని కార్యక్రమాలకు ఇవ్వడం ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఆదివారం జరుగనున్న పాశ్చాత్య నృత్య కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.
ఈ అంశంపై కళాశాల అధ్యాపకుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమాలు సంగీత కళాశాలలో జరగలేదని, ఇదే తొలిసారని కళాకారులు చెబుతున్నారు. ఇక్కడ సాధ్యం కాకే డాన్స్ ఇనిస్టిట్యూట్‌లు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టకుంటున్నాయని తెలిపారు. కాగా సినీ, టీవీ కళాకారులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున వచ్చే ప్రజలను అదుపుచేయడం కూడా ఒక సమస్య అవుతుందని కళాకారులు అంటున్నారు. ఇప్పటికే సంగీత కళాశాలలో సంగీత విభావరులపై చుట్టుపక్కల నివాసితులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా వెస్ట్రన్ డాన్స్‌లు ఏర్పాటు చేయడం గమనార్హం.
కళావేదికపై వెస్ట్రన్ డ్యాన్సులా?
Published Sun, May 10 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement
Advertisement