గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు
ప్రజాపాలన ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
ఆర్‌ఎంపీ డాక్టర్, డిప్యూటీ తహసీల్దార్‌ను కమిషన్ సభ్యులుగా నియమించారు
మేం ఉన్నత చదువులు చదివిన, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని నియమించాం
ఒక్క ఏడాదిలో వైద్యారోగ్యశాఖలో14 వేల ఉద్యోగాలిచ్చాం
మీరెన్నుకున్న ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి.. విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు
అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేత
సాక్షి, హైదరాబాద్: గత పాలకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను రాజ కీయ పునరావాస కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అదే తాము ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారిని టీజీపీఎస్సీలో నియమించామని చెప్పారు. ఏడాది ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సోమవారం ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... సీఎం చేతుల మీదుగా 422 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు.
16 నర్సింగ్ కళాశాలలను, 32 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గతంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ను, డిప్యూటీ తహసీల్దార్‌ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఒక కలెక్టర్‌ను సెక్షన్ ఆఫీసర్, అటెండర్ నిర్ణయించలేరు కదా. అందుకే ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని టీజీపీఎస్సీలో నియమించాం.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలతో 563 మంది గ్రూప్–1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. టీజీపీఎస్సీ పనితీరుకు ఇది గీటురాయి. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేస్తుంటే మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ సర్వేల్‌లో చదివిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను కమిషన్ చైర్మన్‌గా నియమించాం.
రికార్డు స్థాయిలో నియామకాలు చేశాం
ఏడాదిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య శాఖలో నియమించడం దేశంలోనే రికార్డు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చి ఎలాంటి వసతులూ కల్పించలేదు. కానీ మేం దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కొత్తగా 6,500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని నిర్ణయించాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు.
ఈ విషయంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తేనే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునేవాళ్లు. డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు
2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు అపోలో, యశోదా వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించి ఆదుకున్నారు. అలాంటి ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. గత ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.835 కోట్లను ప్రజలకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఇప్పటివరకు కోటీ 15 లక్షల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారు. మేం 50లక్షల కుటంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కచ్చితంగా ఇచ్చి తీరుతాం. మేం రుణమాఫీ పూర్తి చేయడంతో కొందరి గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. కొందరు ఫాంహౌజ్‌లలో పడుకుని బాధపడుతున్నారు. మేం సన్నవడ్లకు ఇస్తున్న బోనస్‌తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. బోనస్ కొనసాగిస్తుంది. సన్నాలు పండించండి. బోనస్ తీసుకోండి.
ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోండి
సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దులు, బసవన్నల్లా కొందరు ఇప్పుడే వస్తున్నారు. వాళ్లు ఎన్ని సన్నాయిలు ఊదినా.. అది సర్పంచి ఎన్నికల కోసమే. ఢిల్లీలో 11 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ మాపై విమర్శలు చేస్తున్నాయి. ఈ 10 నెలల్లో అద్భుతాలు జరుగుతాయా? ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. ప్రభుత్వంపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి..’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజారోగ్యంపై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది: భట్టి
రాష్ట్రంలో పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆరోగ్య ఉత్సవంలో ఆయన మాట్లాడారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని.. ఆరోగ్యశ్రీని, ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో పేదల వైద్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఇక మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని.. అదనంగా రూ.487.29 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల కోసం దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్‌లను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment