VRO exam
-
వీఆర్వో పరీక్షలో కాపీయింగ్‌కు యత్నం
మంచిర్యాలటౌన్: వీఆర్వో పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష సందర్భంగా కాపీయింగ్ యత్నం జరగడం కలకలం సృష్టించింది. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కళాశాల కరస్పాండెంట్ పెట్టెం మల్లేశ్ కూతురు పెట్టెం సాహితికి ఇదే కళాశాలలో పరీక్ష కేంద్రం పడింది. ఈ కేంద్రానికి మహేందర్‌ను చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్)గా నియమించగా.. ఆయన స్థానంలో పెట్టెం శ్రీకర్ సీఎస్‌గా విధులు నిర్వర్తించారు. రూమ్ నంబర్ 2లో పరీక్ష రాస్తున్న సాహితికి తరచూ ఆరోగ్య సమస్య అంటూ వచ్చి ట్యాబ్లెట్లు ఇవ్వడం, మరో గదికి తీసుకెళ్లడం వంటివి చేయడంతో ఆ గదిలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అనుమానం వచ్చింది. శ్రీకర్ జవాబులు రాసి ఉన్న చిట్టీని సాహితికి ఇవ్వడంతోపాటు పరీక్ష రాసే స్థలాన్ని మరోచోటకు మార్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళకు దిగారు. లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని సాహితి నుంచి ఓఎంఆర్ షీట్ తీసుకుని, విచారణ చేపడతామని చెప్పడంతోపాటు ఆమెను పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావును సంప్రదించగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీఆర్వో పరీక్షకు ఒకే ఒక్కడు.. కెరమెరి (ఆసిఫాబాద్): దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమీప ప్రాంతాల్లో వీఆర్వో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాల్సి ఉండగా, ఆప్షన్లతో సంబంధం లేకుండా పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు నానా ఇబ్బందులు పడ్డారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మందికి 75 మంది మాత్రమే హాజరయ్యారు. ఇదే పరీక్ష కేంద్రంలో రూం నంబర్ 9లో 24 మందికిగాను ఒకే ఒకడు హాజరు కావడం గమనార్హం. పెద్దపల్లికి చెందిన ఒకే అభ్యర్థి ఇక్కడ పరీక్ష రాశాడు. ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపల్లికి చెందిన అనిల్‌కుమార్ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మోటారుసైకిల్‌పై బయలుదేరి పరీక్ష కోసం 275 కి.మీ.(రానుపోను 550 కి.మీ.) దూరంలో ఉన్న కెరమెరికి వచ్చి పరీక్ష రాయడం కొసమెరుపు! చాలా ఇబ్బంది పడ్డా! శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంకాలం ఆసిఫాబాద్‌కు చేరా. అక్కడే లాడ్జిలో ఉండి ఉదయాన్నే కెరమెరి వెళ్లా. దరఖాస్తు కూడా ప్రారంభంలోనే చేశాను. కుమురం భీ జిల్లాను 8వ ఆప్షన్‌గా ఎంచుకున్నా. అయితే ఇంతదూరం పరీక్ష కేంద్రం వేయడంతో చాలా ఇబ్బంది పడ్డా . ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వీఆర్వో ప్రశ్నపత్రం లీక్? జనగామ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు చెబుతున్నా.. జనగామ జిల్లా కేంద్రంలో మాత్రం ప్రశ్న పత్రం లీకైందన్న చర్చ జోరుగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనగామలోని హన్మకొండ రోడ్డులోగల ఓ పరీక్ష కేంద్రం నుంచి గుర్తుతెలియని యువకుడు వీఆర్వో పరీక్ష పత్రాన్ని తీసుకొని సిద్దిపేట రోడ్డులోని ఓ జిరాక్స్ సెంటర్ వద్దకు పలుమార్లు వచ్చి జిరాక్స్ తీయమని కోరినట్లు తెలిసింది. అయితే సదరు యజమాని జిరాక్స్ తీసేందుకు తిరస్కరించడంతో వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీసినట్లు సమాచారం. అయితే, లీక్ జరగలేదని అధికారులు చెబుతున్నారు. -
టైరు ఊడి.. అదుపుతప్పి..
సాక్షి, బిజినేపల్లి రూరల్/హైదరాబాద్/నర్సాపూర్: కొండగట్టు బస్సు ప్రమాదం మరువక ముందే నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి పంట పొలాల్లోకి దూసుకెళ్ల డంతో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9మందిని నిమ్స్‌కు, మిగిలిన వారిని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో అందరూ వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100 మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు టాప్‌పై.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన (ఏపీ 24జడ్ 0037) బస్సు ఆదివారం హైదరాబాద్ నుంచి వనపర్తి బయలుదేరింది. వీఆర్వో పరీక్ష ఉండటం, బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో కొందరు బస్సు టాప్ పైకి ఎక్కారు. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్దకు బస్సు రాగానే ముందు టైరు పేలింది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. బస్సు టాప్‌పై ఉన్న వారు కిందపడ్డారు. కిందపడిన వారిలో 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ శ్రీనివాస్‌రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న 100 మందిలో 65 మంది వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. చాలా కాలంగా పరీక్షకు సిద్ధమవుతున్నామని, పరీక్షకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి రాయలేకపోయామని అభ్యర్థులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరామర్శించారు. తక్షణ సహాయంగా కొంత నగదును బాధితుల బంధువులకు అందజేశారు. క్షతగాత్రుల వివరాలు మ«ధుకర్ (బైరాపూర్), భూపాల్ (బోడంపహాడ్), రాజు (బాలానగర్), అనిల్ (కొడంగల్) నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ (మాడ్గుల), ప్రభాకరాచారి (హైదరాబాద్), రాంచందర్ (బాలానగర్), నాగమల్లయ్య (తెల్కపల్లి), జింకల శివకుమార్ (ఆలేరు), నర్సింహులు (పెద్దఅల్వాల్), కృష్ణ (వెల్జాల)ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. కలెక్టర్ చొరవతో పరీక్షకు.. పాన్‌గల్: ప్రమాదంలో గాయపడి ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థి కలెక్టర్ శ్వేతామహంతి చొరవతో పరీక్ష రాసేందుకు సిబ్బంది అనుమతించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ చెందిన పవన్ కల్యాణ్.. వనపర్తి జిల్లా పాన్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. కానీ నాగర్‌కర్నూల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో పవన్ కూడా గాయపడ్డాడు. అయినా 11.28 నిమిషాలకు కేంద్రానికి చేరుకున్నాడు. కానీ ఆలస్యమవడంతో అధికారులు అనుమతించలేదు. విషయం కలెక్టర్‌కు తెలియడంతో పరీక్షకు అనుమతించారు. అప్పటికే పవన్ వెనుదిరిగినా పాన్‌గల్ ఎస్సై తిరుపాజీ హుటాహుటిన వెళ్లి వనపర్తి మండలం అంజనగిరి వద్ద బస్సును ఆపి పవన్‌ను తన వాహనంపై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రత్యేక గదిలో 12.40కి పరీక్ష రాసేందుకు అనుమతించారు. నర్సాపూర్‌లో మరో ప్రమాదం నర్సాపూర్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని ఢీ కొట్టింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఏపీ 28 జెడ్ 0480 నంబర్ బస్సు ఆదివారం సాయంత్రం సంగారెడ్డి నుంచి గజ్వేల్ బయలుదేరింది. నర్సాపూర్ పట్టణ శివారులోని బీవీఆర్టీ కాలేజీ దగ్గరకు రాగానే స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ రాములు సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు నవ్య, మనోహర, బూదమ్మలను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవ్య, మనోహర సంగారెడ్డిలో వీఆర్వో పరీక్ష రాసి వస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులున్నారని కండక్టర్ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. కాలేజీ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేకులు పడకపోవడంతో ముందున్న లారీని ఢీ కొట్టిందని డ్రైవర్ తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడిన ‘వీఆర్వో’ అభ్యర్థులు -
సచివాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీఆర్వో పరీక్షలో తనకు అన్యాయం జరిగిందన్న బాధతో అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ప్రస్తుతం అతడు సైఫాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. యువకుడి వివరాలు సేకరిస్తున్నారు. -
మరొకరి పరీక్ష రాస్తూ..
కలువరాయి(బొబ్బిలిరూరల్),న్యూస్‌లైన్: ఒక అభ్యర్థికి బదులు వీఆర్ఓ పరీక్ష రాస్తూ మరో అభ్యర్థి పట్టుబడ్డాడు. బొబ్బిలి మం డలం కలువరాయి స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన వీఆర్ఓ పరీక్షల్లో ఈ సంఘటన జరిగింది. ఎస్.కోట మండలం బాలకృష్ణరాజపురం గ్రామానికి చెందిన ముచ్చకర్ల కల్యాణ్‌కుమార్‌కు బదులు పొడుగు ప్రసా ద్ అనే అభ్యర్థి పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. 203వ నంబర్ పరీక్షాకేంద్రంలో పరీక్ష జరుగుతున్న సమయంలో 102140363 హాల్‌టికెట్ అభ్యర్థి పేరు ఓఎంఆర్ షీట్లో కల్యాణ్‌కుమార్ అని ఉండగా, పరీక్షరాస్తున్న అభ్యర్థి ప్రసాద్ అని సంతకం చేశాడు. అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ వి.గోవిందరావు గుర్తించి వెంటనే చీఫ్‌సూపరింటెండెంట్ చుక్క రమణకు విషయం తెలియజేయడంతో అప్రమత్తమైన లైజనింగ్ అధికారి ఎస్.రమేష్ తదితరులు అభ్యర్థిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలు అభ్యర్థి కల్యాణ్‌కుమార్ ఎవరో వివరాలు చెప్పాలని కోరినా ప్రసాద్ విషయం చెప్పకపోవడంతో హాల్‌టికెట్లు పరిశీలించారు. ప్రసాద్ వద్ద ఉన్న హాల్‌టికెట్‌లో అభ్యర్థి పేరు సరిచేసి ఉండడం, వివరాలుకూడా సరిచేసి తయారుచేసిన హాల్టికెట్కావడంతో వెంటనే బొబ్బిలి సీఐ రఘుశ్రీనివాస్కు సమాచారం అందించారు. కళాశాలకు వచ్చిన హాల్‌టికెట్, ప్రసాద్ వద్ద ఉన్న హాల్టికెట్లలో సీరియల్ నంబరు సరిపోగా అభ్యర్థి పేరు కల్యాణ్‌కుమార్‌కు బదులుప్రసాద్ అని, తండ్రిపేరు సత్యనారాయణకు బదులు రాంబాబు అని, పుట్టిన తేదీ 13.06.1987కు బదులు 4.1.1995, కులం బీసీడీ కాగా, ఎస్సీ అని ఉన్నాయి. అయితే ప్రసాద్ తయారుచేసిన హాల్‌టికెట్‌లో అడ్రసు కల్యాణ్కుమార్దే ఉంది. సీఐ రఘుశ్రీనివాస్, ఎస్సై శేఖర్ నకిలీ అభ్యర్థి పొడుగు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని, కేసునమోదుచేసి విచారణ చేస్తున్నారు. అలాగే ఎస్.కోట చెందిన వి.శ్రీను విజయనగరంలోని ఎంఆర్ అటానమస్ కళాశాలలో వీఆర్వో పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఆ అభ్యర్థి పలుమార్లు బయటకు వెళ్లడాన్ని, జేబురుమాలు తీసి రాస్తుండడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి రుమాలు ఇమ్మని అడిగినా అభ్యర్థి ఇవ్వలేదు. ఇంతలో కేంద్రానికి చేరుకున్న సర్వీసు కమిషన్ అధికారులు రుమాలును స్వాధీనం చేసుకున్నారు. ఆ రుమాలులో ఏకంగా 40 ప్రశ్నలకు సంబంధించిన జవాబులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ అభ్యర్థిని డీబార్ చేశారు. -
గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభం
అందరికీ సరిపడా అందని ప్రశ్న పత్రాలు ఆందోళన చెందిన అభ్యర్థులు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కొణిజర్ల ,న్యూస్‌లైన్ : పరీక్ష కేంద్రానికి అవసరమైనన్ని ప్రశ్నాపత్రాలు రాకపోవడంతో తనికెళ్ల బ్రౌన్స్ ఫార్మసీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన వీఆర్వో పరీక్ష గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ కేంద్రానికి 600 మంది అభ్యర్థులను కేటాయించగా పరీక్ష పేపర్లు 368 మాత్రమే వచ్చాయి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పేపర్లను బయటకు తీసిన ఛీప్ సూపరింటెండెంట్ వి.జగన్నాథ్ పాత్రో, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు తక్కువగా ఉన్నాయని గమనించి కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవో సంజీవరెడ్డి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ, వీఆర్వో పరీక్షల జిల్లా పరిశీలకురాలు సుశీలకు ఫోన్లో తెలియజేశారు. వారు హుటాహుటిన పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. 232 మందికి పేపర్లు తక్కువగా వచ్చాయని జగన్నాథ్ పాత్రో వారికి చెప్పగా, ఆర్డీవో సంజీవ రెడ్డి తక్షణమే అధికారులను పోలీసుల పహారాలో ఖమ్మం పంపించి కొన్ని ప్రశ్నా పత్రాలను, పక్కనున్న విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గైర్హాజరైన వారి పేపర్లను తెప్పించారు. అయితే, ఒక గదిలో అందరికీ ఒకే సీరియల్లో ఉన్న బుక్లెట్లు రావడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు కాసేపు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రానికి వచ్చిన కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్.. ఒకే సీరియల్లో ఉన్న పత్రాలు వచ్చినా ఫర్వాలేదు.. అభ్యర్థులను దూరంగా కూర్చోబెట్టి పరీక్ష రాయించండని ఆదేశించడంతో ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, జేసీ సురేంద్రమోహన్ ఈ ఘటనపై ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రింటింగ్ కేంద్రంలో బండిల్ కట్టడంలో జరిగిన తప్పిదం వల్లే పేపర్లు తక్కువగా వచ్చాయని, అభ్యర్థులకు సమయం పెంచి పరీక్ష నిర్వహిస్తామని, ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేంద్రాన్ని వైరా డీఎస్పీ బి సాయిశ్రీ, సీఐ మోహనరాజా సందర్శించారు. -
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఓ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓ పరీక్ష ప్రారంభమయింది. 1657 వీఆర్వో పోస్టులకు 13 లక్షల 13 వేల దరఖాస్తు చేసుకున్నారు. 4305 వీఆర్ఎ పోస్టులకు 69 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 239 పట్టణాల్లో 3687 కేంద్రాల్లో వీఆర్వో పరీక్ష, 195 కేంద్రాల్లో వీఆర్ఎ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీఆర్వో పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం మూడు నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 65 వేల మందిని పర్యవేక్షకులుగా నియమించారు.737 ప్రత్యేక ఫ్లయింగ్ స్వాడ్స్ బృందాలు పని చేస్తున్నాయి. 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 20న ఫలితాలను విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలాఖరులోగా పోస్టింగ్ ఇస్తారు. -
4న ప్రాథమిక కీ విడుదల
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల ప్రాథమిక కీని 4న, ఫైనల్ కీని 10న విడుదల చేయనున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టరేట్లో విలేకరులకు ఆయన వివరించారు. జవాబు పత్రాల (ఓఎంఆర్ షీట్లు) మూల్యాంకనాన్ని ఈ నెల 14లోగా పూర్తి చేసి 20 నాటికి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 26న ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన, అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు వివరించారు. 2వేల 97మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సమన్వయకర్తలుగా నలుగురు ఆర్డీవోలను, పరిశీలకులుగా 27 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించామని కలెక్టర్ చెప్పారు. 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను(రెవెన్యూ, పోలీస్ అధికారులు సిబ్బంది ఉంటారు) ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో 137 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2వేల 97 మంది ఇన్విజిలేటర్లు బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు. మహిళా అభ్యర్థినులను తనిఖీ చేయటానికి మహిళా పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. 28 రూట్లలో పరీక్షా పత్రాలను తీసుకెళ్లేందుకు 28 లైజన్ అధికారులు, 137 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు పనిచేస్తారని తెలిపారు. సీఆర్ఆర్ ఇంజినీరింగ్‌లో బఫర్ సెంటర్ వీఆర్వో, వీఆర్ఏ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఒకే పరీక్షా కేంద్రం కాకుండా వేర్వేరు కేంద్రాలకు వచ్చే వారి కోసం వట్లూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బఫర్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. దీనిలో 29మంది పరీక్ష రాసే ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు దారి.. పరీక్షా కేంద్రాలకు దారిచూపుతూ చార్టులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష రోజున ఆర్టీసీ బస్సులను నడిపేలా రీజనల్ మేనేజర్‌తో మాట్లాడామన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల ఏర్పాట్లును జేసీ, డీఆర్వోలు పర్యవేక్షిస్తున్నారన్నారు. సమావేశంలో జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. అభ్యర్థులకు సూచనలు హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బ్లూ లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పరీక్షా కేంద్రానికి గంట ముందు హాజరు కావటం మంచిది ప్రతి అభ్యర్థి వేలిముద్రలు, సిగ్నేచర్‌ను బార్ కోడ్‌తో పరిశీలించిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో లేకపోయినా, స్పష్టంగా కనిపించకపోయినా, ఫొటో చిన్నగా ఉన్నా, ఫొటో ఉండి సంతకం లేకపోయినా వారు మూడుపాస్ పోర్టు సైజు ఫొటోలను గెజిటెడ్ ఆఫీసరుతో ధ్రువీకరణ చేయించి సంబంధిత పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటరుకు ఇవ్వాలి. లేకపోతే అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు పరీక్ష ప్రారంభమైన తరువాత వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రం వదిలి వెళ్లకూడదనే నిబంధన ఉంది సమాధాన పత్రంపై హాల్ టికెట్ నంబరు, ప్రశ్నాపత్రం కోడ్, సబ్జెక్టు, పరీక్షా కేంద్రం పేరు తదితరాలు అందుకు కేటాయించిన స్థానాల్లో మాత్రమే రాయాలి. అలా చేయకపోతే జవాబు పత్రం విలువ లేనిదిగా పరిగణిస్తారు సమాధాన పత్రాలపై నిర్దేశించిన చోట అభ్యర్థులు సంతకాలు తప్పనిసరిగా చేయాలి ఓఎంఆర్ షీట్లు ఒరిజనల్, డూప్లికేట్ రెండు ఇస్తారు. ఒరిజినల్‌ను ఇన్విలిజిలేటరుకు ఇవ్వాలి. డూప్లికేట్‌ను అభ్యర్థి తీసుకెళ్లాలి ప్రశ్న పత్రంపై ముద్రించిన వర్గం (సిరీస్) (‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’)ని సమాధాన పత్రంలో కేటాయించబడిన స్థలంలో 4 వృత్తాల్లో ఒక వృత్తాన్ని పెన్‌తో దిద్దాలి ప్రశ్నాపత్రం (టెస్ట్ బుక్లెట్)పై ఏ విధమైన రాతలు రాయకూడదు తోటి అభ్యర్థులతో సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం, ఇతర మాటలు నిషిద్ధం ఓఎంఆర్ షీటుపై సమాధాన స్థానాల్లో బాల్ పాయింట్ పెన్నుతో పూర్తిగా దిద్దాలి సమాధాన పత్రాన్ని అభ్యర్థులు తీసుకెళ్లకూడదు. అలా చేస్తే అనర్హులుగా పరిగణిస్తారు సమాధాన పత్రాల్లో జవాబు మార్చటానికి వైట్నర్, బ్లేడ్, రబ్బర్ మరేవిధమైన దిద్దుబాటు చేసినా సమాధాన పత్రం పరిశీలించరు. పరీక్షా కేంద్రాల్లో దుష్ర్పవర్తన లేక దుశ్చర్యలకు పాల్పడితే డిబార్ చేస్తారు కాలిక్యులేటర్, సెల్‌ఫోన్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు -
పకడ్బందీగా వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్చార్జ్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరీక్షల ఏర్పాట్ల వివరాలను వెల్లడిం చారు. ప్రశ్నా పత్రాలు తెరిచింది మొదలు పరీ క్ష అనంతరం ఓఎంఆర్ షీట్లు సీల్ చేసే వరకు వీడియో చిత్రీకరిస్తామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష సమయానికంటే గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. విధుల్లో 4,815మంది.. జిల్లాలో వీఆర్ఓ పోస్టులకు 85,431, వీఆర్ఏ పోస్టులకు 4,997దరఖాస్తులు అందాయని చెప్పారు. వీఆర్ఓ పరీక్ష కోసం 11 పట్టణాలలో 278 పరీక్ష కేంద్రాలు, వీఆర్ఏ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని 14కేంద్రాలు కేటాయించి నట్లు వివరించారు. అన్ని సెంటర్లకు సరిపడా అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించామని ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. పరీక్షల కోఆర్డినేటర్‌గా డీఆర్ఓ, అదనపు కో ఆర్డినేటర్లుగా ఆర్డీఓలు వ్యవహరిస్తారన్నారు. అలాగే పరీక్ష కేంద్రం పర్యవేక్షకునిగా సదరు విద్యా సంస్థ ప్రిన్సిపాల్/ప్రధానోపాధ్యాయుడు, పరిశీలకులుగా జిల్లా అధికారులు, లైజన్ అధికారులుగా తహసీల్దార్లు/ఎంపీడీఓలు, సహాయ లైజన్ అధికారులుగా డిప్యూటీ తహసీల్దార్లు/సూపరింటెండెంట్లు/లెక్చరర్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. 29ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణలో మొత్తం 4,815మంది ఉద్యోగులు పాల్గొంటున్నారన్నారు. పుకార్లు నమ్మకండి ఒక్కో వీఆర్ఓ పోస్టుకు 1258 మంది పోటీ పడుతున్నారు. కొంత మంది అభ్యర్థులు దళారులను ఆశ్రయిస్తున్నారనే కథనాలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్మకూడదని అధికారులు తెలిపారు. కేవలం మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు వస్తాయన్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులతో బంధుత్వం ఉన్న ఇన్విజిలేటర్లను తొలగిస్తున్నామని చెప్పారు. అయినా ఇన్విజిలేటర్లుగా కొనసాగిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇన్చార్జ్ కలెక్టర్ హెచ్చరించారు. అభ్యర్థులు తీసుకెళ్లాల్సినవి.. అభ్యర్థులు తమ వెంట బాల్ పెన్నులు(బ్లూ/బ్లాక్), ప్యాడ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దరఖాస్తు చేసిన సమయంలో అందజేసిన మీసేవ, ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా పొందిన రశీ దులు, హాల్ టికెట్లతో సహా హాజరుకావాలి. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో లేకుంటే... అక్కడ ఫొటో అతి కించి గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి. ఇటువంటి అభ్యర్థులు అదనంగా మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాలి. తీసుకెళ్ల కూడనవి.. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, రబ్బర్, వైట్నర్, పెన్సిళ్లు, బ్లేడ్లను లోనికి అనుమతించరు. ఒకవేళ వీటిని వినియోగిస్తే ఓఎంఆర్ షీట్‌ని మూల్యాంకనం చేయరు. మూడు భాషల్లో ప్రశ్నపత్రాలు... ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ఉంటుంది. పరీక్షలు జరిగే పట్టణాలలో జిరాక్స్ సెంటర్లు అన్నీ మూసివేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల పరిధిలో విద్యుత్ సరఫరా ఉంటుంది. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పెట్టి 144 సెక్షన్ విధించారు. అభ్యర్థుల కోసం జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. వేలిముద్రల సేకరణ ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారని వార్తలు మీడియాలో వస్తున్న విషయం తెలి సిందే. ముఖ్యంగా తమవారి కోసం ఉపాధ్యాయులు హాజరవుతున్నారని అధికార యం త్రాంగం గుర్తించింది. ఇటువంటి ఘటనలకు తావులేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష హాల్లోకి వెళ్లే ముందే అభ్యర్థి వేలిముద్రలు సేకరిస్తారు. సదరు అభ్యర్థి ఉద్యోగం పొందితే విధుల్లో చేరే ముందు మరోసారి వేలిముద్రలు తీసుకుం టారు. ఈ రెండు వేలిముద్రలు సరిపోలితేనే విధుల్లో చేరేందుకు అనుమతిస్తారు. లేకుంటే ఉద్యోగం దక్కనట్టే. దీన్ని గ్రహించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులే పరీక్షకు హాజరు కావాలని అధికారులు పేర్కొంటున్నారు. -
సుదూర ‘పరీక్ష’!
100 కిలోమీటర్ల దూరంలో వీఆర్వో పరీక్ష కేంద్రాలు అభ్యర్థులకు తంటాలు, ఆటంకాలు ఖాయం అధికారుల అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపణలు ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’ అన్నట్లుగా.. వీఆర్వో పరీక్ష రాసే అభ్యర్థులు చేరుకోవాల్సిన పరీక్ష కేంద్రం ‘జీవిత కాలం సుదూరం’ అనే చందంగా మారింది అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా. అందుకు ఉదాహరణలివిగో.. మోమిన్‌పేట మండలం టేకులపల్లికి చెందిన వనజాక్షి ఆదివారం వీఆర్వో పరీక్షకు హాజరు కానుంది. పరీక్ష కేంద్రం ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల. ఆమె ఇక్కడికి చేరుకోవాలంటే కనీసం వంద కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. ఉదయం 10గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ముందు రోజు రాత్రే అన్నీ సర్దుకుని రావాలి. యాలాలకు చెందిన మోయిజ్‌కు సైతం ఇదే సమస్య తలెత్తింది. మేడ్చల్ మండలంలోని నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన వీఆర్వో పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో ఆయన యాలాల నుంచి తాండూరుకు, అక్కణ్నుంచి హైదరాబాద్.. సికింద్రాబాద్ మీదుగా ప్రయాణం చేయాలి. పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే కనిష్టంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన వి.సత్యనారాయణకు బీహెచ్ఈఎల్ ప్రభుత్వ కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయిస్తూ హాల్ టికెట్ వచ్చింది. అక్కణ్నుంచి ఆయన పరీక్షకు హాజరుకావాలంటే వంద కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రానికి రావాల్సిందే. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
చేరుకోవడమే ఓ పరీక్ష
వీఆర్ఓ పరీక్ష రాయడం అభ్యర్థులకు కత్తిమీది సామే. పరీక్ష రాయడం ఒక ఎత్తయితే.. నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మరో ఎత్తు. జిల్లాలో ఒక మూల నుంచి మరో మూలలో పడిన కేంద్రానికి చేరుకోవడమే అసలు పరీక్షలా కనిపిస్తోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు 140 నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణించి సకాలంలో పరీక్షకు హాజరుకావాల్సిన పరిస్థితి దాపురించింది. - సాక్షి, నల్లగొండ పోచంపల్లి టు హుజూర్నగర్ భూదాన్‌పోచంపల్లి మండలానికి చెం దిన మౌనిక వీఆర్ఓ పరీక్ష రాస్తున్నది. ఆమెకు హుజూర్‌నగర్‌లో పరీక్ష కేం ద్రం పడింది. పరీక్ష సమయం ఉద యం 10 గంటలైనప్పటికీ...9 గంట లకే చేరుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ఆమె 170 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. పరీక్ష రోజున ఉదయం ఇన్ని కిలోమీటర్లు వెళ్లాలంటే కుదరని పని. లేదంటే ప్రత్యేక వాహనాన్ని తీసుకొని పోవాల్సిందే. ఇది వ్యయంతో కూడికున్నది. పోనీ ఒక రోజు ముందు పోదామన్నా ఆ ప్రాంతంలో బంధువులు, తెలిసినవాళ్లు ఒక్కరూ లేరు. దీంతో ఆమె ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రాజాపేట టు దేవరకొండ కంటి నర్సింహది రాజాపేట మం డలం. వీఆర్ఓ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఇతనికి దేవరకొండలో పరీక్ష కేంద్రం పడింది. ఇతను భువనగిరి, నల్లగొండ మీదుగా దేవరకొండకు చేరుకోవాలంటే 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. అంటే దాదాపు మూడు బస్సులు మారాల్సి ఉంటుంది. పరీక్ష రోజున ఇది సాధ్యపడే విషయం కాకపోవచ్చు. అంటే కచ్చితంగా ఒక రోజు ముందే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య వీరిద్దరిదే కాదు. వీఆర్ఓ పరీక్షకు హాజరయ్యే వేలమంది అభ్యర్థులు దూరం విషయంలో మదనపడుతున్నారు. సాక్షి, నల్లగొండ : ఉద్యోగ అవకాశాలు గగనంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వీఆర్ఓ (గ్రామ రెవెన్యూ అధికారి), వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఉద్యోగం చిన్నదైనా జీవితంలో నిలదొక్కుకోవాలన్న దృఢ సంకల్పంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. పదో తరగతి నుంచి మొదలుకొని ఎంటెక్, ఇతర పీజీ కోర్సులు చేసిన వాళ్లు సైతం పోటీ పడుతున్నారు. జిల్లాలో 68 వీఆర్ఓ పోస్టులకు 83,367; 201 వీఆర్ఏ పోస్టులకు 2,933; ఈ రెండు పోస్టులకు కలిపి మరో 2,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే వీఆర్ఓ పరీక్షకు 85,431 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులకు తిప్పలు... పరీక్ష కేంద్రాల ఏర్పాటుతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వస్థలం నుంచి 100 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్షకు హాజరుకావడమే గగనం. అలాంటప్పుడు 140 నుంచి 170 కి లోమీటర్లు బస్సులో వెళ్లి ఎలా పరీక్ష రాయాలని అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు. పరీక్షకు హాజరుకావాలంటే రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుండడంతో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హుజూర్నగర్ వాళ్లకు దేవరకొండ, బీబీనగర్, పోచంపల్లి వాసులకు హుజూర్నగర్, ఆలేరు, తుంగతుర్తి వాసులకు దేవరకొండలో సెంటర్లు పడ్డాయి. ఇటువంటి వారంతా దూర భయంతో కుంగిపోతున్నారు. ప్రత్యేక బస్సులు వేసినా అంత దూరం ప్రయాణిస్తే అలసట చెందడంతోపాటు, సమయం కూడా అధికంగా పడుతుంది. కనీసం ఒక్కరోజు ముందు వెళ్దామన్నా ఆ ప్రాంతాల్లో ఎవరూ తెలిసినవారు లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పురుషుల పరిస్థితి పక్కనబెట్టినా.. మహిళలే అధికంగా ఆందోళన చెందుతున్నారు. ఒక డివిజన్ పరిధిలోని వాళ్లను పక్క డివిజన్లో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని పలువులు అంటున్నారు. దరఖాస్తు చేసుకున్న విధానాన్ని బట్టి కేంద్రాలు కేటాయించారని తెలిసింది. అంటే వరుసక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఒకే కేంద్రంలో పడిందని సమాచారం. ఈ విధానం ద్వారా అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడి చదివి.. తీరా హాల్‌టికెట్‌లో పరీక్ష కేంద్రాన్ని చూసి నివ్వెరపోతున్నారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటులో హేతుబద్ధత పాటిస్తే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీఆర్ఏ వారికి మధ్యాహ్నం కావడంతో వారికి కొంత వెసులుబాటు కలిగింది.