నాగావళి నది ఒడ్డున ఫిట్స్‌వ్యాధితో పడిపోయిన యువకుడు
సాయమందకపోవంతో అక్కడికక్కడే మృతి
శ్రీకాకుళం సిటీ : మూర్చరోగమే ఓ యువకుడిపాలిట మృత్యువైంది. వేకువజామున నదీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో మూర్చవచ్చి పడిపోగా.. సాయమందించేవారెవ్వరూ లేకపోవడంతో అతడి ప్రాణం పోయింది. ఒకటో పట్టణ ఎస్‌ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అరసవల్లి ఇందిరా విజ్ఞాన్‌భవన్ సమీపంలో పి. కోణారు(18) అనే యువకుడు తల్లిదండ్రులు అప్పన్న, జిడ్డోరులతో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబంతో కలిసి స్క్రాప్ వస్తువులను సేకరిస్తు ఉంటాడు.
అయితే చిన్నప్పటి నుంచి అతడు ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. బుధవారం వేకువజామున కూడా యథావిధిగా స్క్రాప్ వస్తువుల సేకరణకని గోనె సంచితో పట్టుకుని నాగావళి నదీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ హఠాత్తుగా ఫిట్స్ రావడంతో అక్కడడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపటికి మృతి చెందాడు. అటువైపుగా వెళ్లిన స్థానికు చూసి ‘100’కు ఫోన్ చేయగా తమకు సమాచారం అందిందని ఎస్‌ఐ తెలిపారు. కోణారుకు చిన్నప్పటి నుంచి మూర్చరోగం ఉందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నాడు.. రెండో కుమారుడు.. నేడు పెద్ద కొడుకు
అప్పన్న దంపతులకు కోణారు పెద్ద కుమారుడు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో రెండో కుమారుడు మృతిచెందాడు. ఈ దంపతులకు మరో ఇద్దరు కుమారులున్నారు. సంఘటన స్థలం వద్ద కోణారు మృతదేహాన్ని అతడి తల్లి ఒడిలో పెట్టుకుని రోదించిన తీరు చూపరులకు కంటతడిపెట్టించింది.
మూర్చ రోగమే మృత్యువయ్యింది!
Published Wed, Apr 6 2016 11:16 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement