పరీక్షా కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న అభ్యర్థులు
మంచిర్యాలటౌన్: వీఆర్వో పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష సందర్భంగా కాపీయింగ్ యత్నం జరగడం కలకలం సృష్టించింది. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కళాశాల కరస్పాండెంట్ పెట్టెం మల్లేశ్ కూతురు పెట్టెం సాహితికి ఇదే కళాశాలలో పరీక్ష కేంద్రం పడింది. ఈ కేంద్రానికి మహేందర్‌ను చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్)గా నియమించగా.. ఆయన స్థానంలో పెట్టెం శ్రీకర్ సీఎస్‌గా విధులు నిర్వర్తించారు. రూమ్ నంబర్ 2లో పరీక్ష రాస్తున్న సాహితికి తరచూ ఆరోగ్య సమస్య అంటూ వచ్చి ట్యాబ్లెట్లు ఇవ్వడం, మరో గదికి తీసుకెళ్లడం వంటివి చేయడంతో ఆ గదిలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అనుమానం వచ్చింది. శ్రీకర్ జవాబులు రాసి ఉన్న చిట్టీని సాహితికి ఇవ్వడంతోపాటు పరీక్ష రాసే స్థలాన్ని మరోచోటకు మార్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళకు దిగారు. లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని సాహితి నుంచి ఓఎంఆర్ షీట్ తీసుకుని, విచారణ చేపడతామని చెప్పడంతోపాటు ఆమెను పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావును సంప్రదించగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వీఆర్వో పరీక్షకు ఒకే ఒక్కడు..
కెరమెరి (ఆసిఫాబాద్): దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమీప ప్రాంతాల్లో వీఆర్వో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాల్సి ఉండగా, ఆప్షన్లతో సంబంధం లేకుండా పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు నానా ఇబ్బందులు పడ్డారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 240 మందికి 75 మంది మాత్రమే హాజరయ్యారు. ఇదే పరీక్ష కేంద్రంలో రూం నంబర్ 9లో 24 మందికిగాను ఒకే ఒకడు హాజరు కావడం గమనార్హం. పెద్దపల్లికి చెందిన ఒకే అభ్యర్థి ఇక్కడ పరీక్ష రాశాడు. ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపల్లికి చెందిన అనిల్‌కుమార్ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు మోటారుసైకిల్‌పై బయలుదేరి పరీక్ష కోసం 275 కి.మీ.(రానుపోను 550 కి.మీ.) దూరంలో ఉన్న కెరమెరికి వచ్చి పరీక్ష రాయడం కొసమెరుపు!
చాలా ఇబ్బంది పడ్డా!
శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంకాలం ఆసిఫాబాద్‌కు చేరా. అక్కడే లాడ్జిలో ఉండి ఉదయాన్నే కెరమెరి వెళ్లా. దరఖాస్తు కూడా ప్రారంభంలోనే చేశాను. కుమురం భీ జిల్లాను 8వ ఆప్షన్‌గా ఎంచుకున్నా. అయితే ఇంతదూరం పరీక్ష కేంద్రం వేయడంతో చాలా ఇబ్బంది పడ్డా . ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
వీఆర్వో ప్రశ్నపత్రం లీక్?
జనగామ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు చెబుతున్నా.. జనగామ జిల్లా కేంద్రంలో మాత్రం ప్రశ్న పత్రం లీకైందన్న చర్చ జోరుగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనగామలోని హన్మకొండ రోడ్డులోగల ఓ పరీక్ష కేంద్రం నుంచి గుర్తుతెలియని యువకుడు వీఆర్వో పరీక్ష పత్రాన్ని తీసుకొని సిద్దిపేట రోడ్డులోని ఓ జిరాక్స్ సెంటర్ వద్దకు పలుమార్లు వచ్చి జిరాక్స్ తీయమని కోరినట్లు తెలిసింది. అయితే సదరు యజమాని జిరాక్స్ తీసేందుకు తిరస్కరించడంతో వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీసినట్లు సమాచారం. అయితే, లీక్ జరగలేదని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment