వీఆర్‌ఓ పరీక్ష రాయడం అభ్యర్థులకు కత్తిమీది సామే. పరీక్ష రాయడం ఒక ఎత్తయితే.. నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మరో ఎత్తు. జిల్లాలో ఒక మూల నుంచి మరో మూలలో పడిన కేంద్రానికి చేరుకోవడమే అసలు పరీక్షలా కనిపిస్తోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు
140 నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణించి సకాలంలో పరీక్షకు హాజరుకావాల్సిన పరిస్థితి దాపురించింది.
- సాక్షి, నల్లగొండ
పోచంపల్లి టు హుజూర్‌నగర్
భూదాన్‌పోచంపల్లి మండలానికి చెం దిన మౌనిక వీఆర్‌ఓ పరీక్ష రాస్తున్నది. ఆమెకు హుజూర్‌నగర్‌లో పరీక్ష కేం ద్రం పడింది. పరీక్ష సమయం ఉద యం 10 గంటలైనప్పటికీ...9 గంట లకే చేరుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ఆమె 170 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. పరీక్ష రోజున ఉదయం ఇన్ని కిలోమీటర్లు వెళ్లాలంటే కుదరని పని. లేదంటే ప్రత్యేక వాహనాన్ని తీసుకొని పోవాల్సిందే. ఇది వ్యయంతో కూడికున్నది. పోనీ ఒక రోజు ముందు పోదామన్నా ఆ ప్రాంతంలో బంధువులు, తెలిసినవాళ్లు ఒక్కరూ లేరు. దీంతో ఆమె ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
రాజాపేట టు దేవరకొండ
కంటి నర్సింహది రాజాపేట మం డలం. వీఆర్‌ఓ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఇతనికి దేవరకొండలో పరీక్ష కేంద్రం పడింది. ఇతను భువనగిరి, నల్లగొండ మీదుగా దేవరకొండకు చేరుకోవాలంటే 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. అంటే దాదాపు మూడు బస్సులు మారాల్సి ఉంటుంది. పరీక్ష రోజున ఇది సాధ్యపడే విషయం కాకపోవచ్చు. అంటే కచ్చితంగా ఒక రోజు ముందే చేరుకోవాల్సి ఉంటుంది.
ఈ సమస్య వీరిద్దరిదే కాదు. వీఆర్‌ఓ పరీక్షకు హాజరయ్యే వేలమంది అభ్యర్థులు దూరం విషయంలో మదనపడుతున్నారు.
సాక్షి, నల్లగొండ : ఉద్యోగ అవకాశాలు గగనంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వీఆర్‌ఓ (గ్రామ రెవెన్యూ అధికారి), వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఉద్యోగం చిన్నదైనా జీవితంలో నిలదొక్కుకోవాలన్న దృఢ సంకల్పంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. పదో తరగతి నుంచి మొదలుకొని ఎంటెక్, ఇతర పీజీ కోర్సులు చేసిన వాళ్లు సైతం పోటీ పడుతున్నారు. జిల్లాలో 68 వీఆర్‌ఓ పోస్టులకు 83,367; 201 వీఆర్‌ఏ పోస్టులకు 2,933; ఈ రెండు పోస్టులకు కలిపి మరో 2,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే వీఆర్‌ఓ పరీక్షకు 85,431 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
అభ్యర్థులకు తిప్పలు...
పరీక్ష కేంద్రాల ఏర్పాటుతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వస్థలం నుంచి 100 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్షకు హాజరుకావడమే గగనం. అలాంటప్పుడు 140 నుంచి 170 కి లోమీటర్లు బస్సులో వెళ్లి ఎలా పరీక్ష రాయాలని అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు. పరీక్షకు హాజరుకావాలంటే రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుండడంతో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హుజూర్‌నగర్ వాళ్లకు దేవరకొండ, బీబీనగర్, పోచంపల్లి వాసులకు హుజూర్‌నగర్, ఆలేరు, తుంగతుర్తి వాసులకు దేవరకొండలో సెంటర్లు పడ్డాయి. ఇటువంటి వారంతా దూర భయంతో కుంగిపోతున్నారు. ప్రత్యేక బస్సులు వేసినా అంత దూరం ప్రయాణిస్తే అలసట చెందడంతోపాటు, సమయం కూడా అధికంగా పడుతుంది. కనీసం ఒక్కరోజు ముందు వెళ్దామన్నా ఆ ప్రాంతాల్లో ఎవరూ తెలిసినవారు లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పురుషుల పరిస్థితి పక్కనబెట్టినా.. మహిళలే అధికంగా ఆందోళన చెందుతున్నారు. ఒక డివిజన్ పరిధిలోని వాళ్లను పక్క డివిజన్‌లో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని పలువులు అంటున్నారు.
దరఖాస్తు చేసుకున్న విధానాన్ని బట్టి కేంద్రాలు కేటాయించారని తెలిసింది. అంటే వరుసక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఒకే కేంద్రంలో పడిందని సమాచారం. ఈ విధానం ద్వారా అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడి చదివి.. తీరా హాల్‌టికెట్‌లో పరీక్ష కేంద్రాన్ని చూసి నివ్వెరపోతున్నారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటులో హేతుబద్ధత పాటిస్తే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీఆర్‌ఏ వారికి మధ్యాహ్నం కావడంతో వారికి కొంత వెసులుబాటు కలిగింది.
చేరుకోవడమే ఓ పరీక్ష
Published Thu, Jan 30 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement