అందరికీ సరిపడా అందని ప్రశ్న పత్రాలు
ఆందోళన చెందిన అభ్యర్థులు
కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
కొణిజర్ల ,న్యూస్‌లైన్ : పరీక్ష కేంద్రానికి అవసరమైనన్ని ప్రశ్నాపత్రాలు రాకపోవడంతో తనికెళ్ల బ్రౌన్స్ ఫార్మసీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన వీఆర్వో పరీక్ష గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ కేంద్రానికి 600 మంది అభ్యర్థులను కేటాయించగా పరీక్ష పేపర్లు 368 మాత్రమే వచ్చాయి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పేపర్లను బయటకు తీసిన ఛీప్ సూపరింటెండెంట్ వి.జగన్నాథ్ పాత్రో, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు తక్కువగా ఉన్నాయని గమనించి కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవో సంజీవరెడ్డి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ, వీఆర్వో పరీక్షల జిల్లా పరిశీలకురాలు సుశీలకు ఫోన్‌లో తెలియజేశారు. వారు హుటాహుటిన పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
232 మందికి పేపర్లు తక్కువగా వచ్చాయని జగన్నాథ్ పాత్రో వారికి చెప్పగా, ఆర్డీవో సంజీవ రెడ్డి తక్షణమే అధికారులను పోలీసుల పహారాలో ఖమ్మం పంపించి కొన్ని ప్రశ్నా పత్రాలను, పక్కనున్న విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గైర్హాజరైన వారి పేపర్లను తెప్పించారు. అయితే, ఒక గదిలో అందరికీ ఒకే సీరియల్‌లో ఉన్న బుక్‌లెట్‌లు రావడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు కాసేపు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రానికి వచ్చిన కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్.. ఒకే సీరియల్‌లో ఉన్న పత్రాలు వచ్చినా ఫర్వాలేదు.. అభ్యర్థులను దూరంగా కూర్చోబెట్టి పరీక్ష రాయించండని ఆదేశించడంతో ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, జేసీ సురేంద్రమోహన్ ఈ ఘటనపై ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రింటింగ్ కేంద్రంలో బండిల్ కట్టడంలో జరిగిన తప్పిదం వల్లే పేపర్లు తక్కువగా వచ్చాయని, అభ్యర్థులకు సమయం పెంచి పరీక్ష నిర్వహిస్తామని, ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేంద్రాన్ని వైరా డీఎస్పీ బి సాయిశ్రీ, సీఐ మోహనరాజా సందర్శించారు.
గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభం
Published Mon, Feb 3 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement